ఐఫోన్‌తో నేను, ఏం చేస్తూ వుంటానో…

ఆక్సిడెంటు తాలూకూ కథనంలో పోగొట్టుకున్న ఫోన్ మళ్ళీ సంపాదించేను అని చెప్పాను కదా, ఎలా సంపాదించేనో చెప్పేముందు నా ఫోన్‌ను పరిచయం చేయాలి. దాదాపు ఏడాదిన్నర క్రితం, మరో ఫోన్‌కు మారాలి అనుకున్నప్పుడు ఆండ్రాయిడ్, ఐ-ఫోన్ సందిగ్దంలో రెండు మూడు నెలలపాటు కొట్టుమిట్టాడుతుండగా ఒక శుభ ముహూర్తాన, అప్పటికే కొంత కాలంగా ఐ-ఫోన్ వుపయోగిస్తున్న మా తమ్ముడు ఓ సరికొత్త ఐ-ఫొన్ కొని నాకు బహుమతిగా పంపించాడు. అప్పటికి iOS గురించి నాకు పెద్ద పరిచయం లేదు. ఒక్కో ఆంశాన్నీ స్పృశిస్తూ సంతృప్తిపడి, కొద్ది రోజులకే నాకు కావలసిన అన్ని ఆంశాలు వున్న ఫోన్‌గా ఐ-ఫొన్ నా మనసు గెలుచుకుంది. నెమ్మదిగా నా ఒక్కో ఆలోచననీ ఫోన్ లోకి చేర్చేసాను. ఇప్పటికీ చేరుస్తూనే వున్నాను అనుకోండి.

ప్రసాదం ఐ-ఫొన్ ; తాళపు తెర

పెద్దగా కథ చెప్పకుండా, చక చకా ఫోన్ స్క్రీన్స్ చూపిస్తే పని సులభంగా అవుతుంది కదా, అందుకని కాసిన్ని తెరలు ఇక్కడ అతికించాను. ఇదిగో ఈ పక్కన కనిపించేది నా ఫోన్ తాళపు తెర (Locked Screen).

అప్పుడెప్పుడో హిమాలయాలకు వెళ్ళి-నప్పుడు తీసిన ఫోటొను తెర చిత్రంగా అతికించాను.

స్మార్టు ఫోన్లో అప్లికేషన్లు వెతికి దింపుకోవడం ఒక ఎత్తు అయితే, వాటిని సరైన తరగతులలోకి విభజించి వుపయోగించుకోవడం మరో ఎత్తు. దీనికి తోడు తెలుగు పట్ల వున్న అభిమానం కూడా తలకెక్కి, అక్కడ్నుంచి ఫోన్లోకి కూడా దూరింది.

అలా దూరిన తెలుగు అప్లికేషన్లను కట్టగట్టడంతో ఆగిపోకుండా ఇంకాస్త ముందుకు వెళ్ళి ఏకంగా iTunes తో కూడి నా కిష్టమైన సంగీతాన్ని, సాహిత్యాన్ని కూడా తెలుగు అక్షరాల్లో పరిచేసింది. ఫోన్లో వినిపిస్తున్న పాట చక్కని తెలుగు అక్షరాల్లో కనబడటం పైనున్నచిత్రంలో చూసే వుంటారు.

ప్రసాదం ఐ-ఫొన్ ; తొలి తెర

ఇక ఎడమపక్క కనిపించే చిత్రం, నా ఫోన్ తాలూకూ తొలి తెర. మరీ ఎక్కువగా అవసరం అయ్యే అప్లికేషన్లని వివిధ జట్లుగా చేసి ముడేసా! అవసం స్ఫురించేలా ఒక్కో జట్టుకీ నాకు నచ్చిన పేరు పెట్టాను.

ఉదాహరణకి, మాటలు (SMS, VOIP, ఇంటర్నెట్ ఫొన్ లాంటివన్నీ), పాటలు, ఆటలు, సుదూర దర్శనం (ఈ మెయిలు, టివీ చానల్సు, న్యూస్ పేపర్లు), దారీ తెన్నూ (వాతావరణం, GPS సర్వీసులు, ప్రయాణ/వసతి వివరాలు), మూడో కన్ను (ఫోటొలు, కెమెరాలు, ఫిల్టర్లు), కొండ గుర్తులు (మర్చిపోకుండా లిస్టు రాసుకునే చాకలి పద్దు లాంటి వ్యవహారాలు). సందర్బం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. కొండగుర్తుల పుణ్యమా అని, ఈ మధ్య కొనాల్సినవి ఏమీ మర్చిపోకుండా ఇంటికి వెళ్తున్నా. 😀

ప్రసాదం ఐ-ఫొన్ ; తొలి తెర లోన మాటల తరగతి

మాటల జట్టులోని అప్లికేషన్ల గురించి మరికాస్త వివరంగా పక్క చిత్రంలో చూడండి. మీరు ఇప్పటికే స్మార్ట్ ఫోన్ వాడుతుంటే, ఈ అప్లికేషన్ల స్థాయి సామర్థ్యాలు తెలిసే వుంటాయి.

బాగా నచ్చిన ఉచిత మెసేజింగ్ సర్వీస్ WhatsApp (ఇంటర్నెట్ లేదా 3G తప్పనిసరిగా వుండాలి). Nymgo తో ప్రపంచంలో ఏ మూలనుండైనా ఎక్కడికైనా అతి తక్కువ ఖర్చుతో ఫోన్ చెయ్యచ్చు. True Caller తో గుర్తు తెలియని అగంతక ఫోన్ కాలర్స్ అంతు చూడొచ్చు. Skype, Tango ల గురించి చెప్పనక్కరలేదు కదా.

మరీ ఎక్కువ లోపలి వివరాలకు పోకుండా, నా ఫోన్లోని మరో తెర ను చూద్దాం. ఈ తెరలో, కాస్త తక్కువ తరచుగా వుపయోగించే అప్లికేషన్లను గుంపులుగా చేర్చివుంచాను.

ప్రసాదం ఐ-ఫొన్ ; ఇది రెండో తెర.

కాసులగోల (విదేశీ మారకపు విలువ, బ్యాంకు వ్యవహారాలు, జమా ఖర్చులు)
పనిముట్లు (బూతద్దము, క్యాలికులేటరు, ఫ్లాష్ లైటు), పరభాష (వివిధ భాషల నిఘంటువులు), నేను; ఐపోను (ఫోను మరియు తెలుగు సంబందిత అప్లికేషన్లు), పనిలో పని (అత్యవసర స్థితిలో వర్డు, ఎక్సెల్, పవర్ పాయింట్ పైళ్ళతో పని చేయగలిగేలా అప్లికేషన్లు), మెదడుకు మేత (ఆలోచనా స్రవంతికి సంభందించిన మైండ్ మాపింగ్), ఆకాశ వీధిలో (ఖగోళ పిడుగుల ఆసుపాసులు), మేఘ మాలిక (క్లౌడ్ స్టోరేజ్ అప్లికేషన్లు). ఇలా ఓక్కో అవసరానికి ఒక్కో తరగతిని సృష్టించాను. తయరు చేసిన ప్రతీ జట్టుకీ పేరు పెట్టే విషయంలో తడబాటు కూడా ఏమీ లేదు. అలవోకగా జరిగిపోయింది. ఈ ఐపోన్ ప్రభావం వల్ల కొన్న ఐపాడ్‌లో అప్లికేషన్లను గుంపులుగా కూర్చినప్పుడు వాటికి పేర్లు పెట్టేయడం కూడా అలవోకగా జరిగిపోయింది (Totally new names from iPhone groups).

ప్రసాదం ఐ-ఫొన్ ; ఇది చివరి తెరఇక ఇక్కడ కుడి పక్కన కనిపించే తెర, ముచ్చటగా మూడోది మరియు చిట్టచివరి తెర. ఏవో గుడుపుఠానీలు చేయాలనుకున్నపుడు తప్ప, ఈ తెరకు కాస్త అరుదుగా వస్తుంటాను. అందుకు తగ్గట్టుగా గూడుపుఠాని అనే గుంపును చూసారు కదా. అన్నట్టు, ముఠా మేస్త్రీ అన్న పేరు చూసి సీనీ ఉద్రేకాలు ఏవీ తెచ్చుకోవద్దు. ప్రాజెక్టు మేనేజిమెంటుకు చెందిన అప్లికేషన్ల జట్టుకు నేను పెట్టిన పేరది.

అప్లికేషన్లన్నింటిలోనూ నేను ఎక్కువగా వుపయోగించేది, మ్యూజిక్. ఎక్కువ సమయం వెచ్చించిందీ దానికే. ఎప్పుడో ఓసారి, ఏదో పాట వింటున్నప్పుడు ఆ పాట రాసింది ఎవరబ్బా అన్న ప్రశ్న ఉదయించి, అప్పటికప్పుడు సమాధానం వెతకాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితులకి సమాధానంగానా అన్నట్టు, పాటల తాలూకూ వివరాలన్నీ (చిత్రం పేరు, అభినయించిన నాయికా నాయకులు, విడుదలైన సంవత్సరము, సంగీత దర్శకుడు, చిత్ర దర్శకుడు, పాడిన వారు, ఆ పాట సాహిత్యము) నెమ్మదిగా iTunes కి జోడించాను.

ప్రసాదం ఐ-ఫొన్ ; భావావేశ పరంగా పాటల విభజన.

అంతే కాదు, పాటలనిటినీ, భావోద్వేగాల (Genres) వారిగా విభజించేను. చటుక్కున స్వచ్చమైన తెలుగు అందం కనిపించిందనుకోండి, మీ మనసు ఆరాధనగా చూడకపోతే మీలో తెలుగుదనం లోపించిందని లెక్క. నాలో అలాంటి తెలుగుదనం లోపించకుండా ;-), ఆ ఆరాధనను పాటల పల్లకిలో ప్రవహింపజేయడానికి అచ్చు ఆ తరహా పాటలే వినాలని ఈ ఏర్పాటు చేసుకున్నాను. మది కోరుకున్న తరహా పాటలే చుట్టూ ప్రవహిస్తాయి. ఎంచుకున్న తరహా పాటలలోనే అభినయించిన నాయికా నాయకుల ఎంపిక, చలన చిత్రాలా ఎంపిక, గీతాల ఎంపిక, అవసరమంకుంటే, వింటూనే గీత సాహిత్యం చూసే ఏర్పాటు. iTunes లోకి ఈ వివరాలు అన్నీ ఎక్కించే ప్రయత్నంలో బోలెడు ఆశ్శర్యపడే విషయాలు బుర్రలోకెక్కాయి.

ప్రసాదం ఐ-ఫొన్ ; భావావేశ పరంగా నటీ నటులు.అన్నట్టు పనిలో పనిగా కొన్ని ఉచిత సాఫ్ట్‌వేర్ లను వుపయోగించి, నా ఫోన్ కోసం చక్కని రింగుటోన్లు తయారు చేసుకున్నాను. చక్కటి అనుభవం, పైగా రింగుటోన్లు తయారు చేయడం అంత కష్టమైన పనేమీ కాదు అన్న నిజం కూడా తెలిసి పోయింది.పాటల సాహిత్యం కోసం వెతుకుతున్నప్పుడు, కొన్ని అపురూపమైన పాటలూ వాటి సాహిత్యమూ దొరికాయి.

మచ్చుకి ఈ కింద ఇచ్చిన, మేఘ సందేశం చిత్రం కోసం సిద్దపరచిన దేవులపల్లి సాహిత్యాన్ని చూడండి. జేసుదాసు గొంతులోంచి అలవోకగా పదాలు జారుతుంటే, అనీర్వచనీయ అనుభూతి ఏదో పలకరించకుందా వుంటుందా?

ప్రసాదం ఐ-ఫొన్ ; సీనీ గీత సాహిత్యం.

ఏవో కారణాల వల్ల, రికార్డు అయినా సరే, ఈ పాట చిత్రంలో జత చేయబడలేదు. అంచేత అప్పటి కేసట్లలో కూడా విన్న గుర్తు లేదు నాకు. ఇప్పుడు మాత్రం నేను తరచుగా వినే పాటల పద్దులో చేరింది.

ఒక్క సినిమా సాహిత్యమనే కాదు, అన్నమాచార్య కీర్తనలు, రామదాసు కీర్తనలు వీలయినన్ని చోట్ల తాత్పర్యముతో సహా దిగిపోయాయి. బాల మురళి ఆలాపనలు రాగాల పేరు (వాటి ఆరోహణా, అవరోహణా క్రమంతో సహా) ఫోన్లో నిక్షిప్తం చేసేను.

ఇంత పొందికగా, పద్దతిగా తయారైన ఫొన్ చేజారితే మళ్ళీ చేజిక్కించుకునే ప్రయత్నాలు చేయకుండా వుంటానా? ఇంతకీ ఏకంగా నా ఫోన్ దొంగిలించిన సదరు దొంగ గారి ఇంటికి ఎలా వెళ్ళగలిగేనన్న సంగతి మరో టపాలో చెబుతాను. ఈ లోగా నా తెలుగు దరహాసాల ఫోన్ గురించి మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి.

ఇట్లు
మీ ప్రసాదం.

ప్రకటనలు

10 Responses to ఐఫోన్‌తో నేను, ఏం చేస్తూ వుంటానో…

 1. Satyanarayana Yvv అంటున్నారు:

  తెలుగు మీద మీకున్న అభిమానం చూస్తే ముచ్చటగా ఉంది .ఐ ఫోన్ లో ఇన్ని మార్పులు చేసుకోవచ్చా? నిజ్జంగా చాలా చాలా .చాలా బాగా చేశారు , వ్రాసారు కూడా .

  మెచ్చుకోండి

 2. ratna అంటున్నారు:

  ela chesaro kuda rayandi. chaala chaala bavundi mee post. dhanyavadalu.

  మెచ్చుకోండి

 3. ప్రసాదం అంటున్నారు:

  @ సత్యనారాయణ గారు,
  ధన్యవాదాలు.

  @ రత్న గారు,
  ఎలా చేసాననేది కూడా త్వరలో రాయడానికి ప్రయత్నిస్తాను.

  మెచ్చుకోండి

 4. Manju అంటున్నారు:

  Very well described

  మెచ్చుకోండి

 5. nag అంటున్నారు:

  మీరు యెమెమి అప్ప్ వాదుతున్నరొ ఆవి Android లో లాబ్యమ్ అవుతున్నయ, అదే విదంగా Android Phoneను తెలుగు లో వాడడం గూరీంఛి తెలపండి-నాగ్

  మెచ్చుకోండి

 6. ప్రసాదం అంటున్నారు:

  @ నాగ్ గారు,
  దాదాపు అన్ని అప్లికేషన్లకు అండ్రాయిడ్ వర్షన్లు వున్నాయి. నేను ఇంతవరకూ అండ్రాయిడ్ ఫోన్ వాడలేదు కనుక దానిలో తెలుగు వాడకం గురించి చెప్పలేను.

  మెచ్చుకోండి

 7. ప్రసాదం అంటున్నారు:

  @ మంజు గారు,
  ధన్యవాదాలు

  మెచ్చుకోండి

 8. చంద్ర శేఖర్ కాండ్రు అంటున్నారు:

  ఐ-ఫోన్‌లో తెలుగు చదవటం మాత్రమేకాక, మొత్తంగా ఫోన్‌నే తెలుగులో వాడుతున్నారంటే మీరెంతో అభినందనీయులు. ఏదో బ్రౌజర్‌లో తెలుగువస్తే చాలు అనుకునే నేను మీ తెరపట్టులు చూసి ఎంతో ఆశ్చర్యపడ్డాను. మీరు ముందే చెప్పినట్లుగా మీ ఫోన్‌ని ఇలాఎలా మార్చారో ఓ టపా వేయండి.

  మెచ్చుకోండి

 9. srimihira అంటున్నారు:

  చాలా చాలా బాగుందండీ మీ ఈ టపా..శుభాకాంక్షలు.

  మెచ్చుకోండి

 10. ప్రసాదం అంటున్నారు:

  కృతజ్ఞతలు శ్రీమిహిర గారు

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: