సిక్స్ సిగ్మా అండగా, నాకు PM పోస్టే అందెగా…

ఒక మాంఛి ముహూర్తం చూసుకొని మా పెద్దాయన కంపనీ నుండి ఇంకో చెడ్డాయన కంపనీ లోకి ఎగిరి దూకాను. చెడ్డాయన అంటే చెడ్డవాడు అని కాదండి, ఆయన తరచుగా ఒక చెడ్డీ వేసుకొని ఆఫీసుకొచ్చేవాడు. అందుకని అలా నామకరణం జరిగిందాయనకు. (ఆయన వేసుకునే చెడ్డీని ఆంగ్లములో షార్ట్ అని అనెదరు) మా కంపనీని six sigma కంపనీగా తీర్చిదిద్దాలని మా చెడ్డాయన ఆరాటం. ఇంట్లో ఉన్నంత ఫ్రీ గా ఆఫీసులో ఉండాలని, అలా అయితే తప్ప మనస్పూర్థిగా పనిచేయలేమని ఆయన కు గొప్ప నమ్మకం. అందుకనే ఆయన చెడ్డాయన అయిపోయాడు. సంసారులంతా ఇంటికన్నా  కంపనీ పదిలం అనుకుంటుంటే, వీడెవడండీ, ఇంట్లో  ఫ్రీ అంటాడు అని కాస్త పరిశోదన చేస్తే ఆయన ముదిరి పోయిన బ్రహ్మచారి అని తేలింది.

సరే, చెడ్డాయన కంపనీ లో కూడా టీం లీడర్ గా చేరిన రెండు నెలల తర్వాత మా ప్రాజెక్టుకు పరమ బేవార్సుగాడు ఒకడు ప్రాజెక్టు మేనేజరు గా వచ్చాడు. రెండు రోజుల్లోనే వాడు నిప్పు అప్పలసామి లెవెల్లో  స్కిల్ గేంస్ ఆడే రకం అని  అర్థమైపోయింది. (ఈ నిప్పు అప్పలసామి స్కిల్ గేంస్ గురించి తెలుసుకోవాలంటే జంద్యాల గారి “జయమ్ము నిశ్చయమ్మురా ” సినిమా చూడండి). మా నిప్పు అప్పలసామి ని చూసాక నేను కొత్త సామెత కనిపెట్టాను. “చాదస్తపు ప్రాజెక్టు మేనేజరు చెబితే వినడు, తిడితే నవ్వుతాడు” అని. కాస్త గట్టిగా అడిగితే సిక్స్ సిగ్మా కోసం ఇలాగే చేయాలి మరి అంటుంటాడు. నాకేమో వాడి ఒంటికి నిప్పెట్టేద్దామన్నంత మంటగా ఉండేది. పోనీ గడ్డం గిరీ మొదలెడదామా అంటే నాకు అప్పటికి ఇంకా సరిపోయేంత పాపులారిటీ లేదాయే. ఎమీ చేయలేక గిల గిలా కొట్టుకుంటుండగా నెలాఖరు వచ్చింది.

మా చెడ్డాయన కంపనీలో ప్రతీ త్రైమాసికపు చివరి వారాంతంలో “Fresher Day” అనే సాంప్రదాయం ఒకటి ఉంది. కొత్తగా చేరిన వాళ్ళను, వారిలోని కళలను కంపనిలోని ఉద్యోగులకు అందరికీ పరిచయం చేసే కార్యక్రమం అది. ఆ త్రైమాసికంలో కంపనీలో చేరిన ప్రతీ ఒక్కరు ఏదో ఒక కళని ప్రదర్శించాలి. ఎదేమైనా మా చెడ్డాయన మంచి కళాపోషకుడు.

మా నిప్పు అప్పలసామిని అట్నుంచి నరుకొస్తే పోలా అనుకుని నా ప్రయత్నాలు మొదలెట్టాను. నేను Six Sigma గురించి కథ చెబుతాను అని ప్రకటించాను. చెడ్డాయన కూడా వింటున్నాడు అని కంఫర్మ్ చేసుకుని నేను కథ చెప్పటం మొదలెట్టాను.

“అనగనగా ఒక రాజు గారు చాలా చిన్న స్థాయిలో IT కంపనీ ప్రారంభించి చాలా విజయవంతంగా వ్యాపారాన్ని విస్తరించాడు. మరింత విస్తరణ కోసం తన కంపనీని Six Sigma స్థాయికి తేవాలనుకున్నాడు.”

“…ఓ ఆదివారం రోజు ఇంట్లో కూర్చుని అదే విషయమై తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా రాజు గారి ఆస్థాన రజకుడు  పద్మా రావ్ వచ్చాడు. తీవ్రంగా ఆలోచిస్తూఉన్న రాజు గారిని చూసి విషయమేమితో కనుకున్నాడు. Six Sigma అంటే ఏమిటి అని ఆడిగాడు . రాజు గారు విసుక్కోకుండా, Six Sigma అంటే 10 లక్షల వ్యవహారాలలో 3 కన్నా తక్కువ తప్పులు ఉండేలాగా పని చేయడం అని వివరించాడు.

పద్మా రావ్ కాసేపు బుర్ర తడుముకొని “మన ఏరియాలో 50 ఇళ్ళకీ నేనే కదండీ చాకలి వాన్ని. ప్రతి రోజూ ప్రతి ఇంటా నాకు ఇరవై బట్టలన్నా ఉంటాయండి. నేనూ, మా వాడూ, మా ఆడది కలిసి రోజుకు కనీసం 1000 బట్టలు ఉతికి ఎవరి బట్టలు వారికి ఇస్తాం గదండీ, ఆ లెక్కన ఏడాదికి మూడు లక్షలా అరవై ఐదు వేళ బట్టలండి. ఈ మూడేల్లలో నేను కూడ పది లక్షలపైనే బట్టలు ఎక్కడివక్కడ డెలివరీ ఇచ్చానండి. మీ లెక్కన నేనూ Six Sigma యే నండి”.

చాకలి వాడి లెక్కకు  రాజు గారి కళ్ళు బైర్లు కమ్మాయి. రాజు గారు ఉత్సాహం గా అడిగారు. “అయితే అంత ఖచ్చితంగా ఎక్కడివక్కడ ఎలా ఇస్తావు? ”  

పద్మా రావ్ తాపీగా చుట్ట వెలిగిస్తూ అన్నాడు. “నాదేముందండీ. నా దగ్గర గాడిదలు ఉన్నాయి చూశారూ, అవి వాటి నడ్డి మీద వేసిన బట్టలు ఏ ఇంటివో ఆ ఇంటి వరకూ వెళ్ళి ఆగిపోతాయండి. డెలివరీ ఇవ్వటమే మన పనండీ, మన సిక్ష్ సిగ్మా అంతా అదేనండి” అన్నాడు. రాజు గారికి జ్ఞానోదయమైంది.”

 నేను కథ చెప్పడం ఆపి మా నిప్పు అప్పల సామి వంక ఓరకంట కఛ్చ గా చూస్తూ….   

“… రాజు గారు వెంటనే ఆ గాడిదలన్నీ తోలుకొచ్చి తన కంపనిలో ప్రాజెక్టు మేనేజర్లు గా అపాయింటు చేసాడు” అని కథ ముగించి గబ గబా వేదిక దిగి మాయమయ్యాను.

సోమవారం ఆఫీసుకు రాగానే మెయిలు కనిపించింది. నన్ను నిప్పు అప్పల సామి ప్రాజెక్టు నుండి రిలీజ్ చేస్తున్నరని దాని సారాంశం. గట్టిగా ఈల వెయ్యబోతూ ఆగి పోయాను. కింద మరో మెయిలు. “నన్ను కొత్తగా వచ్చిన మరో ప్రాజెక్టుకు ప్రాజెక్టు మేనేజరుగా అపాయింటు చేస్తున్నట్టు ఉందందులో.

(ఆ విదంగా నేను ప్రాజెక్టు మేనేజరు అయ్యాను. అయితే, సంవత్సరంలోగా నేను అదే కంపనీలో బెస్టు ప్రాజెక్టు మేనేజరుగా అవార్డు అందుకున్నాను. సిక్స్ సిగ్మా కంపనీ అవగానే ఇంకో ప్రమోషన్ ఎలా తీసుకున్నాననేది మరో కథ. )

8 Responses to సిక్స్ సిగ్మా అండగా, నాకు PM పోస్టే అందెగా…

  1. Prasad Charasala అంటున్నారు:

    మీ six sigmA కథ అదిరింది. ఇక్కడి మా వారందిరికీ చెప్పి నవ్వా!

    –ప్రసాద్
    http://blog.charasala.com

    మెచ్చుకోండి

  2. radhika అంటున్నారు:

    miidaggara caalaa idea lea vunnayamdi.

    మెచ్చుకోండి

  3. శోధన అంటున్నారు:

    ఇది ఆంగ్లంలోకి తర్జుమా చేసి మరీ మా ప్రోగ్రామ్ మేనేజరుకు చెప్పాలి 🙂 చాలా ఆనందందా ఉంది ఎందుకో ఈ జోకు చదివాక 😉

    మెచ్చుకోండి

  4. రానారె అంటున్నారు:

    సార్ ఇది నిజంగా జరిగిందనిపిస్తోంది, నిజమేనా?

    మెచ్చుకోండి

  5. swathi అంటున్నారు:

    hhahha bhale chepparu.
    kadha chaala bagundi.

    మెచ్చుకోండి

  6. cbrao అంటున్నారు:

    వాస్తవం, కల్పన రెంటినీ తగినపాళ్ళలో కలిపి six sigma సాధించారు. అభినందనలు.

    మెచ్చుకోండి

  7. jyothi అంటున్నారు:

    మీ దగ్గర భలే ఐడియాలు ఉన్నాయండి. అంతే మీరు కూడా ఆ చాకలివాడన్నట్టు ?????????

    మెచ్చుకోండి

  8. Manasa అంటున్నారు:

    Chala bagundi, I am Gr8 fan of U

    మెచ్చుకోండి

మీరేమంటారు ...