దేశభాషలందు తెలుగు లెస్స!

తెలుగులో బ్లాగితే ఇంత మందికి తెలుస్తుందని, ఇంత మంది ప్రతిస్పందిస్తారని నేనెప్పుడూ ఊహించలేదు. ఈ ఒక్క రోజూ నా బ్లాగుకు వచ్చిన వీక్షకుల సంఖ్య 500 కి పైన. ఈ క్షణంలో నాకు శంకరాభరణం లోని రెండు వాక్యాలు గుర్తొస్తున్నాయి.  

“ఈ కళ జీవ కళ… అజరామరమైనది… దీనికి అంతం లేదు…

నిరాదరణ పొందుతున్న ఈ సంగీతాన్ని పోషించడానికి కోటికి ఒక్క వ్యక్తి ఉన్నా సరే ఈ అమౄతవాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది…మనిషి నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ దొరకునా,…
దొరకునా ఇటువంటి సేవా….”

పై వాక్యంలో కళ కు బదులుగా ” భాష “ను, సంగీతానికి బదులు “తెలుగు” ను, వ్యక్తి కి బదులు “తెలుగు బ్లాగర్ల సంఘం ” ను  ప్రతిష్ఠించుకుని చూడండి. ఎంత అద్భుతంగా అనిపిస్తుందో.

ఎవరంటున్నారు తెలుగు బాష అంతరిస్తోందని. ఇప్పుడు పునర్జీవిస్తోంది. జాజ్వలించబోతోంది. అలా చేయడానికి మాకు తెలుగు బ్లాగర్ల సంఘం ఉంది. మాకో వీవెన్ ఉన్నాడు. మాకో వైజా సత్య ఉన్నాడు. మాకో సి.బి. రావ్ ఉన్నాడు. మాకో అనిల్ ఉన్నాడు. మాకో సుధాకర్ ఉన్నాడు. మాకో విహారి ఉన్నాడు. ఇంకా ఎందరో ఉన్నారు. అంతే గాక,

మాకో కూడలి ఉంది, మాకో పొద్దు ఉంది. మాకు లేనిదల్లా రాజకీయ నాయకులు. అది మాకు అక్కర లేదు. తెలుగు కు అసలే అక్కర లేదు. ఎందుకంటే…

దేశభాషలందు తెలుగు లెస్స!

===================================================

విహారి గారు తమ వాఖ్య తో నాకో అధ్బుతమైన ఆలోచన ఇచ్చారు. నా సర్వీస్ హోం లో వసతికై తెలుగులో దరఖాస్తు పూరించే ప్రతివ్యక్తికీ నేను రోజుకు 500 రూపాయల తగ్గింపు ను ఇవ్వడంతో పాటు, ఆ వ్యక్తి పేరిట తెలుగు బ్లాగర్ల సంఘానికి రోజుకు 250 రూపాయలు అందజేస్తానని, ఈ అందజేయటం ఆ వ్యకి బస కొనసాగినన్ని రోజులూ ఉంటుందనీ హామీ ఇస్తున్నాను. ఈ నిధులని తెలుగు భాషా వ్యాప్తికై వినియోగిస్తారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.

నేను గత హైదరాబాదు ప్రయాణంలో సమయాభావం వల ఎవరినీ కలవలేకపోయాను. నాకు ఆహ్వాన పూర్వకంగా మెయిలు పంపిన సి.బి.రావ్ గారికి నా ధన్యవాదములు. రావు గారు, నేను ప్రకటించిన 500 రూపాయలు ఎలా పంపాలో చెప్పండి.

ఇక చివరగా, ఇదంతా నేనేదో తెలుగు ను ఉద్దరిస్తున్నానని కాదు. కేవలం నా సంతోషం కోసమే చేస్తున్నాను. ఎందుకంటే,

“తెలుగు భాష అనిన నాకు మక్కువ ఎక్కువ.” (జంధ్యాల చిత్రం “చూపులు కలసిన శుభవేళ” లో కోట డైలాగు ఇది)

ప్రసాదం   

2 Responses to దేశభాషలందు తెలుగు లెస్స!

  1. vihaari అంటున్నారు:

    ప్రసాదం గారు,

    “వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తలపెట్టవోయ్ ” అన్న
    గురజాడ మాటల్ని నిజం చేస్తున్నారు. మీలాంటి కొందరు తెలుగు కోసం చేసే కృషి సర్వులూ గుర్తుంచుకొతగ్గది. మీరు చాలా అభినందనీయులు. నేను ఇక్కడ ఉన్న కొన్ని ఇతర కంపెనీలకు కూడా మీ వసతి గృహం గురించి తెలియచేస్తాను.

    నేను కూడ తెలుగు బ్లాగర్ల సంఘానికి పది వేల రూపాయలు ఇస్తానని గతంలో చెప్పాను. దానికి కట్టుబడి (మన సంఘం ఏర్పడ్డాక) వుంటాను.

    మీరు రోజు తెలుగు లో ప్రచురిస్తూ తెలుగు కు చేసిన కృషే ఒక్క రోజులొ 500 మంది రావడానికి దోహదం చేసింది.

    విహారి.

    మెచ్చుకోండి

  2. వెంకట రమణ అంటున్నారు:

    ఈరోజు సుధాకర్‌గారు మా కంపెనీలో దాదాపు 1500మంది చూసే మెయిలింగు లిష్టులో మీ సర్వీసు అపార్టుమెంటు గురించి లింకుతో సహా పంపడంజరిగింది. మీ 500ల సందర్శకులకు బహూశా అదికూడా ఒక గట్టి కారణం కావచ్చనిపిస్తోంది.

    మెచ్చుకోండి

మీరేమంటారు ...