నారీ నారీ నడుమ షరాబీ..

మరదలు,  మలేషియా ఒకటే, పిచ్చి ఎట్రాక్షన్” సాధారణంగా ఆఫీస్ కు సెలవు పెట్టని నేను  హాఫ్ డే సెలవు పెడుతూ మనసులో మాట పైకే అన్నాను.  

“భార్యామణీ, బోను ఫ్రాక్చరూ ఒకటే, చచ్చే ట్రాక్షన్” అంటూ వెంటనే రిటార్డు వినపడింది. 

నా వెనకాలే కనబడిన మా ఆవిడని చూసి గతుక్కుమన్నాను.

“మా చెల్లెలు వచ్చిందగ్గర్నుండీ మీ వరస చూస్తున్నా! నన్నెప్పుడైనా మీ ఐటీ పార్కులవైపు తీసుకెళ్ళావా? అది అలా అడగడం ఆలస్యం, పదమ్మా అంటూ తీసుకెళ్ళిపోవడం. పైగా మరదలు  మలేషియా ఒకటే, చాలా ఎట్రాక్షన్ అంటూ కామెంట్లు కూడాను” దండకం చదివేసింది మా ఆవిడ.

“అబ్బా! ఎందుకే అక్కా, బావను అలా నస పెడతావు? అసలు నేను వచ్చిందే ఆ ఐటీ పార్కులో ఇంటర్వ్యూల కోసం.  నేను అడిగితేనే కదా, బావ నన్ను ఐటీ పార్కు కు తీసుకెళ్ళాడు. ఇలాంటి విషయాల్లో బావగారు కాక పోతే ఇంకెవరు సాయం చేస్తారు నాకు? “,  ఇలాంటి అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ నా వైపు తిరిగి “రండి బావా! మీరు టిఫిన్ చేద్దురు గానీ ” అని చిన్నగా నవ్వుతూ దోసెలు వడ్డించింది. 

అంతకు ముందు రోజు సాయంత్రం పార్కులో కూర్చోబెట్టి ప్రైవేటుగా రెండు గంటల పాటు నా బుర్ర తినేసి నన్ను ఒప్పించింది కాబట్టి ఈ “ఇలాంటి పనులు” అన్న మాటకు నాకు అర్థం ఏవిటో  తెలిసింది. “హాన్నా,  అనుకుంటే ఆడాళ్ళు ఏమైనా చేయగలరు.” అని మనసులో అనుకుంటూ డైనింగ్ టేబుల్ వైపు అడుగులు వేసాను.

“బావా, మీ కోసం అల్లం పచ్చడి స్పెషల్ గా చేసాను” అంటూ తనూ వడ్డించుకుంది.

అల్లం పచ్చడి చేయడం మా ఆవిడకు అంత బాగా చేతకాదు. అయినా ఇప్పుడా మాట అంటే కొంపలు అంటుకుంటాయి కనుక డైనింగ్ టేబులు ముందు కూర్చుంటూ అన్నాను. “అయినా మీ అక్క చేసిన అల్లం పచ్చడి రుచే వేరు” అంటూ మా ఆవిడ వైపు చూసాను. 

నన్ను మంచి చేసుకునే వేషాలు చాలు కానీ, ఈ రోజు కూడా దానికేదో ఇంటర్వ్యూ వుందట. సెలవు పెట్టారు కదా అని మళ్ళీ ఏదో పుస్తకం పట్టుకోకుండా, దాన్ని కాస్త ఐటీ పార్కు కు తీసుకెళ్ళండి” ఆర్డర్ వేసింది మా ఆవిడ.

మళ్ళీ అట్టే మాటలు లేకుండా దోసెల కార్యక్రమం పూర్తి అయిపోతుండగా  నేను వద్దంటున్నా వినకుండా  “ఇంకో దోసె వేసుకోండి బావా! అల్లం పచ్చడి మీకిష్టం కదా” అని కొసరి కొసరి వడ్డించింది.

ఏదేమైనా మరదల్లు వడ్డించినంత బాగా భార్యామణులు వడ్డించరు.” దోసె తుంపి నోట్లో వేసుకుంటూ ఈ మాట మాత్రం మనసులోనే అనుకున్నాను. టిఫిన్లూ అవీ అయ్యాక, ఇద్దరమూ ఇంట్లోంచి బయట పడ్డాము. అలా కారు కొంచం స్పీడందుకోగానే అలవాటుగా సీడీ ప్లేయర్ ఆన్ చేసాను.

“ఎంత నేర్చినా, ఎంత జూచినా, ఎంత వారలైనా, కాంత దాసులే” అని రాగం అందుకోగానే, “ఛా బావా! ఎప్పుడూ ఈ శాస్త్రీయ సంగీతమేనా” అంటూ రేడియోకు మార్చింది.

“తెలుసా? మనసా! ఇది ఏనాటి అనుబంధమో?….”అంటూ రేడియో మోగింది.

ఈ పాటంటే …

 “బొయ్య్ య్య్ య్”  మని హారన్.

“…చాలా ఇష్టం బావా..” ముంగురులను వెనక్కి తోసుకుంటూ అంది.


ఎదురుగా రాంగ్ సైడ్లో  లారీ వస్తోంది. అసలు ఈ టైములో మెయిన్ రోడ్లో లారీలను నడపడానికి పర్మీషన్లు ఇచ్చిన గవర్నమెంటును అనాలి. పైగా ఈ లారీకి “On Govt Duty ” అన్న బోర్డు ఒకటీ! జనాభా నిర్మూలన కార్యక్రమంలో వున్నటుంది.

“..ఊ, పిచ్చి బాగా ముదిరింది. ఇక ఆ మూడు ముళ్ళూ పడాల్సిందే! ” కారును లారీ పక్కకు కట్ చేస్తూ ఆన్నాను.

“మీరు అనుకోవాలిగానీ పెళ్ళి అవడం ఎంతసేపు బావా!” కళ్ళు మూసుకుని “అబ్బా ఆ లైఫ్ తల్చుకుంటేనే ఎంత బావుంది”  తన్మయత్మంగా అంది.

“మరి ముందు మీ అక్క ఒప్పుకోవాలి కదా, తను ఒప్పుకోకుండా మీ ఇంట్లో మాట్లాడటం కాదు కదా, నేను చెయ్యగలిగింది కూడా ఏమీ వుండదు… నువ్వు చూస్తే అసలు సంగతి మీ అక్కకు చెప్పేలా లేవు. పోనీ నేను చెప్పనా మరి?..”  ఒక్క క్షణం తనవంక చూసి కళ్ళెగరేసి మళ్ళీ స్టీరింగ్ మీదికి దృష్టి సారిస్తూ “… మూడో ప్రపంచ యుద్దం మొదలవుతుందనుకో, కానీ నిండా మునిగాక చలేవిటీ చెప్పు ” అని మా ఆవిడ రియాక్షన్ ను ఊహించుకుంటుండగా, రేడియో లో మళ్ళీ యస్పీ బాల సుబ్రమణ్యం అందుకున్నాడు “ఇరువురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా…. వలపుల వానల జల్లులలో, స్వామి, తలమునకలుగా తడిసితివా! గోవిందా…..ఆ…ఆ”

“సరే, మొత్తానికి నన్ను ఒప్పించావు. ఈ రాత్రికే ఆ కాస్త పూర్తయిపోతే విషయం తేలిపోతుంది కదా,” రాత్రి జరగబోయె సీన్ ఊహించుకుంటూ అన్నాను నేను….

“అలా అయితేనే అక్కను త్వరగా ఒప్పించొచ్చు…” అని ఆగి తలెత్తి, సత్యభామలా జడ వెనక్కి విసురుతూ, “మీరేం కంగారు పడకండి బావా, మీ పని కానివ్వండి మిగిలిన కథ నేను నడిపిస్తాగా! “

“నడిపిస్తావో, నడ్డి విరుస్తావో… ” అనేసి నేను నా అలోచనలో మునిగిపోయి ఐటీ పార్కు ఎప్పుడొచ్చిందో కూడా గమనించకుండా అలా ముందుకు వెళ్ళిపోతుంటుండగా తను “బావగారూ, ఐటీ పార్కు వచ్చింది.   నన్ను ఇక్కడ డ్రాప్ చేస్తే  నా ఇంటర్వ్యూ పని నేను చూసుకుంటాను. మీరు మళ్ళీ మీ లోకం లోకి వెళ్ళొచ్చు గానీ..” అనగానే కారు ఆపాను.  తను దిగుతుంటే ” తప్పదంటావా? ” అన్నాను.

‘తప్పదు బావా, అక్కను తొందరగా ఒప్పించడానికి ఇంక వేరే మార్గమేమీ లేదు. నేను ఇంటర్వ్యూ అవగానే నేరుగా ఇంటికి వెళ్ళిపోతాను. మీరు కూడా తొందరగా వచ్చెయ్యండి….బై బావా” అంటూ నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రోడ్డు దాటేసింది.

ఆఫీసుకు వెళ్ళగానే ఏదో మీటింగు. అటెండ్ అయ్యానన్నమాటే గానీ మనసక్కడ లేదు. ఏదో అయ్యిందనిపించాను. అలా కాంటీన్ వైపు నడుస్తూ, అంజికి పోన్ చేసాను. “వచ్చేయ్ మామా, కాంటీన్ లోనే వున్నాను, నువ్వు నాకు కనిపిస్తున్నావ్..” అంటూ అద్దాల్లోంచి చేతులూపాడు. టూకీగా వాడికి కథంతా చెబితే వినేసి, “…లవ్ స్టోరీ బావుంది మామా ” అని వెనక్కి తిరిగి, “యాదగిరీ….. స్పెషల్ జ్యూసు చెప్పాను ఏమైంది ” అన్నాడు.

“వచ్చేస్తోంది సార్. ” మా వంకే వస్తూ చెప్పాడు యాదగిరి.

“బావుందా లేదా అని కాదు. ఇప్పుడు ఏం చేస్తే బావుంటుందో చెప్పు. మా ఆవిడ సంగతి నీకు తెలుసు కదా….”  యాదగిరి అందించిన జ్యూస్ తీసుకుంటూ అన్నాను.

“లవ్ కోసం ఏమైనా చేయొచ్చు మామా. ఆడపిల్ల, అందునా మరదలు, నోరుతెరిచి అడిగితే కాదంటావా?…. ఈ లవ్ స్టోరీ పేరిట ఈ రోజు పార్టీ. మనం పార్టీ చేసుకొని కూడా చాలా రోజులైంది కదా, పద ఈ రోజు నీకు నేను పార్టీ ఇస్తాను. ” ఖాళీ అయిన జ్యూసు గ్లాసు పక్కన పెడుతూ అన్నాడు.

============================================


పార్టీ పూర్తి చేసుకొని, మా ఇంటి తలుపు తట్టెసరికి రాత్రి తొమ్మిది దాటి పది నిమిషాలు. మా ఆవిడే తలుపు తీసింది. నన్ను చూడగానే  ముక్కు మూసుకుంటూ ” హు, మళ్ళీ అయ్యిందన్న మాట తీర్థయాత్ర”. (అంజి నేనూ కలిసి మందు పార్టీ లకు పెట్టుకున్న రహస్య పేరు తీర్థయాత్ర.. అనుకోని పరిస్థితులలో,  అది మా ఆవిడకు తెల్సిపోయింది. ఆ కథ మరోసారి చెప్తాను) అర పెగ్గు తాగినా, ఆరు బాటిళ్ళు తాగినా ఒకేలా వాసన రావడం మొగాళ్ళ దురదృష్ఠం. నేను హాల్లో కూర్చుంటూ, మా ఆవిడనీ, వాళ్ళ చెల్లెల్నీ కూడా రమ్మని పిలిచాను. ఇద్దరూ వచ్చి కూర్చోగానే  మా ఆవిడను అడిగాను. “నేను మంచి వాడినా కాదా? ఆ ఒక్క సంగతి చెప్పవోయ్ ముందు” అన్నాను.

అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ముసి ముసి నవ్వులు మొదలెట్టారు. నవ్వాపుకుంటూ మా ఆవిడ నెమ్మదిగా అంది. 

మీరు అప్పుడప్పుడూ తీర్థయాత్రలకు వెళ్ళినా, నాకు మంచి మొగుడయ్యారు కాబట్టి, తీర్థ యాత్రలకు వెళ్ళిన ప్రతి వాడిని చెడ్డగా చూడొద్దు అంటారు. అలాగే మా చెల్లెలు ప్రేమించిన వ్యక్తికీ తీర్థయాత్రల అలవాటున్నా పెద్దగా పట్టించుకోవద్దు అంటారు. ఈ సంగతి నొక్కి చెప్పడానికి నాకు తెలీకుండా ఈ రోజు తీర్థయాత్రకు వెళ్ళొచ్చి మరీ,.. నన్ను ఒప్పించాలని  మా చెల్లెలు నిన్నంతా మీ బుర్ర తిని మిమ్మల్ని ఒప్పించింది, అంతే కదా…”   

నేను అయోమయంగా చూస్తుంటే, మరదలు పిల్ల అందుకుంది. “సారీ బావా! నేను చెప్పిన లవ్ స్టోరీ అదీ అంతా గాస్. నాకు తెలీకుండా మీ బావగారు తీర్థ యాత్రకు అస్సలు వెళ్ళరు అని అక్క అంటే, వెళ్ళేలా చేస్తాను అని నేను అక్కతో పందెం కాసాను,…” అని చెవులు వేళ్ళతో పట్టుకొని గుంజీలు తీస్తున్నట్టుగా యాక్షను చేస్తూ  “ …..సారీ బావా…” అంటుండగా, నేను పళ్ళు నూరుతూ “మరదళ్ళు, మర్కటాలూ ఒకటే…”  కచ్చగా అన్నాను.

బోజనం వడ్డించడానికి లేస్తూ మా ఆవిడ ,… “ “ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు,.. అయ్యో పాపం పసివాడు… ”  అని పాటందుకుంది

మా ఆవిడ ఇంతే, మరి మీ ఆవిడ…?

ప్రకటనలు

7 Responses to నారీ నారీ నడుమ షరాబీ..

 1. radhika అంటున్నారు:

  7/10

  మెచ్చుకోండి

 2. Phani అంటున్నారు:

  5/10

  మెచ్చుకోండి

 3. chavakiran అంటున్నారు:

  8/10 !

  మెచ్చుకోండి

 4. sk అంటున్నారు:

  9/10

  మెచ్చుకోండి

 5. జ్యోతి అంటున్నారు:

  పాపం ప్రసాదం… ప్చ్…..

  మెచ్చుకోండి

 6. rajani అంటున్నారు:

  mee blog chaala bavundhi. Kaani ee kada mee standard ki thaggattuga ledhu. kadha saradhaaga rasaranukunna sare cheap look vachindhi. koncham ghatuga ante sorry. Eteevala regular ga mee blog chustunna. Articles chaala bavunnayi.

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: