ఇటాలియన్ శంకరాభరణం = Malèna

డిసెంబర్ 16, 2014

సృష్టిలోని సమస్త జీవరాశులను స్పందింపజేయగల శక్తి కేవలం రెండింటికే పరిమితం. మొదటిది సంగీతం. రెండవది శృంగారం. సంగీతాన్ని ఆరాధించిన ఓ (వేశ్యగా ముద్రపడిన) యువతి కథ కె. విశ్వనాథ్ గారి శంకరాభరణం అయితే, వేశ్యగా ముద్రపడిన ఓ యువతి అందాన్ని ఆరాధించే కుర్రాడి కథ “Giuseppe Tornatore” తెరకెక్కించిన ఇటాలియన్ చిత్రం Malèna. ప్రపంచవ్యాప్తంగా, భాషా సంస్కృతులకతీతంగా ప్రజల్ని కదిలించే కథలు ఒకేలా వుంటాయి కాబోలు. ఒకే రకం మూసలో ఒదిగిన ఈ చిత్రాల ఒరవడే అందుకు సాక్ష్యం. రెండు చిత్రాల్లోనూ మొదటినుండి చివరివరకూ అంతర్లీనంగా అల్లుకుపోయిన భావన ఒక్కటే, అవధుల్లేని ఆరాధన. రెండు చిత్రాల్ని ఒడిసి నడిపిన అంతఃసూత్రం ఒక్కటే, అద్భుతమైన క్లుప్తత. ఎంతటి గాఢమైన క్లుప్తత అంటే, రెండు చిత్రాల్లోని ప్రధాన పాత్రధారుల మధ్య ఒకే ఒక వాక్యపు సంభాషణ. అంతే!

Sankarabharanam-1

శంకరశాస్త్రికి తులసికి మధ్య సంభాషణలున్నాయా లేదా అన్న అనుమానం తీర్చుకోవడానికే, ఓ సారి ప్రత్యేకంగా శంకరాభరణం చూసాను. వారిద్దరి మధ్య ఉన్నఒకే ఒక సంభాషణ – “ఏం నీకు వంటచేయడం చేతకాదా? పసి పిల్ల; అది మడిగట్టుకొని వంటచేయలేక అవస్థ పడుతుంటే, చేతనైన వాళ్ళు వెళ్ళి సహాయం చేయొచ్చు కదా. ఆచార వ్యవహరాలు, మనసును క్రమమైన మార్గంలో పెట్టటానికి కాని, మనుషులను కులమనే పేరుతో విడదీయడానికి కాదు, తులసి.

తెలుగువాడికి, శంకరాభరణం గురించి చెప్పనక్కరలేదు కానీ, నా ఈ విశ్లేషణ కోసం, Malèna చిత్ర కథ కాస్త వివరంగా చెప్పక తప్పదు.

Malèna

అవి రెండవ ప్రపంచ యుద్దపు రోజులు. సైనికుడైన భర్త యుద్దంలో పాల్గొనడానికి వెళ్ళిపోవడంతో, ఒంటరిగా మిగిలిపోయిన అతని పాతికేళ్ళ పడుచు భార్య Malèna అందంపై యవ్వనపు తొలి గడపలో ఉన్న 12-13 ఏళ్ళ కుర్రాడు Renato ఆరాధన, ఈ చిత్రపు మూలకథ. అప్పుడే యవ్వనం అంకురిస్తున్న Renato లాంటి స్కూలు కుర్రాళ్ళ నుంచీ, కాటికి కాళ్ళు చాపుకున్న ముదుసలి వరకూ మగతనపు ఛాయల్లో ఉన్న ప్రతీ మనసునీ అల్లరి పెట్టగల గొప్ప సౌందర్యరాశి Malèna. భర్త తప్ప మరొకరు ఎరగని అమలిన. ఆమె నేలవైపు చూస్తూ ఊళ్ళో నడుస్తున్నా, ఊళ్ళో నేలపై నిలబడ్డ ప్రతి మగాడి చూపు ఆమె వైపే. ఉరందరి మనసులోనూ ఆమె అందాల కైపే. మరి కాసేపు ఆమె అందాన్ని కనులారా తాగొచ్చన్ని, కలలలోన ఊగొచ్చని, మరోదారిన పరిగెత్తుకొస్తే మరోసారి ఆమెను చూడొచ్చని, ఆమలిన మనస్సు మారొచ్చని, మిడిసిపడే, ఉద్రేకాలు ఎగసిపడే మగాళ్ళ మధ్యలోనుండి తనకేమీ పట్టనట్టు నిశ్శబ్దంగా సాగిపోయే తను. ఊరంతా ఆరాధించే అందం. స్త్రీ సౌందర్యానికి మరో గుర్తింపు తన అందం. దొంగతనంగా అయినా సరే, శిశువులూ పశువులూ చూడాలనుకునేంత అందం. అందం వల్లనే కదూ, ఆమెకు అంత గుర్తింపు. అదేమిటో, Malèna మనసు మాత్రం, ఆమె భర్తపైనే. ప్రపంచం ముందు గుర్తింపు ఇచ్చిన తన సౌందర్యాన్ని, మరెన్నో ఐహిక సుఖాలను ఇవ్వగల సౌందర్యాన్ని, భర్త దగ్గర లాలనని పొందడానికి మార్గంగానే చూస్తుంది.

Malèna

శంకరాభరణం శంకర శాస్త్రి కూడా అంతే కదా. తన సంగీత యాత్రలో ఏ జమిందారుని లెక్క చేసాడని? ఆయన కదలివస్తుంటే, కదలిక లేక బిగుసుకుపోయిన జనం కళ్ళలోని భక్తినీ, తన గళం పట్ల ఆరాధనని ఎప్పుడు గుర్తుంచుకున్నాడని? అప్పుడెప్పుడో, “Music is divine, Whether it is Western or Indian” అంటూ పాశ్చత్య సంగీతపు పోకడలనూ పుక్కిట పట్టి చూపించాడే. అంతటి గుర్తింపు ఇచ్చిన తనలోని కళను, మరెన్నో ఐహిక సుఖాలను ఇవ్వగల సంగీతాన్నీ, సర్వేశ్వరుడి దగ్గరకు చేరే మార్గంగానే చూసుకున్నాడు.


తులసి అని, ఓ వేశ్య కూతురు; శంకరశాస్త్రి ఎదురుపడే దైర్యం లేక, ఆయన గళామృతాన్ని దొంగతనంగా ఆస్వాదిస్తూ, తనలో అసంకల్పితంగా వెల్లువెత్తిన దేహ స్పందనలను నాట్యంగా పలికించి తృప్తి పడుతుంది. శంకరశాస్త్రి ఎక్కడో, ఎప్పుడో గాలి తరగల్లో వదిలిన గమకాలను, గుర్తుగా తెచ్చుకొని ఎవరూ లేని తనగదిలో ఓ అర్దరాత్రి సంగీత భావ ప్రాప్తిలో ఓలలాడుతుంటే-

ఈ పెద్దలున్నారు చూడండి, ఎప్పుడు వయసులోకి వచ్చే పిల్లల భావాలను అర్థం చేసుకున్నారని. బూజు పట్టిన తమ భావాలను రుద్దడానికి ఎంత బలవంతం చేస్తారని.

Reneto పరిస్థితి వేరుగా ఏమీ లేదు. Malèna అందాన్ని వీలయినంత దగ్గరగా ఆస్వాదించాలని, ఎదుటపడి అడగలేక, ఓ అర్దరాత్రి దొంగతనంగా ఆమె ఇంటిపైకెక్కి కన్నం ద్వారా గమనిస్తూ, అందాన్ని పత్తికాయల్లా విచ్చుకున్న కళ్ళతో అస్వాదిస్తూ, వదలలేక, కదలలేక, కలలా వదలివస్తూ తనతో తెచ్చుకున్న జ్ఞాపకాల తోడుగా బుడి బుడి యవ్వనంలో వడి వడిగా అడుగులతో ఆదమరిచి నిదరోయాడు. ఉదయాన్నే గదిలోకి వచ్చిన Reneto తండ్రి విషయం గ్రహించి చితకబాది కొద్ది రోజులు గదిలో బంధించాడు. ఆ తర్వాత డాక్టరు సలహా మేరకు Reneto కు స్వేఛ్ఛ లభిస్తుంది. ఈ లోగా Malèna భర్త మరణించినట్లు వార్త వస్తుంది. తీవ్రమైన నిరాశలో కూరుకుపోయిన తనని వేశ్యగా ముద్రవేస్తూ ఊళ్ళోని మిగితా స్త్రీలు సూటిపోటి మాటలు మరింత గాయపరుస్తాయి. పైగా తనని వేశ్యగా ఆరోపిస్తూ కేసు పెడతారు. కోర్టులో Malèna తరపున వాదించిన లాయరు, కేసు నెగ్గిన తర్వాత, తనని బలవంతంగా అనుభవించడం Reneto గమనిస్తాడు. తప్పనిసరి పరిస్థితిలోనే Malèna అలా ప్రవర్తించిందని నమ్ముతూ, ఆమె తరపున దేవుని ప్రార్థిస్తాడు. చివరకు యుద్దం ముగిసి, వేరే జీవనాధారము ఏమీ లేక, Malèna తన అందాన్ని అమ్ముకోవడం మొదలెడుతుంది. అయినా సరే, Malèna ముందు Renato బయటపడకుండా, ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తూ వుంటాడు.


ఇక్కడ శంకరభరణం కథలోనూ దాదాపు ఇవే మలుపులు. వేశ్యయైన (?) తులసికి ఆశ్రయం ఇవ్వడంతో శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూడడం మొదలు పెడతారు. శాస్త్రీయ సంగితానికి ప్రాభవం తగ్గడం వలన నెమ్మదిగా దయనీయ పరిస్థితిలోకి జారుకుంటున్న శంకరశాస్త్రి, చివరకు తనలోని కళకు గుర్తింపుగా లభించిన గండ పెండేరాన్ని అమ్మే ప్రయత్నంలో వుండగా, శంకరశాస్త్రి నిస్సహాయ స్థితిని అర్థం చేసుకున్న తులసి, తన ఆస్థి అడ్డుపెట్టి, ఆయన గౌరవాన్ని నిలుపుతుంది. కానీ ఆయనముందు తన ఉనికిని ప్రకటించాలనుకోదు. శంకరశాస్త్రి తన సంగీత జ్ఞాపకాలను తర్వాత తరాలకు శాశ్వతంగా (శతమానం భవతి శతాయు పురుష శ్శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతీ) వదిలి తను ఆరాధించిన సర్వేశ్వరుడిలో లీనమవడంతో శంకరాభరణం చిత్రం ముగుస్తుంది.

శంకరాభరణం
ఇలాంటి నాటకీయతే Malèna కథలోనూ వుంది. మరికొద్ది రోజులకే, అందరూ మరణించాడని భావిస్తున్నMalèna భర్త యుద్దము ముగియడంతో (అవిటిచేతితో) తిరిగొస్తాడు. ఊళ్ళో ఎవరూ అతనికి Malèna వివరాలు చెప్పడానికి ఇస్ఠపడరు. ఇదంతా గమనించిన Renato, Malèna గురించిన వివరాలతో ఒక అనామక లేఖను రాసి ఆమె భర్తకు అందించి పరిగెత్తిపోయాడు. అతను తన భార్యను వెదుక్కుంటూ వెళ్లి, కొన్నాళ్ళ తర్వాత ఆమెతో తిరిగి వస్తాడు. Malèna, ఇప్పుడు Mrs.Malèna అనే గౌరవప్రదమైన హోదాలో వుంది కనుక ఆ ఊరి ఆడవాళ్లు ఆమెను సాదరంగా ఆహ్వానిస్తారు. ఆమె సంచీలోంచి జారిపడిన పళ్ళు తిరిగి అందిస్తూ “Good Luck, Mrs.Malèna” అని Renato తొలిసారి (చివరిసారి) Malèna తో మాట్లాడుతుండగా, Malèna తన సౌందర్యం జ్ఞాపకాలను తర్వాతి తరానికి శాశ్వతంగా ( Renato voiceover లో “Time has passed and I have loved many women. And as they’ve held me close and asked if I will remember them, I believed in my heart that I would. But the only one I’ve never forgotten, is the one who never asked … Malèna” అంటుండగా) వదిలి తను ఆరాధించిన భర్తతో కలిసి భవిష్యత్తులోకి ఆడుగులు వేయడంతో Malèna చిత్రం ముగుస్తుంది.

Malèna


ఇప్పుడు చెప్పండి. ఈ రెండు చిత్రాలూ ఒకే మూస అవునో కాదో? శంకరాభరణం వచ్చిన 20 ఏళ్ళ తర్వాత Malèna విడుదలయింది. Malèna చిత్రానికి మూల కథ 1926 లో జన్మించిన screenplay writer “Luciano Vincenzoni” అందించాడు. ఇద్దరు గొప్ప దర్శకులలో, కథకులలో ఎవరినీ తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. Great minds think alike అని చెప్పకుండా మాత్రం ఉండలేను.మీరేమంటారు మరి ?శంకరాభరణం 3-D

జూలై 9, 2013కొద్దిరోజుల క్రితం హఠాత్తుగా విదేశాలకు వెళ్ళాల్సి వచ్చింది. నేను అలా బయలుదేరటము, అరటి తొక్కపై కాలేసినట్టు, రూపాయి విలువ జారిపోవడము ఒకేసారి జరిగాయి. డాలరు బూస్టూ, హార్లిక్సు తాగి కుమ్మెస్తుంటే, నే వెళ్ళిన దేశపు నగదు విలువ కూడా కలరా వచ్చిన కోడిపిల్లలాగా కూలబడిపోయింది. ఇలాంటి స్థితిలో, నా దగ్గర మా పెద్దాయన డాలర్లలో ఇచ్చిన భత్యం పర్సు పగిలేలా బలిసి, బయటకు తొంగి చూడ్డం మొదలెట్టింది. అలాగని పెద్దాయన నాకేదో బహు వుదారంగా ఇస్తారనుకునేరు. ఆబ్బే, తెలుగు సినిమాల్లో ఐటం పాపల బట్టలకు తీసిపోకుండా ఇస్తారు. కట్టుకున్నా, ఆకట్టుకున్నా అంతా దాన్లోనే.ఇలా నేను డాలర్ల దురదతో సతమతమౌతుండగా, ఒక రోజు సాయంత్రం బసకు తిరిగివస్తూ, స్థానికంగా పైగా వుచితంగా దొరికే పత్రిక తెచ్చుకున్నాను. ఆ సాయంత్రం కాస్త బీరు చప్పరిస్తూ, చూద్దును కదా, పత్రిక మొదటి పేజీలోని 46 అంగుళాల స్మార్టు టివీ (Smart TV) ప్రకటన నన్ను ఆకట్టుకొంది.శ్యాంసంగ్ వారి సదరు మోడలు టివీ భారతదేశంలో ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇదే మోడలు టివీ కి దరిదాపుల్లో వున్న టివీ ధర ఆరంకెల్లో మిడిసిపడుతోంది. జాతర్లో ధర మన దేశపు ధర కన్న చాలా తక్కువ. పైగా చక్కని సదుపాయాలు. ముఖ్యంగా ఒక్క బటన్ తో మామూలు టివీ కార్యక్రమాన్ని 3D లోకి మార్చుకోవచ్చు. ఏ పాడుతా తీయగా లాంటి ప్రొగ్రామో 3D లో చూస్తూ ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొన్న అనుభూతి సొంతం చేసుకోవచ్చు. ఓక్క ఈ ప్రొగ్రామే అని ఏమిటి, క్రికెట్టూ మ్యాచులు, కోరుకున్న సినిమాలు, మీరు స్వంతంగా ఇంట్లోనో, పికినిక్కులోనో తీసిన వీడియోలు అన్నీ 3D లో కి మారిపోతాయి. (నేను HD వీడియో కెమెరా తో తీసిన వీడియోలను పరిశీలించాను. 3D ఎఫెక్టు అద్బుతః 3D కెమెరా తో చిత్రీకరించిన స్థాయి లో దృశ్యాలు కనువిందు చేసాయి అంటే నమ్మండి)ఇంకో చక్కని సదుపాయం ఏమంటే, శతభిశలు ఏమీ లేకుండా ఇంట్లోని వై-ఫై ఇంటర్నెట్ తో అనుసంధానమవుతుంది. ఆలాగే స్మార్ట్ ఫోన్‌తో కూడా. ఫోన్లో వున్న వీడియోను అలా టివీ వంక తోసేస్తే ఎంచక్కా అదంతా టివీలో వచ్చేస్తుంది.ఇన్ని చక్కని సదుపాయాలన్నీ మూటగట్టినట్టున్న టివీ చవగ్గా వస్తోందనగానే కొనాలనిపించింది. ఆసలు సమస్య అప్పుడు మొదలైంది. నేను ఎంపిక చేసుకున్న టివీ సైజు సాధారణంగా విమానాల్లో అనుమతించే బాగేజ్ కొలతల కన్నా చాలా ఎక్కువ. అమ్మకపు జాతర అయ్యెలోపు కొనాలని వున్నా, తీరా కొన్నతరువాత అంత పెద్ద కొలతలు గల టివీ విమానంలో అనుమతించకపోతే, రెంటికీ చెడిన కథ అవుతుంది.ముందుగా నా తిరుగు ప్రయాణపు విమాన సంస్థ కు రాసాను, ఇలాగిలాగ నేను మీ విమానాల్లో తెగ తిరుగుతాను. నా తిరుగుబోతు తనాన్ని మీరు కూడా ఫలానా నంబరుతో ముడేసి బోలెడు పాయింట్లు నా ఖాతాలో జమ చేసి గాలిగాడు అని బిరుదు కూడా ఇచ్చారు. మరేమో ఇప్పుడు నాకిలాగ అవసరం వచ్చింది. కాస్త సాయం చేద్దురూ అని మొహమాటం లేకుండా అడిగేసాను. రెండు రోజులపాటు బెల్లం కొట్టిన రాయిలాగా గమ్మున కూర్చున్నారు. తర్వాత రోజుకో రెండుసార్లు పొడిస్తే నాలుగు రోజుల తర్వాత సరే అని తలూపారు.ఈలోగా సదరు అమ్మకాల జాతర అయిపోయింది. అక్కడా ఇక్కడా గాలించినా ఎక్కడా ఆ మోడలు టివీ షాపుల్లొ కనిపించలేదు. సర్లే, మన సుడి ఇంతే అని మళ్ళీ కాస్త బీరు చప్పరించేసి నోరు మూసుకున్నాను.ఇండియా బయలుదేరడానికి సరిగా ఒక రోజు ముందు, బోజనం చేయడానికి ఆఫీసుకి కాస్త దూరంగా వున్న ఒక రెస్టారెంటుకి ఒక స్నేహితుడితో వెళ్ళాను. రెస్టారెంటు పక్కనే పెద్ద టివీ ల దుకాణం. ఊత్సుకతతో లోనికి తొంగి చూసాను. నేను ఎంపిక చేసుకున్న మోడల్ టివీలు కేవలం రెండంటే రెండు, అదిన్నూ, జాతర ధర కన్నా ఇంకాస్త తక్కువ ధరలో. ఇంకేమీ ఆలోచంచకుండా కొనేసాను.చెక్ ఇన్ సరిగమలు, కస్టమ్స్ వారి పదనిసలు అస్వాదిస్తూ టివీ ఇంటికి చేర్చాను.ఇదుగో ఈ టివీ లోనే మొన్న వరసబెట్టి చాలా సినిమాలు చూసాను. ఆన్నీ 3Dలో. మిధునం, శంకరాభరణం(శంకరా, నాద శరీరాపరా పాట గొప్ప అనుభూతి. శంకర శాస్త్రి వీరంగాన్ని మనం ఓ పక్క నించొని చూస్తున్నట్టుగా) సాగరసంగమం(తకిట తధిమి పాట వేరే చెప్పాలా)తనికెళ్ళ భరణి గారు, విశ్వనాథ్ మాష్టారు వింటున్నారా నేను మీ సినిమాలు 3D లో చూసాను.


%d bloggers like this: