…
ఏ మాట కా మాటే చెప్పుకోవాలి.మా ఆవిడకు కొంచం షాపింగ్ పిచ్చి ఎక్కువే, ( మా ఆవిడకు నా బ్లాగు సంగతి తెలీదు లెండి.
అందుకని ఇంత ధైర్యంగా నిజాలు రాస్తున్నాను.) మొన్నా మధ్య మా ఆవిడ ఊరు వెళ్ళే ముందు అంటే NIL భీమ పాకం జరగడానికి ముందు, ఏదో షాపింగ్ చేయడానికి నన్ను రమ్మంది. నేను మామూలుగా నా కారుకు ఓనర్ గానే ఫీల్ అవుతాను, మా ఆవిడతో షాపింగ్ కు వెళ్ళేటప్పుడు మాత్రం డ్రైవర్ అవతారం లోకి పరకాయ ప్రవేశం చేస్తాను.
పెళ్ళైన కొత్తలో ఎప్పుడో నిర్ణయించుకున్నట్టు, మా ఆవిడ ఎప్పుడు షాపింగ్ వెళ్ళాల్సి వచ్చినా నేను తనని షాపింగ్ మాల్ లో వదిలేసి (నా పర్సు కూడా) పార్కింగ్ లో ఉండే నా కార్లో కూర్చోని రెండో నాలుగో పుస్తకాలు చదివి పారేస్తాను. ఈ లోగా మా ఆవిడ నా పర్సును ఊదేస్తుంది. తర్వాత చదివేసిన పుస్తకాలను నెమరు వేసుకుంటూ నేను, కొనేసిన వస్తువులు తడుము కుంటూ మా ఆవిడా ఆనందం గా ఇంటికి చేరతాము.
అలా ఆ రోజు పార్కింగ్ లో కూర్చొని నేను ఎడ్వర్డ్ డి బోనో రాసిన Serious Creativity ని లాగించేసాను. షాపింగు బాగా జరిగిందేమో, మా ఆవిడ కూడా ఉత్సాహంగా ఉంది. అదేంటో ఎంత షాపింగ్ చేసినా మా ఆవిడ ఎప్పుడూ అలసిపోదు. ఉత్సాహంగా ఇద్దరం ఇంటికి వెళ్తూ ఉండగా మా ఆవిడ అంది.
“షాపింగ్ మాల్ లో స్వప్న వాళ్ళు కనబడ్డారు అండీ. వాళ్ళ మరదలు కూడా ఇప్పుడు ఇక్కడే ఉంది. మీరు తనకు పాజెక్టు వర్క్ లో చాలా హెల్ప్ చేసారటగా, మిమ్మల్ని ప్రత్యేకంగా ఆడిగింది. ప్రసాదం బావున్నాడా! ” అని.
“ఇంకా ఎవరు కనిపించారు? ” అడిగాను నేను కారులో మ్యూజిక్ ఆన్ చేస్తూ.
“మీ రాధిక కనిపించలేదు లెండి. కాకపోతే మీ కోలీగ్ సురేఖ ఇంకా ఆమె ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు కూడ అడిగారు, ప్రసాదం బావున్నాడా అని, మొత్తానికి మంచి పేరు సంపాదించారు ఇక్కడ కూడా” అంది.
“నాకు రాధిక అనే గర్లు ఫ్రెండు ఉంది, తను ఎప్పుడు కావాలంటే అప్పుడు నా దగ్గరికి వచ్చేస్తుంది. నిన్ను చేసుకున్నాను అని తనకు అభ్యంతరం అదీ ఏమీ లేదు” అని మా ఆవిడను పెళ్ళి అయినప్పటి నుండీ ఉడికిస్తున్నాను. ఆ విషయాన్నే అప్పుడప్పుడూ ఇలా దెప్పుతుంది. నన్ను ఎంత దెప్పినా, మా ఆవిడకు నా మీద అనుమాణమే, నిజంగా రాధిక ఉందేమో, ఎప్పుడైనా తను వస్తుందేమో అని. దానికి తోడు “నన్ను సరిగ్గా చూసుకోక పోతే నేను రాధిక ను పిలుస్తాను” అని నేను మరింత ఉడికించేవాన్ని.
స్టీరియో లో జేసుదాసు “ఓ బాటసారి, ఇది జీవిత రహదారి…” అంటూ పాట ఎత్తుకుంటుండగా, నేను చదివిన పుస్తకం లోంచి డీ బోనో నా బుర్ర పై తడిమాడు. కమాన్ ప్రసాదం, కొంచం క్రియేటివ్ గా ఆలోచించు అని, అంతే నాకు గొప్ప ఆలోచన వచ్చేసింది.
“చూసావా అందరూ నన్ను ప్రసాదం బావున్నాడా అని ఎలా అడుగుతున్నారో,” అన్నాను నేను.
“మరి ఇంక ఏవని ఆడుగుతారు మీ గురించి?” అంది మా ఆవిడ
“వాళ్ళంతా నన్ను ప్రేమగా ప్రసాదం బావున్నాడా అని ఆడిగారు కదా, నీకు ఏం అర్థం కాలేదా?” అన్నాను సిగ్నల్ దగ్గర కారు స్లో చేస్తూ.
“అందులో తప్పేం ఉందీ …” కను బొమలు ముడేసింది మా ఆవిడ .
” ప్రసాదం బావున్నాడా అని అడిగారు కదా, బావున్నాడా అంటే బావ + ఉన్నాడా అని అనుకోవచ్చు కదా” అన్నాను తనని ఉడికిస్తూ,
డీ బోనో ఈ సారి నా భుజం తడిమాడు భేష్ అన్నట్టుగా,
“ఏమిటీఈఈ , వాళ్ళంతా నిన్ను బావా అంటున్నారా? లేక ఆలా అనిపించుకోవాలి అని మీకు అనిపిస్తోందా? ఇంటికి పదండి. ఈ సంగతి తేలిపోవాలి ఈ రోజు…” అని మా ఆవిడ అంటుండగానే నేను అన్నదాంట్లో తప్పు నాకు అర్థం అయింది.
స్టీరియో లో జేసుదాసు శృతి పెంచాడు. “….ఇప్పుడు తప్పును తెలుసుకొని, జరిగేదేమిటని? క్షమించదెవ్వరినీ…”
డీ బోనో తడుముతాడేమో అని చూసా, కానీ ఆయన ఎప్పుడో మాయమై పోయాడు.
నేను ఆ రాత్రి మా ఆవిడను బతిమాలి, బామాలి నాకు అలాంటి ఉద్దేశం ఎమీ లేదని వివరించేసరికి నాకు డీ బోనో తాతలు కనిపించారు. డీ బోనో మాత్రం మళ్ళీ కనిపించలేదు.
చివరికి మా ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ అంది. “అయితే రాధిక కూడ అబద్దం కదా,…”
“అబ్బా, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు..”. అన్నాను. తనని ఉడికించే అవకాశం వదులుకోవడం నాకు ఇష్టం లేదు మరి.
“మరీ, మరీ,… డీ బోనో పద్దతి లో రాధిక అంటే, రాదు + ఇక = రాధిక. నాకు తెలుసు, నువ్వు నన్ను ఉడికించదానికి అలా చెప్పావు ..” అని పూర్తిగా కళ్ళు తుడుచుకుని నవ్వేసింది మా ఆవిడ.
ఇంకేముంది నాకు తనని ఉడికించడానికి ఉన్న ఒక్క అవకాశం కూడా పోయింది.
ప్రసాదం యొక్క టపా