ఒక బుధవారం, రావాలి ప్రతివారం…

సెప్టెంబరు 7, 2008


దాదాపుగా లొసుగులు లేని మంచి పటుత్వంతో అల్లుకున్న కథ, వీక్షకులను మునివేళ్ళపై నిలబెట్టే కథనం వూహించని ట్విస్టులు, నిరుపమానమైన నటన వెరసి అద్భుతమైన చిత్రం చూసిన అనుభూతి. ఇదీ ఈ వారం విడుదలైన “A Wednesday” చిత్రం తాలుకూ సమీక్ష సంగ్రహం.

ఒక బుధవారం, రావాలి ప్రతివారం...


పదవీ విరమణ చేయబోతున్న ఒక పోలిస్ అధికారి (అనుపం ఖేర్) తన పూర్తి వృత్తి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన, ఎక్కడ ఎలాంటి రికార్డులలో కూడా నమోదు కాకున్నా అత్యంత సవాలుగా నిలబడ్డ కేసు వివరాలు చెబుతుండగా చిత్రం అసలు కథ ప్రారంభం అవుతుంది. ఓ బుధవారం రోజు ముంబై పోలీస్ కమీషనర్ కార్యాలయం దగ్గరలో వున్న పోలిస్ స్టేషన్లో RDX బాంబును ప్లాంట్ చేసిన ఓ టెర్రరిస్టు (నసిరుద్దీన్ షా) ముంబై లో మరిన్ని బాంబులు పేలడానికి సిద్దంగా వున్నాయి అని కమిషనర్ కు ఫొన్ చేయడంతో ఉలిక్కి పడిన పోలీస్ యంత్రాగం, సదరు టెర్రరిస్టు అసలు మంత్రాంగం, ఆ తరువాత జరిగిన నాలుగైదు గంటల ఉత్కంఠపూరితమైన కథ ఈ చిత్రం సొంతం.


దర్శకుడు నీరజ్ పాండే అద్బుతమైన్ స్క్రీన్-ప్లే తో తనదైన ముద్ర ను చూపించాడు. సినిమా పూర్తయిన తరువాత అనిపించింది, “నిజంగా ఇలా జరిగితే బావుండును” అని. సగటు ముంబై వాసి సమస్యను, టెర్రరిజాన్ని కలగలిపి తనదైన పరిష్కారాన్ని బిగి సడలని థ్రిల్లర్‌గా రూపొందించడం దర్శకుడికే చెల్లింది. పోలిస్ కమీషనర్‌గా అనుపం ఖేర్, టెర్రరిస్ట్(?)గా నసిరుద్దిన్ షా తమ పాత్రలలో జీవించారు. అన్నట్టు చిత్రంలో ఒక్క పాట కూడా లేదు అన్న విషయాన్ని చిత్రం అయిపోయిన కాసేపటికి గానీ నేను గుర్తించలేదు.


థ్రిల్లర్ చిత్రం కాబట్టి ఇంతకన్న ఎక్కువ చెప్పడం వీక్షకుల ఆనందాన్ని పాడు చేయడమే అవుతుంది. సందేహం లేకుండా థియేటర్ లో చూడదగిన చిత్రం “A Wednesday”..


చూడబోతే భారతీయ సినిమాకు మంచిరోజులు వస్తున్నట్టు వున్నాయ్. ఇలాంటి చిత్రం వారానికి ఒకటి వస్తే భారతీయ సినిమాకు పండగే కదా, అందుకే (“A Wednesday”) ఒక బుధవారం, రావాలి ప్రతివారం….


నా రేటింగ్ 4.5/5.0.


సాగర సంగమం

డిసెంబరు 9, 2006

ఆంధ్రదేశమంతా, “ఆకుచాటు పిందె తడిసే..” లకు పరవశించి పోతుండగా, రసిక హౄదయులంతా వళ్ళంతా కళ్ళు చేసుకొని తెలుగు చిత్ర వినోద ప్రపంచానికి రెండు కళ్ళుగా ఉన్నా జయమాలిని, జ్యొతి లక్ష్మి లను చూస్తున్న రోజులవి. ఆదిగో అప్పుడు ఓ కళాతపస్వి  శంకరాభరణం తో తెర తీసి, సాగర సంగమాన్ని సాదించాడు. ఏలా సాధించాడో మనందరికీ తెలిసినా మరోసారి పునశ్చరణ చేసుకొనే ప్రయత్నమే ఈ సాగర సంగమం.

ఈ చిత్రం లో కూడా కళాతపస్వి   దర్శకత్వ ప్రతిభ అద్భుతంగా ప్రకటితమవుతుంది. చిత్ర ప్రారంభంలో టైటిల్సు వేసేప్పుడే, నేపథ్యం లో వచ్చే సంగీతం మరియు చిత్రాల ద్వారా ప్రేక్షకులని శాస్త్రీయ నాట్య భరిత చిత్రాన్ని చూడడానికి సన్నద్దులని చేస్తాడు. ప్రేక్షకులందరినీ రవీంద్ర భారతిలో జరిగే నాట్యం లో కూర్చోబెట్టి, సరైన  దైహిక సంస్కారం లేని వ్యక్తిని విలేఖరుల వరుసలో కూర్చోబెట్టడం ద్వారా, ప్రేక్షకుల్లో ఒక రకమైన ఉత్సుకత ని రేకెత్తిస్తాడు. అనామకుడిగా కనిపించే కథా నాయకుడు నాట్య మయూరి నాట్యంలో ఒక పెద్ద దోషాన్ని పసిగట్టి ప్రకటించడం తో ప్రేక్షకులకు ఆ తప్పేమిటో తెలుసుకోవాలన్న కోరిక పెరిగిపోతుంది. (మరి కమలహసన్ చూపించే వరకూ మనకూ ఆ తప్పేమిటో తెలీదు. ఓక సారి తెలిసిన తర్వాత మనమూ అది తప్పేనని అంగీకరిస్తాము.) ఈ సంఘటనతో మనకు కథనాయకుడిపై అపరిమితమైన గౌరవం పెరుగుతుంది. అందువల్లే కమలహసన్ వివిధ సంప్రదాయాల్లో ఆ చరణాన్ని (పంచభూతములు ముఖ…) ప్రదర్శించి చూపించి బయటకు వెళ్తుండగా,  అక్కడి ప్యూను నమస్తే సార్ అనడాన్ని మనం మనకు తెలియకుండానే ఆస్వాదిస్తాము. ఎందుకంటే కమలహసన్ పట్ల మనకు కూడా ఆ క్షణం లో అంత గౌరవ భావం ఉంటుంది మరి. దర్శకత్వం అంటే ఇదీ.

ఇదే విదమైన సీక్వెన్సు రజనీకాంత్ చిత్రం లో కనిపిస్తుంది.  ఓక అతి మామూలు ఆటో డ్రైవరు కు గొప్ప నేపథ్యం ఉండడం ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. అయితే సాగరసంగమము స్థాయిలో ఈ రజనీకాంత్ చిత్రం సీక్వెన్సు విజయవంతం కాకపోడానికి కారణం ఏమిటంటే, ప్రేక్షకుడు సాగరసంగమము లోని సంఘటనను అంగీకరించినంతగా, ఆటో డ్రైవరు సంఘటనను అంగీకరించలేకపోవడము.

సాగరసంగమం చిత్రంలో మనకు కథనాయకుడి పట్ల అపరిమిత గౌరవం పెరగగానే, ఆ వెంటనే వచ్చే చిత్ర కథనంలో  శరత్ బాబు చేత “నువ్వు నాకు అన్నవా తమ్ముడివా?” అంటూ పలికించడంతో ప్రేక్షకులలో మరింత ఉత్సుకత మొదలవుతుంది. అదే బిగువును చివరి వరకూ ఉంచడంతో ఈ చిత్రం తెలుగు చలన చిత్రాల్లో ఒక మైలురాయిగా మిగిలి పోయింది.

ఆంతటి బిగువు కథనంలో ఎలా వచ్చిందో మరోసారి చెప్పుకుందాం.

మరి  విజ్ఞులైన మీరు ఏమంటారో చెప్తారా?