“పొగ” ల రాజును నేనే, “సెగ” ల రాణివి నీవే …

వారం క్రితం  మా గుల్లు గాడు కూడా పెళ్ళి చేసేసుకున్నాడు, వద్దు వద్దురా అని మేమంతా ఎంత మొత్తుకున్నా వినకుండా.  “ఎప్పుడూ ఎంజాయ్ చేస్తే జీవితంలో మజా ఉండటం లేదు మామా. అందుకనే పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను. ఆల్‌రడీ మా వాళ్ళు చూసిన ఓ అమ్మాయికి ఓకే చెప్పేసాను. ఇదిగో ఆమ్మాయి ఫొటో …” అంటూ ఫోటో అందించి అయిపోయిన సిగరెట్ పీకతో మరో సిగరెట్ వెలిగించుకున్నాడు వాడు. 

వాడు ఒక పూట భోజనం అయినా మానేసాడు గానీ, సిగరెట్లు లేకుందా ఉండలేడు. రోజుకు కనీసం ఒక పాకేట్టు అయినా కావల్సిందే. పైగా తడవకు కనీసం రెండు సిగరెట్ల చొప్పున వరసగా  కాల్చేస్తాడు. వాడికి అదో తృప్తి. అలాగని వాడికి స్మోకింగ్ అడిక్షన్ ఏమీ లెదు. వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు ఉన్నప్పుడు ఒక్క సిగరెట్ కూడ తాగడు. పోనీ వీడి ధూపం సంగతి వాళ్ళ పేరెంట్స్ కు తేలీదా అంటే అలా కాదు.  “మా పేరెంట్స్ కు నేను స్మోక్ చేస్తానని నేను చెప్పక పోయినా వాళ్ళకు తెలుసు, కానీ వాళ్ళు నన్ను ఎప్పుడూ అడగలేదు. నాకూ వాళ్ళ ముందు తాగాలనిపించదు. ” అని చెప్పాడు ఒక సారి.             

“సాయంత్రం పార్టీ ఇస్తున్నాను మామా, ఈ రోజు నా రూం కు ఆవో ” అని హఠాత్తుగా వాడు ఉరుము లేని పిడుగులా అందరికీ ఫొన్ చేసాడు. మామూలుగా మా పార్టీలన్నీ వీకెండుకు ఉంటాయి. అదీ, నెలకోసారి అలా ప్లాన్ చేసుకుంటాము. మా ప్లానింగు, మేము పడే అవస్థలూ చూసి మమ్మల్ని గొప్ప మందు బాబులు అని చాలా మంది అనుకుంటారు. కాని మేము మూడు ముక్కలాట కూడా ఆడకుండా తలా రెండు బీర్లు తాగి నాలుగు సరదా కబుర్లు చెప్పుకుని బాయ్ మామా అంటే బాయ్ మామా అని అనుకుని ఇళ్ళకు వెళ్ళి శుభ్రంగా నిద్దరోయే రకం. ఈ మాత్రం దానికే మా ఆవిడ  వాళ్ళ చుట్టాలందరిలోనూ నన్ను పరమ తాగుబోతుగా, రోజూ తాగి రోడ్డు పక్క పడిపోయే రకం గాడిగా చిత్రీకరించింది. ఒక సారెప్పుడో పార్టిలో నేను నా కష్టాలన్నీ చెప్పి “మా ఆవిడ ఇంతే, మరి మీ ఆవిడ…?” అని అడగ్గానే అందరూ బోలెడు ఆశ్శర్య పోయి “మా ఆవిడా ఇంతే, మీ ఆవిడ కూడానా” అని గ్లాసులు కలిపారు. అప్పటి నుండీ మా స్నేహాలు మరింత గట్టి పడ్డాయి.  అప్పటినుండీ ఎలాగో ఒకలా నెల నెలా మందు పార్టీని విజయవంతంగా నెట్టుకొస్తున్నాము. మా మందు పార్టీ బ్యాచిలో సంసారులకు ఉండే జవాబు లేని కొశ్చెన్లు, బ్రహ్మచారుల భవిష్యత్తు కు పాఠశాల లెస్సన్లు.   

ఆ రోజు సాయంత్రం గుల్లు గాడి రూంలో పార్టీ మొదలయ్యి తలా ఒక రవుండ్ పూర్తయ్యాక, “అరేయ్ గుల్లూ, పెళ్ళంటే నూరేళ్ళ పంట అని అనుకుంటామా, కాని అది పెళ్ళయ్యేవరకే. తర్వాత తెలుస్తుంది. పెళ్ళంటే నూరేళ్ళ మంట…” అని నేను ఇంక ఏదో అనబోతుండగా, సాంబారు షణ్ముగం అందుకున్నాడు. “అజ్జేషన్ యువరానర్, పెళ్ళంటే నూరేళ్ళ మంట మాత్రమే కాదు, నూరేళ్ళ వంట కూడా…” అన్నాడు తూగుతూ. వాళ్ళవిడకు ఆఫీసులో లేటవుతుందని వాళ్ళింట్లో తనే వంట చేస్తాడు. తన అసలు పేరు సుందర షణ్ముగం, వాళ్ళింట్లో వంట తనే అని మా అందరికీ తెలిసిన తర్వాత అతనికి సాంబారు షణ్ముగం అని నామకరణం జరిగిపోయింది.

ఎలాగూ షణ్ముగం బయటపడిపోయాడు కనుక, ఇక తన గురించే చెప్పడం మొదలెట్టాను. “చూడు పెళ్ళికి ముందు షణ్ముగం వాళ్ళావిడ షణ్ముగం ను తలచుకొని, “గ్రీకు వీరుడూ, నా రాకుమారుడూ … ” అని పాడేది. మరి ఇప్పుడు, పెళ్ళయ్యి నిండా ఐదేళ్ళు కూడా కాలేదు,

“గరిటె వీరుడూ,
నా కిచను శూరుడూ,
కిచను లోనే ఎక్కడో ఉంటాడు…
.. కిచన్ బాయ్ ….”

అని పాడుతుందా లేదా అని అంటుండగా, “ఈ సంగతి మీకు కూడా తెలిసిందా?..” అని షణ్ముగం కళ్ళొత్తుకున్నాడు. పాపం, షణ్ముగం తొందరగా ఎమోషనల్ అయిపోతుంటాడు. 
 
“ఐసా కాదు మామా, అసలు షాదీ లేకుండా ఉంటే కైసా? నాది శీలంకు డవుట్ చేస్తారు…నాకు ఇంట్లో నుండి ఆవుట్ చేస్తారు..” అంటూ మరో బీరు సీసా ను ఓపెన్ చేసాడు గుల్లు.

చిల్లీ చికెన్ చప్పరిస్తూ, నీలూ అందుకున్నాడు. “అరే గుల్లూ, పెళ్ళాం చూయింగ్ గం లాంటిది. ముందు తియ్యగా చాలా బావుంటుంది. ఓ సారి తియ్యదనం పోయిన తర్వాత, దాని మింగ లేము, అలా అని ఊసెయ్యనూ లేము….”

అంజి గాడు చటుక్కున కళ్ళు తెరిచి “ఏం కంపారిజన్ రా నీలు గా, లైఫ్ లో ఫస్ట్ టైం విస్కీ కొట్టానా, నీ దెబ్బకి మొత్తం దిగిపోయింది” అంటూ ఇంకో పెగ్గు వంపుకున్నాడు.

ఎవరెన్ని రకాలుగా చెప్పినా గుల్లు  వినలేదు. గుల్లుగాడి పెళ్ళైపోయింది. వాడి మామ గారు వాడి కాపురానికి గానూ, ఓ మాంచి ఇల్లు కూడా అద్దెకు చూసి పెట్టాడు. ఇంకా వాళ్ళ మ్మాయి కాపురానికి గానూ, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అవీ అన్నీ ఒక పెద్ద లారీ లో పంపించాడు. నీలు గాడి తో సహ మేమందరమూ దగ్గరుండి ఆ సామానంతా మధ్యాహ్నం కల్లా ఇంట్లో చేర్పించాము.  గుల్లు గాడు సరి కొత్త సొఫాలో విలాసంగా కూర్చొని  సిగరెట్ కాలుస్తుండగా, ఫోన్ మోగింది.  ఆర్పేసిన సిగరెట్ పీక ను సోఫా కిందకి తోసేసి కాసేపు ఫోన్ మాట్లాడి పెట్టేస్తూ, “ఈ సాయంత్రం కు మా భార్య వస్తుంది ” అన్నాడు. ఆల్ ద బెస్ట్ మామా అని చెప్పి మేమంతా  బయల్దేరాము.    

సాయంత్రం ఆరు గంటలకు గుల్లుగాడు ఫోన్ చేసి “షాదీ కి ముందు నువ్వు చెప్పింది సచ్ హై  మామా, పెళ్ళంటే నూరేళ్ళ తంటా”. అన్నాడు. ఏమైందిరా అంటే ఇలా చెప్పుకొచ్చాడు.
“సాయంత్రం  మా భార్య ఇంకా ఆమె నాయినా వచ్చింది. రాగానే, ముందు ఆమెకు నేను కాల్చిన సిగరెట్ దిఖా హై. ఆమెకు సిగరెట్ ఇంకా మందు వాసన గిర్తా నై. సిగరెట్ ఎవరు కాల్చారు అని   గట్టిగా ఆడిగితే, నేను నీది పేరు చెప్పాను.  నీకు మా ఇంట్ల రావద్దు అని మా భార్య చెప్పింది. సారీ మామా” అని ఫోన్ పెట్టేసాడు. 

వాడు సిగరెట్ మానేసాడో లేదో ఇంకా నాకు తెలీదు. ఎందుకంటే నేను వాడి ఇంటికి వెళ్ళడం మానేసాను. ఏమంటే వాళ్ళ మామ గారు డి.యస్.పి మరి. ఈ మధ్య ఎప్పుడు వాడికి ఫోన్ చేసినా కొత్త రింగ్ టోన్ వస్తోంది వాడి సొంత గొంతు తో.

తాగితే మరచి పోగలను, కానీ తాగ నివ్వదు.
మరచి పోయి తాగగలను , కాని మరువనివ్వదు.
హ, హ, హా …
మనసు గతి ఇంతే,
మొగుడి బతుకంతే,
మనసున్న మొగుడికీ
చుట్ట(క్క) లేదంతే…

పాపం ఎలా ఉన్నాడో. 

ఈసారి మా మందు పార్టీ కి వాడు వస్తే గానీ ఏ సంగతీ తెలీదు. మరి వస్తాడంటారా?

8 Responses to “పొగ” ల రాజును నేనే, “సెగ” ల రాణివి నీవే …

  1. budaraju aswin అంటున్నారు:

    అసలు కంటే మందు ముద్దు కదండి
    ఖచ్చితంగా వస్తారు

    మెచ్చుకోండి

  2. విహారి అంటున్నారు:

    చాలా బాగుంది.

    ఏఁవిటో ఈ మధ్య కొన్ని టపాలు ఎంత బావున్నా వ్యాఖ్యలు రావడం లేదు. ఏమయుంటుంది చెప్మా?

    — విహారి

    మెచ్చుకోండి

  3. radhika అంటున్నారు:

    టపా అయితే అదిరింది గానీ తాగడం తప్పయినప్పుడు అది నెలకొకసారయితే ఏమిటి?రోజుకొకసారైతే ఏమిటి?తాగుబోతే అవుతాడుగా.[కాడా?].చివరి రింగ్ టోను మాత్రం అదిరింది.

    మెచ్చుకోండి

  4. ప్రసాదం అంటున్నారు:

    అశ్విన్ గారు, విహరి గారూ మరియు రాధిక గారు, మీకు నా నెనర్లు

    రాధిక గారు, తాగటం తప్పని ఎక్కడుందండీ? దీని గురించి కొంచం వివరంగా ఇంకో టపా రాయాలని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా టపా కోసం (కట్టడానికి కాదు, రాయడానికి 😉 ) సహాయం చేస్తానంటే ఇదే నా స్వాగతం.

    ప్రసాదం

    మెచ్చుకోండి

  5. చదువరి అంటున్నారు:

    బాగా రాసారు.
    అవును, తాగితే తప్పేముంది!? తప్ప తాగినా తప్పుగాదు! తప్ప తాగకపోతే అసలు తాగిన గొప్పేముంది? ఫలితమేముంది? 🙂
    ప్రసాదం గారూ, భలేవారే, మీరే ఓ పెద్ద బ్లాగుబోతు, టపా కోసం మీకు సాయం చెయ్యగలవారెవరండీ, బాబూ!!

    మెచ్చుకోండి

  6. Ssreddy అంటున్నారు:

    Bagaa raasaaru ……..

    Nice one !!!!!

    మెచ్చుకోండి

  7. Manasa అంటున్నారు:

    Baaga rasaru. Keep it up!

    Meeru mandu Priyula?

    ilage inkoka kavitha rayandi, kakapothe deeniki reverse lo vundali mari 🙂

    మెచ్చుకోండి

  8. Gorusu అంటున్నారు:

    Namastae. mee “Poga … sega” haasya rachana maa Andhra jyothi sunday book lo publish chesukunae avakaasham ivvagalara sir?

    మెచ్చుకోండి

మీరేమంటారు ...