కను రెప్పల కౌగిలిలో, నును సిగ్గుల లోగిలి లో…

ఫిబ్రవరి 13, 2008

ప్రియమైన నీ,

          కనురెప్పల కౌగిలిలో, నును సిగ్గుల లోగిలి లో,
          కలలు కనే మనసును కాలం తో కదిపితే, కదిలే  నా ఆశలు …
          ఇలా,
          పరుచుకున్న అక్షరాలు,
          పరువపు విరి శరముల వ్రాలు..
 
          గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో విరిసిన ఆ రాత్రి,..

          నుదుట కుంకుమ బొట్టు పెట్టి,
          వలపు తలపుల చీరకట్టి,
          సిగ్గు పక్కన ఒగ్గి పెట్టి,
          బుగ్గ చుక్కన ముద్దు పెట్టి,

          గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో తడిసిన ఆ రాత్రి,..

          పలకరింతలే పులకరింతలై,
          నిలువరింతలే పలవరింతలై,
          కనులు కావ్యపు  కవితలల్లగా,
          పెదవి శ్రావ్యపు మరులు చల్లగా,
 
          గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో గడచిన ఆ రాత్రి,..

          పులకరింతలే పలకరింతలై,
          పలవరింతలే నిలువరింతలై,
          నే కౌముదిలో నిను చూచి,
          నీ కౌగిలిలో నను దాచి,

          గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో ఎగసిన ఆ రాత్రి,..

          పరవశమే పరిచయమై,
          పరువంలో విరి శరమై,
          మనసంతా నీ వశమై,
          మది అంతా పరవశమై,
 
          గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో ముగిసిన ఆ రాత్రి,..

          నువ్వూ నేనూ ఒక స్వరంగా
          నువ్వే నాకై ఒక వరంగా,
          నా మనసులో మిగిలుండనీ !
          నీ మనసుగా నను వుండనీ !!


లెక్కలేనంత ప్రేమతో,

నీ  కనురెప్పల కౌగిలిలో…

=======================================================

నాకు అందనంత దూరాన వున్న నీకు, “నన్ను” నేను అందించే ప్రయంత్నంలో,
ఇదంతా…

నన్నందుకుంటావని, ఎదకందుకుంటావని,,
ఆశతో…, అదే శ్వాసతో…

నేను 


ఏ TVగ మము దయ జూచెదవో… (తుది భాగం)

అక్టోబర్ 18, 2007

మొదటి భాగం ఇక్కడ చదవండి. 

ఎత్తు పైఎత్తు తో అత్త కోడలి పాట్లు
టూ టౌను త్రీ టౌను నరుడి అగచాట్లు
కళ్ళెదుట మిరుమిట్లు పెళ్ళాల సిగపట్లు
కుళ్ళు కథలతో తల తూట్లు తూట్లు

పనులు మానిన జనులు గుడ్లప్పగించంగ
తెరచి ఉంచిన నోట తెగక కారును చొంగ
రంగు బొమ్మల గంగ అందరూ మునగంగ
ఇల్లు సర్దుకు పోవు దర్జాగ దొంగ

గడ్డి తినగలిగితే వాడే ఘనాపాఠి
సిగ్గునొగ్గేసేటి సాహసులె మేటి
చెయ్యగలిగితే ఫీటు వెయ్యి రూకల పోటీ
చానళ్ళు ఛాలెంజి ఒక దానికొకటి

అమ్మాయి పెళ్ళిని అనుక్షణము చూపించి 
ఆయన ఇంటి విషయాన్ని అందరికీ పంచి
అయ్య పరువును తీసి ఇంట ఆగ్గి రాజేసి
చెయ్యగలరా? “మెరుగైన సమాజం” చెత్త పోగేసి   

మీ పాట మా ఆట తీరునట తీట
సినిమాల చిందుకేనట ఇక  పెద్ద పీట
కళలంటే ఇవేగా మన తెలుగు నాట
కథ మలుపు తిరిగేను అథొగతి బాట