“గిరీ” లందు గడ్డంగిరీ వేరయా…

జనవరి 18, 2007

    కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్ళకు ఓ పెద్ద మల్టీ నేషనల్ కంపనీకీ మారిపోయాను. అక్కడ ఒకే ప్రాజెక్టు పై దాదాపు రెండు సంవత్సరాలు పని చేసాను. నాకూ మా పెద్దాయనకూ (అంటే బాస్ అన్నమాట) మంచి సంబంధాలు ఉండేవి. మంచి సంబంధాల వల్ల అని కాదు కానీ, ఆ రెండు సంవత్సరాల్లో మనకి ఓ మూడు ఆన్ సైట్లూ, నాలుగు అవార్డులూ వచ్చాయి. పైగా ప్రాజెక్టుకు పిల్లర్ లాంటి వాడు అని పేరొచ్చింది. ఎంత పేరొస్తే మాత్రం ఎన్నాళ్ళని ఒకే ప్రాజెక్టులో ఉంటాం. ఒక మంచి ముహూర్తం చూసుకొని నన్ను మరో ప్రాజెక్టు కు మార్చమని మా పెద్దాయనను అడిగాను. ఆయన ఓ సారి భూకంపం వచ్చినట్టు ఫీలయి, ఓ సిగరెట్టూ, రెండు కాఫీలూ తాగి “కుదరదు” అని తేల్చేశాడు. మనం వదిలితే కదా! నేను ఆ ప్రస్తావన తెచ్చిన ప్రతీసారీ మా పెద్దాయన ఆ ప్రాజెక్టుకు నేను ఎంత ముఖ్యమో, నన్ను మార్చడం ఎందుకు వీలవదో చెప్పడం మెదలెట్టేవాడు. ఎందుకైనా మంచిదని నన్ను చైర్మన్ అవార్డుకు నామినేట్ చేసి వారం రోజుల్లో మా చైర్మన్ చేతులమీదుగా అది కూడా ఇప్పించాడు. అవార్డు రావడం నాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. అయితే ఆ అవార్డు ఫంక్షన్ పుణ్యమా అని నేను దాదాపు కంపనీ లో అందరి దృష్టిలోకీ వచ్చేసాను.

    “ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలి” అన్న సామెత గుర్తు తెచ్చుకొని ఆ మర్నాడే వారం రోజులకు సెలవు అప్లై చేసాను. ఇంట్లో కూర్చొని వేరే కంపనీలకు అప్లై చెయ్యడం మొదలెట్టాను. అంత అర్జంటుగా వారం రోజుల్లో పెద్దగా ఏమీ వర్కవుటు కాలేదు. ఈ అప్లై, రిప్లై గొడవలో పడి గడ్డం  చేసుకోవడం కూడా వదిలేసాను.

    పదిరోజుల తర్వాత కాస్త మాసిన గడ్డంతో కంపనీలో అడుగు పెట్టాను. రిసెప్షనిస్టు అడగనే ఆడిగింది. “అదేంటి సార్, అలా ఉన్నారు?” అంటూ. సర్లే అందమైన అమ్మాయితో మాట్లాడ్డానికి సందు దొరికింది కదా అని నా కథంతా చెప్పి చివరగా ఆమె తెచ్చుకున్న ఉప్మా తింటూ, “బాగా పని చేస్తూ అందరితో మంచి పేరు తెచ్చుకుంటె నేను అడిగిన చోటికి మారుస్తారనుకున్నాను. ఏమైందో చూసావా” అన్నాను. ఖాళీ అయిన తన లంచ్ బాక్సు వంక చూస్తూ ఆమె “మీరు చెప్పింది నిజమే సార్” అంది.

    గడ్డం నిమురుకుంటూ నేను నా డెస్కు దగ్గరికి వెళ్తుండగా దార్లో మా పెద్దాయన క్లోజ్ ఫ్రెండు కం డైరెక్టరు ఒకాయన కనిపించి అదే ప్రశ్న అడిగాడు. మళ్ళీ నేను కథంతా న్యూస్ రీల్ నుండి మొదలెట్టాను. నేను చెప్పిందంతా విని “అందుకేనా గడ్డం పెంచుతున్నావు?” అని అడిగాడు. అదిగో ఆ క్షణమే నా మనస్సు లో “గడ్డంగిరీ” అనే గొప్ప కాన్సెప్టు కు అంకురార్పణ జరిగింది.

     ఇక అప్పటుంచీ ఆఫీసులో కనపడిన ప్రతీవాడు నన్ను నా గడ్డం గురించి అడగటం, నేను కథంతా చెప్పి ముక్తాయింపుగా “…చూసారా! అవార్డు తెచ్చుకునే స్థాయిలో కష్టపడి రెండు సంవత్సరాలు పనిచేసినా నేను కోరుకున్న ప్రాజెక్టుకు మార్చటం లేదు. అందుకని ఇంత హార్డ్ వర్కు చెయ్యటం వేస్టు బాసూ…” అని గడ్డం బరుక్కుంటూ అవతలికి వెళ్ళటం మొదలెట్టాను.

    నెమ్మదిగా విషయం కొద్ది కొద్దిగా పైకి వెళ్ళటం మొదలైంది. అందునా నాకు రీసెంటుగా చైర్మన్ అవార్డ్ ఇచ్చారాయె. ఇక చూడాలి. మా పెద్దాయన పరిస్థితి, ఎందుకులెండి చెప్పడం. ప్రతీ సీనియర్ మేనేజరూ అయన్ని అడగటమే “చైర్మన్ అవార్డ్ వచ్చిన ప్రసాదానికి ప్రాజెక్టు మార్చకూడదటయ్యా?” అని.

    నేను గడ్డంగిరీ మొదలెట్టిన వారం రోజులు అవక ముందే మా పెద్దాయన నా దగ్గరకు వచ్చి కొంచం కోపంగా, ఇంకా అభినందన పూర్వకంగా చెప్పాడు.”నువ్వు ఇంత క్రియేటివ్ గా వేపుకుతిని, అనుకున్నది సాధిస్తావని అనుకోలేదు ప్రసాదం, నిన్ను రిలీజ్ చేస్తున్నాను, ఇక ఆ గడ్డం తీయవయ్యా” అని.

    ఆ మర్నాడు నున్నగా గడ్డం గీసుకొని ఫ్రెష్ గా వెళ్ళి కొత్త ప్రాజెక్టు లో చేరిపోయాను. మళ్ళీ ఆ తర్వాత నాకు అదే కంపనిలో గడ్డం పెంచాల్సిన అవసరం రాలేదు.

    మరి కాదంటారా, “గిరీ” లందు గడ్డంగిరీ వేరయా…

ప్రకటనలు

%d bloggers like this: