Life is an Accident


పదుగురూ లేనప్పుడు నువ్వు ఏం చేస్తావో, జీవితంలో అది నీ క్యారెక్టర్
నువ్వే లేనప్పుడు పదుగురూ ఏమంటారో, ప్రపంచం లో అది నీ చాప్టర్


జీవితం కొనల నుండి చూస్తేనే జీవన పథం గెలుస్తుందేమో. మరణం అంచుల నుండి చూస్తేనే మనిషి విలువ తెలుస్తుందేమో, ఎందుకో తెలీదు కానీ, మరణమే మరోసారి జీవించే అవకాశం ఇచ్చింది. నా తత్వాన్ని తనివితీరా కాకున్నా, తడిమి చూసుకునే అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఇవ్వకుంటే, ఈ రోజుకి నేను మరణించి వారం అయివుండేది. కానీ అలా జరగలేదు. అసలేం జరిగిందంటే…..

***************************************************************************


మే 11 , శనివారం మధ్యాహ్నం మూడు గంటలు.


అప్పటికి మరో నాలుగు గంటల ప్రయాణం చేయాల్సి వుంది. వంటరిగానే కారు డ్రైవ్ చేస్తున్నా పెద్దగా అలసట కూడా ఏమీ లేదు. పైగా తెలిసిన జాతీయ రహదారే అవడంతో గాలిని కోస్తూ దూసుకు పోతున్నాను. స్పీడో మీటరు ముల్లు నిట్టనిలువుగా నిలబడి, కారులో నెమ్మదిగా వినిపిస్తున్న ఘంటసాల స్వరాలకు కాస్త, కాస్త తలూపుతోంది.


మరో అరగంట తర్వాత, కారు ముందుభాగపు పైకప్పుపై, సరిగ్గా చెప్పాలంటే రియర్ వ్యూ మిర్రర్ పైభాగాన ఎగురుతున్న తెల్లటి పావురము ఢీ కొంది. ఠాప్ మంటూ ఉలిక్కిపడేయంత శబ్దం. రెక్కలు విరిగిన పక్షి గిలగిలా తన్నుకుంటూ కారుపై నుండి రోడ్డు పైకి జారిపోవడం రియర్ వ్యూ మిర్రర్ లోంచి నిస్సహాయంగా గమనిస్తూ మనస్పూర్తిగా మనసులోనే క్షమాపణ వేడుకున్నాను నేను. ఇలా ఒక పక్షి ఢీకొనడము అనేది కనీసం నా వరకెప్పుడో జరగలేదు. ( మీకెప్పుడైనా జరిగిందా?) . నెమ్మది నెమ్మదిగా ఘంటసాల గళంలో పడి మామూలు అయిపోయేను. మరో పెద్ద సంఘటన నాకోసం ఎదురు చూస్తోందని నాకప్పుడు తెలీదు.

***************************************************************************


మరో రెండున్నర గంటల తర్వాత, సుమారు సాయంత్రం ఆరు గంటలకు;


సూరీడు సంధ్య తో ఎర్రని నిప్పుల హోలీ ఆడుతుండగా, కుడివైపు వంపు తిరుగుతున్న జాతీయ రహదారి పై నా కారు దూసుకుపోతుండగా, హఠాత్తుగా 50 – 70 మీటర్ల దూరంలో రోడ్డు డివైడర్ లోనుండి అపసవ్య దిశలో రోడ్డు పైకి ముగ్గురు కుర్రాళ్ళతో కూడిన బైకు ప్రత్యక్షమైంది.


అసంకల్పితంగా, ఓ చేయి హారన్ మీదకు, ఓ కాలు బ్రేక్ మీదకు వెళ్ళిపోయాయి. బైకును ఢీ కొనకూడదని తప్పని పరిస్థితిలో అంత వేగంలో నా కారుని పూర్తిగా ఎడమవైపు లేను కు తిప్పుతుండగా ఎడమపక్క మరో 50 మీటర్ల దూరంలోవున్న చిన్న బస్టాపును, అక్కడ వున్న జనాన్ని గమనించేను.


వెంటనే మరో షార్పు టర్ను, కుడి వైపుకి రోడ్డు డివైడర్ వైపుగా-


రోడ్డు మధ్యలోకి కారును మరో టర్న్ తీసుకునేయంత వ్యవధి లేకపోయింది.


నా కారు డివైడరు పైకి ఎక్కేయడం, అక్కడున్న మైలురాయిని ఢీకొనడము, ఆ ధాటికి ఆ మైలురాయి పెకలింపబడి కారుతో పాటు గాలిలోకి లేవడము చకచక జరిగిపోయాయి. పక్కనే వున్న బస్ షెల్టరు కన్నా పైకి (కనీసం 8 అడుగులు ) ఎగిరిన కారు ఎడమ పక్కకి తిరిగి నేలను తాకిన క్షణంలో భళ్లుమంటూ అద్దాలన్నీ పగలడము, వెంటనే కారు మరో రెండు సార్లు పల్టీలు కొట్టి వంగిన చక్రాలపై నిలబడిపోవడము నాకు తెలుస్తూనే వుంది.


బస్టాపులో జనమంతా కేకలు వేస్తూ కారు దగ్గరకు వచ్చేసి, పగిలిపోయిన కిటికిలోంచి గాయాలేమీ లేకుండా పూర్తిగా స్పృహ లోనే సీట్లో వున్న నన్ను కళ్ళింత చేసుకొని చూస్తున్నారు. కారుకు ప్రమాదం జరిగిందన్న సంగతి జీర్ణించుకోవడానికి నాకు ఒక్క క్షణం పట్టింది.


సీటు బెల్టు విప్పుకొని, పక్క సీటు కింది నుండి తొంగి చూస్తున్న నీళ్ళ సీసా అందుకొని, రెండు గుక్కల నీళ్ళు తాగాను. బైకు కుర్రాళ్ళ క్షేమ సమాచారం అడిగేను. వాళ్లు పారిపోయారని చెప్పారు. విరిగిపోయిన డాష్ బోర్డు కింద ఇరుక్కుపోయిన పర్సు తీసుకున్నాను. పోలీసులకు, ఇన్సురెన్సు కంపనీకి కాల్ చేయడానికి ఫోన్ కోసం వెదికా కానీ దొరకలేదు. కారులోంచి విసురుగా బయట పడిపోయిన ఫోన్ ను అప్పటికే ఒక దొంగ గారు చేజిక్కించుకొని వుడాయించాడు అన్న సంగతి నాకు అప్పటికి తెలీదు. [సదరు దొంగగారిని, పోలీసుల సాయం లేకుండా 45 గంటల్లో నేనే స్వయంగా పట్టుకొని, ఫోన్ సంపాదించుకున్నాను. ఆ కథ మరోసారి చెప్తాను]

ప్రసాదం; కారు ప్రమాదం


ఓ సారి గాడంగా శ్వాస తీసుకొని, కార్లోంచి దిగాను. జనం ఇంకా అపనమ్మకంగా చూస్తున్నారు. ఫోన్ అడిగాను ఒకర్ని.


“నా దగ్గర బాలన్స్ లేదు” అన్నాడు ఒకతను. నిజమే కాబోలు.


“నీదే కులం” అడిగాడు మరొకాయన. “నేనొక మనిషిని, ఈ పరిస్థితిలో నీకు కులం అవసరమైతే నాకు నీ ఫోన్ అక్కర్లేదు” అని చెప్పాను.


ఒక ముసలాయన ఎవరో తన ఫోన్ ఇచ్చాడు. ముందుగా పోలీస్ కు ఫోన్ చేసాను. తర్వాత ఓ స్నేహితుడికి, అంతే. కంగారు పడతారని ఇంట్లో వాళ్ళకు కూడా తెలియనివ్వలేదు. నేనే స్వయంగా వెళ్లి చెప్పాలి. నన్ను చూస్తే గానీ నాకేమీ కాలేదని నమ్మరు. ముందు ఫోన్ వెతకాలి… చూట్టూ గుమికూడిన వాళ్ళలో కొందరు నా నంబరుకు ఫోన్ చేయడం ప్రారంభించారు. రింగవుతోంది కానీ ఎవరూ ఎత్తడం లేదు.


మరొకరెవరో ఫోన్ ఇచ్చారు. ఇన్సూరెన్సు కంపనీకి ఫోన్ చేసాను. ఫోటోలు తీయాలని చెప్పారు ఇన్సూరెన్సు అయ్యవార్లు. బాగ్ లోపల ఉన్న ఐపాడ్ బయటకు తీసి దాంతో ఫొటోలు తీసాను. ఈ లోగా వచ్చిన పోలీసులతో మిగిలిన కాసిన్ని పనులు పూర్తి చేసుకొని, కదల లేని స్థితిలో వున్న కారును, క్రేన్ తో పక్కకు జరిపించి, ఓ ట్రక్కు లో వేయించి, మిగిలిన, కాసిని భాగాలు ఎవరూ ఎత్తుకుపోకుండా కాస్త సురక్షిత మైన చోటికి తరలించేను, మరో కార్లో గమ్య స్థానం చేసుకునేసరికి రాత్రి 10.30


పది నిమిషాల పాటు పరామర్శలలో గడిపి, ఆ వెంటనే ఇంటర్నెట్ కు కనెక్టు అవగానే నాఫోన్ లొకేషన్ వెతకడం మొదలెట్టాను. మాప్ లో ఎక్కడో గుర్తు తెలియని చోట నా ఫోన్ వేగంగా కదులుతోంది. ఫోన్ ఎత్తుకుపోయిన వ్యక్తి ఏదో వాహనం తో వున్నాడని అర్థం అయింది. ఫోన్ Lost Mode పెట్టిన కాసేపటికి స్విచ్కాఫ్ అయిపొయింది.


భగవద్గీత లోని “కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన । మా కర్మ ఫల హేతురభుహ, మాఁ తే సంగోత్స్వ కర్మణ్యే” ను మనసా వాచా నమ్మిన వాన్ని, ఈ రోజు పనులు సరిగా నిర్వర్తించానన్న తృప్తితో భోజనం చేసి మామూలుగానే నిద్ర పోయాను.

***************************************************************************


ఆదివారం అంతా పరామర్శలు, ఫోన్ కోసం వెతకడం (150 కిలోమీటర్లకు పైగా తిరిగాను) సరిపోయింది. సోమవారం సాయంత్రం దొంగ గారింటికి వెళ్లి ఫోన్ తీసుకున్నాను. అతనో టాక్సీ డ్రైవరు. ముసలి తల్లి, ఇద్దరో ముగ్గురో పసి పిల్లలు, భార్యా, ఇదీ అతని సంసారం. ప్రమాదం లో వున్న నా నుండి, నా ఉద్యోగానికి అవసరమైనదాన్ని (చాలా ముఖ్యమైన సమాచారం, కంటాక్ట్ వివరాలు వున్నాయి) తీసుకుపోయిన అతన్నినేను దొంగని చేసాను. అతని ఉద్యోగానికి అవసరమైన ఆ విలువని (ఆ చిన్న వూర్లో దొంగ గా ముద్ర పడితే బతుకు బండి లాగడం బరువైపోదా?) లాక్కున్న నాకు, అతనికీ పెద్ద తేడా లేదనిపించింది. పోలీస్ కం ప్లైంటు ఏమి ఇవ్వలేదు. అతని కుటుంబం వద్దంటున్నా, అతనికి కొంత డబ్బు ఇచ్చాను. ఇంతకన్నా నేను చేయగలిగింది ఏముంది?


దెబ్బతిన్న కారు ని వర్కు షాపు కు పంపే ఏర్పాట్లు చేసి, మరో కారు డ్రైవు చేస్తూ (అవును, నేనే నడిపాను) అర్ధ రాత్రి దాటాక ఇల్లు చేరుకున్నాను. మంగళవారం ఉదయం, ఇన్సూరెన్సు తాలూకు వ్యవహారాలూ పూర్తిచేసుకొని ఆఫీస్ లో జాయిన్ అయిపోయాను.


రెండు రోజుల పాటు పని వత్తిడి లో వున్నా, మనసు లోతుల్లోంచి ఏదో అలజడి. అప్పుడప్పుడూ గగుర్పాటు, ” నేను నిజంగా ప్రాణాలతో వున్నానా అన్న సంశయం. ఎందుకని ఏ తెలియని దివ్య శక్తో నన్ను కాపాడింది? దైవత్వం మీద తప్ప, దైవం మీద నమ్మకం లేని వాణ్ని. తెలీని శక్తి ఏదో వుందని నమ్మినా, ఆ శక్తి తలానీలాలకు, తడి బట్టల ప్రదక్షిణాలకు తలోగ్గుతుందని నమ్మను నేను. ఊహ తెలిసాక, ప్రసాదం తినడానికి, శిల్పకళా ఉత్సుకతతో తప్ప మొక్కులు చెల్లించడానికి నాలుగు గోడల గుడి మెట్లు ఎక్కలేదు. ఇప్పుడూ ఎక్కాలన్న ఉద్దేశం లేదు. నాకు తెలిసిన దేవాలయం సమాజమే, నాకు తెలిసిన పూజా పద్దతి, తోచిన సాయం చేయడమే. అందుకే నాకు తెలిసిన అనాధ శరణాలయానికి ఫోన్ చేసాను, ప్రస్తుతం చదివిస్తున్న అమ్మాయిలకు తోడుగా, నా స్థోమత కు తగ్గట్టు మరి కొంతమంది అమ్మాయిలకు చదివించే బాధ్యతా తీసుకోవడానికి.

***************************************************************************


ఇదంతా రాయడానికి, నాకున్న రెండు కారణాలు.


మొదటిది, ముఖ్యమైనది. దయ చేసి కారు లో ప్రయాణిస్తున్నప్పుడు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. నేను బతికుండడానికి అతిముఖ్య కారణం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం.


రెండవది, నేను కృతజ్ఞతలు చెప్పే పద్దతి మీద నాకు మరింత నమ్మకం కలగడానికి.


మీ ప్రసాదం

12 Responses to Life is an Accident

  1. సిరిసిరిమువ్వ అంటున్నారు:

    నిజంగా అంత ప్రమాదం నుండి మీరు సురకితంగా బయటపడటం నిజంగానే వండర్ లా ఉంది.

    ఇలాంటివి జరిగినప్పుడు మన జీవితం మీద మనకు ఇంకా ప్రేమ పెరుగుతుంది.

    మెచ్చుకోండి

  2. jaya అంటున్నారు:

    ఈ అనుభవం నిజంగా జీవితాతం మరచిపోకూడనిది.ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా నేర్పిస్తుంది.
    మీరు ఈ విషయం చెప్పటానికి ఉన్న కారణాల్లో నేను ఇంకోటి చేరుస్తున్నాను. ‘జాతీయ రహదారిమీద అంత స్పీడ్ పనికి రాదు’.

    మెచ్చుకోండి

  3. వేణూశ్రీకాంత్. అంటున్నారు:

    మీరు క్షేమంగా బయటపడడం సంతోషకరమైన విషయం అండీ. ఈ సంఘటనను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సీట్ బెల్ట్ విషయం గుర్తుంచుకుంటాను. అలాగే ఫోన్ ఎలా ట్రేస్ చేయగలిగారో కూడా రాయండి వీలు చూసుకుని.

    మెచ్చుకోండి

  4. Sudhakar అంటున్నారు:

    మీరు ముందు జాగ్రత్త తో సీట్ బెల్ట్ పెట్టుకోవడమే కాకుండా , సమయస్పూర్తి తో రాంగ్ డైరెక్షన్ లో వస్తున్న ముగ్గురు మూర్ఖులను కాపాడారు !
    రోడ్డు ప్రక్క గా ఉన్న వారిని దృష్టి లో పెట్టుకుని కూడా డివైడర్ ని క్రాష్ చేసి ప్రాణాలతో బయట పడ్డారు !
    భౌతిక శాస్త్రం ఏమాత్రం తెలియకుండా , కార్లూ , మోటార్ సైకిళ్ళూ తెగ నడిపేస్తున్నారు , జనాలు ! ఎవరి ఖర్మ వారిది అని అనుకోడానికి కూడా వీలు లేకుండా ,వారి ప్రాణాలతో పాటుగా, ఇతరుల ప్రాణాలకూ , ముప్పు అవుతున్నారు అట్లాంటి వాళ్ళు !
    మీ మానవతా దృక్పధానికి అభినందనలు ! మీ సహాయం పొందుతున్న వారికి నిజంగానే మీరు ” ఒక అపూర్వమైన ప్రసాదం ” !

    మెచ్చుకోండి

  5. ఆ.సౌమ్య అంటున్నారు:

    చదువుతుంటే గుండె దడదడలాడిందండీ. ధైర్యంగా, సంయమనం తో మీరు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎదుర్కొన్న తీరు అభినందించదగ్గది.

    మెచ్చుకోండి

  6. Sudhakar అంటున్నారు:

    సీటు బెల్టు జాగ్రత్తలు: శాస్త్రీయం గా సీట్ బెల్ట్ , చాలా సమయాలలో ప్రాణాలను ఎట్లా కాపాడుతుందో నిర్ధారించారు కాబట్టి , విదేశాలలో సీట్ బెల్ట్ ధరించడం తప్పని సరి చేశారు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వాహనం నడుపుతున్న డ్రైవర్ కు జరిమానా విధించడం మాత్రమే కాకుండా , పదే , పదే , సీట్ బెల్ట్ దరించ కుండా వాహనం నడుపుతూ ఉంటే , వారి డ్రైవింగ్ లైసెన్స్ కాన్సిల్ ,చేసి , వారు ప్రమాదాలకు కారణమైతే , జైలు లో కూడా పెడతారు !
    స్పీడు గురించి జాగ్రత్తలు : మోటార్ వే మీద సింగిల్ క్యారేజ్ వే మీద అత్యధిక స్పీడు అరవై మైళ్ళు మాత్రమే ! ( ఒక రోడ్డు అటూ , ఇంకో రోడ్డు ఇటూ ఉంటే )
    డబుల్ క్యారేజీ ( అంటే రెండు రోడ్లు అటూ , రెండు రోడ్లు ఇటూ ఉంటే ) స్పేడు డెబ్బై మైళ్ళు అత్యధిక స్పీడు గా నిర్ణయిస్తారు !
    ఇట్లాంటి జాగ్రత్తలు పాటించడం భారత దేశం లో సంప్రదాయం కాదు ! నడిపే వారికే లేని జాగ్రత్తలూ , ప్రాణ భయమూ , ప్రాణం మీద విలువా , కార్లు అమ్మే వారికి ఎందుకు ఉంటాయి?

    మెచ్చుకోండి

  7. ప్రసాదం అంటున్నారు:

    అవును, నాకూ చాలా అపనమ్మకంగా వుంది.

    జీవితం మీద ప్రేమతో పాటు మరెన్నో మాటల్లో చెప్పలేని మరెన్నో అనుభూతులు.

    మెచ్చుకోండి

  8. ప్రసాదం అంటున్నారు:

    జీవితాంతం మర్చిపోవాలన్న, మరపురాని అనుభూతి కూడా!

    స్పీడ్ విషయంలో మీతో ఏకీభవిస్తాను, అయితే నేను సాధారణంగా పరిమితుల్లోనే వుంటాను.

    మెచ్చుకోండి

  9. ప్రసాదం అంటున్నారు:

    ఫోన్ గురించి కూడా రాస్తానండీ. నేను తిరిగి ఫోన్ సంపాదించడం అనేది, నా స్నేహితులు, బంధువులు, సహోద్యోగులకు చక్కని ఆసక్తికరమైన కేస్ స్టడీ అయికూర్చుంది.

    మెచ్చుకోండి

  10. ప్రసాదం అంటున్నారు:

    సీట్ బెల్టు పెట్టుకోవడం అలవాటైపోయింది. అసలది, లేకుండా కారు నడపలేను. అలాగే రియర్ వ్యూ మిర్రర్లు కూడా.

    కాస్త అయినా అవగాహన లేకుండా రోడ్ల పైకి వస్తున్నారన్న మాట మాత్రం నిజం. ముఖ్యంగా, ఆటోలు, బైకులు. అందుకు ఘనత వహించిన మన సినిమాల పాత్ర కూడా వుంది. కనీసం లేన్ డిసిప్లిన్ కూడా తెలీని వాళ్ళు, అవలీలగా అన్నీ రకాల వాహనాలు నడుపుతుంటారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఖరీదైన వాహన దారుడు తప్పు చేసినట్టు లెక్క.

    మొత్తం ఎపిసోడ్ లో, విషాదంగా అనిపించిన విషయమేమంటే, ఎవరి ప్రాణాలు కాపాడాలని ఇంత ప్రమాదం కొని తెచ్చుకున్నానో, ఆ బైకు వీరులు కృతజ్ఞతలు చెప్పడం అటుంచి, కనీసం నాకు కనిపించలేదు. ఆ వూరి వాళ్ళూ నాకు ఆ కుర్రాళ్ళ గురించి చెప్పకుండా దాచారు.

    మెచ్చుకోండి

  11. ప్రసాదం అంటున్నారు:

    కృతజ్ఞతలు.
    కండిషనింగ్ అని ఒక పద్దతి వుంది. విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు ఎలా ప్రతిస్పందించాలి అనేది మనకి మనం ప్రాక్టీస్ చేయడం అన్నమాట. మన ఆఫీసుల్లో అప్పుడప్పుడూ చేసే ఫైర్ డ్రిల్లు లాంటిది. కొన్ని సార్లు మనస్పూర్తిగా ప్రయత్నిస్తే, సంయమనం కోల్పోకుండా వుండడం ఎవరికైనా సాద్యమే.

    మెచ్చుకోండి

  12. ప్రసాదం అంటున్నారు:

    చాలా విలువైన వివరాలు. కృతజ్ఞతలు

    మెచ్చుకోండి

మీరేమంటారు ...