అన్నీ వేదాల్లోనే వున్నాయిష….

డిసెంబర్ 27, 2010

ఆ దేశమూ ఈ దేశమూ  తిరుగుతూ పుట్టిన దేశాన్ని తిరక్కపోతే బావుండదని బుద్ది పుట్టి, ఓ ఆరు నెలల క్రితం ముంబై లో దిగీ దిగగానే పోలోమంటూ బోలెడు చోట్లకు బయలుదేరాను. వెళ్లేప్పుడు తోడుగా బోలెడు పాటల్ని తీసుకెళ్ళేను కదా,  అలాగే వచ్చేప్పుడు బోలెడు జ్ఞాపకాలు తోడు తెచ్చుకోవచ్చని, భుజాన ఓ కెమెరా తగిలించుకుని మరీ కారెక్కాను. సెల్ ఫోన్ లో కెమెరా ఎంచేతో నాకు అస్సలు నచ్చని విషయం అనుకోండి. నా ప్రయాణంలో పదనిసలు కొన్ని, జ్ఞాపకాల గమకాలు కాసిన్ని ఇక్కడ గుది గుచ్చేను.

ముసురుపట్టిన ముంబై నుండి  బయట పడి అరవై కిలోమీటర్లు అలా అడవిలోకి వెళ్ళి, “దేశమెంత మధురం, పరదేశమంత కఠినం … ” అని అనుకుంటుండగానే మేఘపు షాలువా కప్పుకున్న ప్రకృతి ఇదిగో, ఇలా స్వాగతం చెప్పింది.

 ప్రసాదం


చెప్పొద్దూ, ఎప్పుడో విన్న పాట అలలు అలలుగా గుర్తొచ్చేసింది.

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ,
ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను చేరెదను,…”


అలా ఇంకాస్త ముందుకెళ్ళగానే వలపు గాలి తమకం తో చుట్టేసినట్టు ఇదిగో ప్రకృతి ఇలా అల్లుకుపోయి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటే,  ఏమని చెప్పను, ఎలా చెప్పను? 
 

ప్రసాదం
 

ప్రకృతి కాంత ను పరవశించి చూస్తూ పొలము పుట్రా వెంట  కారు పరిగెత్తిస్తుండగా.. హఠాత్తుగా నేను దారి తప్పేనేమోనని అనుమానం వచ్చింది. ఎవరినైనా అడుగుదాము అని కారు అలా కాస్త నెమ్మదిగా పోనిస్తుండగా, అదృష్ఠం బావుండి పశువులు కాసుకునే కుర్రాడొకడు ఓ కొమ్ములు తిరిగిన గేదె పై కూర్చొని, “నీది కారు అయితే నాది రోల్స్ రాయిసు …” అనేంత దర్పంతో  ఎదురొచ్చాడు. నేను కారు దిగి వచ్చీ రాని మరాఠి లో కొంత, హిందీ లో మరి కొంత కష్ఠ పడి అడిగితే, నాకు సరిన దారి చూపించాడు; గేదె దిగకుండానే లెండి. 

హమ్మయ్య , దారి తెలిసింది అన్న ఉత్సాహంతో  కారు స్టార్టు చేస్తూ   అలవాట్లో పొరపాటుగా నేను “థాంక్యూ ” అన్నాను.  

“వెరీమచ్ ” అంతే వేగంగా ఆ కుర్రాడు నాకు సమాధానం చెప్పేడు. “నాక్కూడా వచ్చు లేవో ఆ మాత్రం ఇంగ్లీష్ … ” అన్నట్టున్నాయి అతని కళ్ళు.

ప్రసాదం

 

అలా నవ్వుల ఆటలతో , ఆటల పాటలతో, పెదాల అంచున పదాలు పాడుతూ, మంచు తెరల చాటుగా,  గాలి మరల  మీదుగా ప్రయాణించి ఆ రాత్రికి గమ్యం చేరుకున్నాను. చాలా కాలం తర్వాత కలుసుకుంటున్న ఆనందం కాబోలు,ఇన్ని వందల మైళ్ళు ప్రయాణించినా కాస్త అలసట కూడా లేదు.

అక్కడక్కడా విసిరేసినట్టున్న ఇళ్ళు. అంతా కలిపి ఓ రెండు వందలు వుంటాయేమో. 

కరంటు పోయి  చాలా సేపు అయినట్టుంది. కప్పల బెక బెకలు, కీచురాళ్ళ రొద;

నా చుట్టూ మాత్రం జ్ఞాపకాల పయ్యెద.


పొరలు పొరలుగా విప్పుకునే నా జ్ఞాపకాల అరలు,
తెరలు తెరలుగా కమ్ముకునే జీవితాల సరాగాలు,


మధ్య మధ్యలో జంతికల జావళీలు, కూడా మమకారపు కారప్పూస,
ఓ చేత చేగోడీలు, ప్లేటు నిండా పకోడీలు, ఆపై వేడి వేడి టీలు.


వదిలిపోకుండా నేనూ వున్నాను అని అప్పుడప్పుడూ త్వరపడే వరుణుడి అడుగుల సవ్వడి;
-జల్లు జల్లు మంటూ 


నిదురపోకుండా నేనూ వింటున్నాను అని ఎప్పటికప్పుడు తడబడే, వయసు పైబడిన స్వర సడి;
-ఖళ్ళు ఖళ్ళు మంటూ


పక్క గదిలోకి వెళ్ళి అడిగాను.


“తాతగారూ ఎలా వున్నారు”? 

“బానే వున్నాను కానీ, ….” కాస్త ఆగి శ్వాస తీసుకొని “వయసైపోతుంది కదరా.., ఎనభయ్ దాటలేదూ,నీ కబుర్లు వింటున్నాను… చాలా పెద్దాడివయ్యావ్”  


ఒకప్పుడు వేదం పలికిన దేహం

ఇప్పుడు నిర్వేదం తొణికే దేహం


పెళ్ళి చేసుకుంటావా తాతా అంటే నాకు పిల్లనెవరిస్తార్రా అని అనటం మామూలే కదా, అలా  కాసేపు ఉత్సాహాం పోగేద్దామని తాతకి కబుర్లు చెప్పడం మొదలెట్టాను.  
ఏదో వర్షం పడుతోందని ఇలా పడుకున్నావు కానీ, అసలు వయసైపోయినట్టు కనిపిస్తున్నావా తాతా? నేనుండే దేశంలో, నీకులా ఉత్సాహంగా వుండే వాళ్ళంటే  పడి చస్తారు తెలుసా. అందాకా ఎందుకు; నువ్వు అనుకోవాలే గానీ పడుచు పిల్లలు మీ వెంట తిరగరూ…


ఆ,.. ఆ.. వయసైపోయినవాన్ని, పడుచు పిల్లల గొడవ నాకెందుకుగానీ  ఒరే అబ్బీ, వూరంతా పడవల్లో లాహిరి లాహిరి అంటూ తిరగొచ్చన్నావ్, హిమపాతాలన్నావ్, సుందరాంగులు, స్వేచ్చాప్రణయాలు, సంపదలు  అన్నీ అంటున్నావ్, ఇలాంటి లక్షణాలతో వుండే వూరు గురించి మా కాలంలో పురాణాల ఆచార్యులు చెప్పేవారు. వూరు పేరేమిటన్నావ్.. మళ్ళీ చెప్పు.”  అన్నాడు శ్వాస  ఎగపీలుస్తూ

అమ్‌స్టర్‌డామ్ తాతయ్య.” చాతీ పై నిమురుతూ చెప్పాను

అంతో ఇంతో వేదాధ్యయనం చేసిన వాడివి, నీకూ ఉచ్చారణా దోషాలేమిట్రా? ఆచార్యులవారిలా స్వచ్చంగా అమరేశ్వరధామం  అన్లేవూ.  నోరు తిరగని మ్లేచ్చవెధవలు  అమ్‌స్టర్‌డామ్ అంటే నువ్వు అలాగేనా అనడం. …… ¤§£..=#/..æm?€^~ “

తాతయ్య ఎడా పెడా వాయించేస్తున్నాడు. అన్నీ వేదాల్లోనే వున్నాయిష… అని గిరీశం చెప్పింది నిజమేకాబోలు. 


….ఏమని చెప్పేది తాతయ్యకి

==================================================

కొన్నాళ్ళ (కొన్నేళ్ళ అనాలేమో ) క్రితం రాసిన  అమ్‌స్టర్‌డామ్ విశేషాలు ఇక్కడ   చదవండి

ప్రకటనలు

ఏకాంత వేళ, ఓ కాంత సేవ…

ఆగస్ట్ 3, 2008

హమ్మయ్య, చాలా కాలానికి పని లేని సాయంత్రం దొరికింది కదా అని ఆనందంతో లాప్‌టాప్ షట్ డవున్ చేస్తుండగా, డెస్క్ టాప్ వాల్ పేపర్ పై నేను అతికించుకున్న వాక్యం “When was the last time you did something for the first time?” అని ప్రశ్నించింది. సరే, ఈ వారానికి ఏదైనా కొత్త పని ప్రయత్నించాలి అని అలోచనలతో ఇంటికి బయలుదేరాను. వూరు మధ్యలో చిన్న అపార్టుమెంటులో కన్నా,  వూరు పొలిమేరలో విశాలమైన ఇంటిలో నివసించడానికి ఇష్టపడతాను నేను.

ఇంటి చుట్టు చిన్న గార్డెన్, మధ్యలో ఒక వూయల, వూయల పక్కన, తపో దీక్షలో నిశ్శలంగా వున్నట్టు తెల్లగా  విరబూసిన నందివర్ధనం చెట్టు…

చిరు చలి ఉదయాలు, తేనీటి కబుర్లు…,
చిరు సాయంత్రాలు,  చిలిపి నవ్వుల దిగంతాలు,…
సన్న జాజులు, సరాగాలు,..
పున్నమి రాత్రులు, వెన్నెల జలకాలు,….
తలపుల నిండా వలపుల పంటలు…
మన ఒంటరి తనంలో మనసుల దగ్గరితనం,.
మనసుల దగ్గరితనం లో …,

అలోచనల్లో చూసుకోలేదు. అప్పుడే ఇంటికి వచ్చేశాను. కారు పార్క్ చేసి కాలింగ్ బెల్ నొక్కబోతుండగా, “వందనాలు , వందనాలు వలపుల హరి చందనాలు, వెన్నెల్లో వేచి వేచి వెచ్చనైన నా సామికి వందనాలు….” అని ఇంట్లోంచి పాట మధురంగా మొదలైంది. కాలింగ్ బెల్ నొక్కడం మానేసి అలా రెయిలింగ్ పట్టుకొని నిలబడిపోయి నేను కూడా “కన్నులలో నీళ్ళు నిలిచి చల్లనైన నా దేవికి వందనాలు …” అంటూ కోరస్ అందుకున్నాను…,

నా గొంతు వినింది కాబోలు, తలుపుకు లోపలి వైపున గడి తీస్తున్న చప్పుడు అవగానే, నేను ఓ పక్కకు దాగున్నాను. తను తలుపు తీసి, ఏవరా అని చూడబోతుంటె, నేను ఒక్క సారిగా గుమ్మం ముందుకు వస్తూ విఠలాచార్య సినిమాలో లాగా అరిచి భయపెట్టబోయాను. తను ఒక్కసారి గగుర్పాటుతో వెనక్కి తగ్గి, అంతలోనే చిరునవ్వుతో మళ్ళీ ముందుకు వస్తూ, “అయితే మీరన్న మాట..” అంది.

ద్వారానికి ఓ ప్రక్కగా భుజం తాకేలా నిలబడి, ఓ చేత్తో, నడుముకి పమిట దోపుకుంటూ మరో చేత్తో గరిట తిరగేసి చేయిని చెక్కిట చేర్చి నా కళ్ళలోకి చూస్తూ వుంటే, నాలో ముప్పిరిగొన్న బావనలేవో ప్రజ్వరిల్లి, “కదలొద్దు, నీకు ఇప్పుడు అర్జంటుగా ఒకటి ఇవ్వాలి అని వుంది.” అంటూ తన దగ్గరికి జరిగాను. నా శ్వాస వేడి తన వంటిపై ప్రతిఫలించి మళ్ళీ నన్ను చేరుతుందన్నంత దగ్గరగా రాబోతుంటె, మధ్యలోంచి తన చేయి, దానితో గరిటా పైకి లేచాయి.

ఇదేంటి పానకంలో పుడకల గురించి విన్నాను గానీ ఇలా సరసంలో గరిటల సంగతి ఎప్పుడూ వినలేదే అన్నాను వెనక్కి తగ్గకుండా. తను వెనక్కి జరుగుతూ, “ఏదో ఈ రోజు పౌర్ణమి కదా, శ్రీవారికి ఈ సాయంత్రం గార్డెన్‌లో వెన్నెల భోజనం ఏర్పాటు చేద్దామని పాపం నేనూ, నా గరిటా కష్టపడుతున్నాం.” అంది నుదిటిపై చెమటను తుడుచుకోవడాన్ని అభినయిస్తూ.

“వావ్, ఈ రోజు పౌర్ణమి కదూ. అయితే ఈ రోజు వెన్నెల భోజనాలు, మల్లెల కబుర్లు,.. Disappoited Cupనువ్వు ఊ అనాలే గానీ వంట మొత్తం నేనే చేసేయనూ.” అంటూ తన వెనకే కిచెన్ లోకి నడిచాను. తను హాట్- ప్లేట్ ఆన్ చేసి జీడి పప్పులు వేయిస్తూ, “ఇక చేయడానికి పని ఏమీ మిగలలేదు లెండి. సేమ్యా లోకి ఈ కాస్త చల్లితే చాలు”.

“మరి కిస్‌మిస్ లు వద్దా…” అర్థొక్తిలో  ఆగాను. తను వెనక్కు తిరిగి తనకు అలవాటైన సన్నని నవ్వుతో, “ఈ మాటలకేమీ తక్కువ లేదు,” అని అంతకు ముందే వేయించి పక్కన పెట్టిన ఎండు ద్రాక్షను నా నోటికందిస్తూ “కాస్త ఈ హాట్‌పాక్ లన్నీ గార్డెన్లో పెడుదురూ…” అంది.

“పెడతానుగాని మరి నాకేమిస్తావ్…” కనుబొమలెగరేస్తూ అడిగాను.

“ఎం కావాలేంటి?” అడిగింది వేయించిన జీడిపప్పు పక్కన పెడుతూ.

“నేను నీకు ఎప్పుడూ చెబుతాను చూడు, అలా నువ్వు నాకు చెప్పవా?..” సేమ్యా లో జీడిపప్పు కలుపుతూ గారం పోయాను నేను.

“ఏవిటో అది” ముసి ముసి నవ్వుతో ఆడిగింది మా ఆవిడ.

“అదే, చిన్న వాక్యం. మూడే మూడు పదాలు వుంటాయి. మొదటి పదంలోనేమో ఒక్క అక్షరమే, రెండో పదంలో నాలుగక్షరాలు, చివరి పదంలో మూడే అక్షరాలు..” అన్నాను నేను

“నేను చెప్పను బాబు, నాకు సిగ్గు ..” అంది దాచుకోలేని ముసిముసినవ్వుతో కిస్మిస్ సేమ్యా పై చల్లుతూ.

“ప్లీజ్, ప్లీజ్ ఓ సారి చెప్పవా…” మరింత గారం పోయేను నేను.

తను వరమిస్తున్న దేవతలాగా పోజు పెడుతూ, “ఇప్పుడు కాదు, రేపు పొద్దున నిద్రలేవగానే చెబుతాను, కానీ…” ఆగింది మా ఆవిడ,

వెలిగిపోతున్న కళ్లతో అడిగాను “ఆ, కానీ..”

“ఇప్పటి నుండీ, రేపు ఉదయం వరకూ అన్ని పనులు మీరే చేయాలి. నాకు అన్నం తినిపించడంతో సహా..” అంటూ చిన్న పిల్లలా కండిషన్ పెట్టింది.

“ఓస్ అంతేనా”, అన్నాను.

“అన్నం తినిపించాక కథ కూడా చెప్పాలి, మీ ఆఫీస్ కథలొద్దు!” అంది కొత్త కండీషన్ జతచేస్తూ.

“ఓ యస్ ” అని ఐదు నిమిషాల్లో స్నానం చేసి డ్రెస్ మార్చుకొని, మరో ఐదు నిమిషాల్లో భొజనం వడ్డించేసాను.

పండు వెన్నెల వేళ, చిరు చలి నేను కూడా వున్నానోచ్ అని కొద్దికొద్దిగా అప్పుడప్పుడూ వణికిస్తుంటే,  మా ఇంటి గార్డెన్లో ఊయల బల్లపై నెమ్మదిగా వూగుతూ,  చిన్నగా సంగీతం పెట్టుకొని

కాస్త కారం పప్పు, వేడి నెయ్యితో మొదలెట్టి, గుత్తొంకాయ కూరంతా ఒక గుక్కలో తినేసి, బెండకాయ వేపుడు, మునక్కాయల సాంబారు మురిపంగా మొదలెట్టి, మజ్జిగలో నానేసిన మిరపకాయలు అదరువుగా, గడ్డ పెరుగు ఇంకా ఎర్రటి ఆవకాయ.,

మారంగా వద్దంటూ తనూ, గారంగా తినిపించే నేనూ

..ఓహ్హ్,  చెప్పలేనంత రుచికరమైన జీవితం.

సేమ్యా తినిపిస్తూ అన్నాను నేను. “అన్నిట్లోకీ, సేమ్యా బావుంది కదా..”

“ఆవునా, ఎందుకని ?” ప్రశ్నార్థకంగా అడిగింది తను.

“చివర్లో నేను జీడిపప్పు వేసి కలిపాను కదా, అందుకు ..” అన్నాను.

పెదాలు బిగబట్టి, “నువ్వెప్పుడూ ఇంతే” అని గిల్లి  “..ఇప్పుడు కథ చెప్పు” అంటూ శాలువా కప్పుకొని వెనక్కి వాలి వూయలలో వూగసాగింది.

“అనగనగా ఒక మంచి రాజు, నాలాగా”  అని ఆగాను. నందివర్ధనం చెట్టు ఆకుల గలగలలు మానేసి  నిశబ్దంగా అయిపోయింది!

“ఊ,” అంది మా ఆవిడ. హాడావుడిగా మేఘాల్ని పక్కకి తరిమేసి చంద్రుడు తొంగి చూడ్డం మొదలెట్టాడు.

“ఆ రాజుకు ఏడుగురు అందమైన భార్యలు…” అని నేను ఇంకా చెప్పబోతుండగా

“ఈ కథ బాలేదు, వేరే కథ చెప్పు ” కళ్ళు పెద్దవి చేస్తూ అంది.

“సరే, ఆ రాజుకు ఒకే ఒక అందమైన భార్య, నీ లాగా”. ఈ సారి మేఘాలన్నీ కలిసి ఐకమత్యంగా చంద్రున్ని కమ్మేసాయ్.

“ఊ..” అంది తను.

“ఓ వెన్నెల రాత్రి, ఆమె రాజును ఓ కథ చెప్పమంది. అప్పుడు రాజు కథ ఇలా చెప్పడం మొదలెట్టాడు. ఆ కథ ఏమంటే..”

“ఊ..” అని అంటుండగా నేను తన దగ్గరికి జరిగాను. కథ వినడానికి కాబోలు, నెమ్మదిగా గాలి కూడా రావడం మొదలైంది.

“అనగనగా ఒక అనగనగా ఒక మంచి రాజుంటాడు, నాలాగా అని రాజు కథ మొదలెట్టాడు” నందివర్ధనం చెట్టుకు కథ అర్థమైనట్టుంది. ఆకులు గలగలలాడించడం మొదలెట్టింది.

“…ఆ రాజుకు ఒకే ఒక అందమైన భార్య, ఓ వెన్నెల రాత్రి, ఆమె రాజును ఓ కథ చెప్పమంది. అప్పుడు ఆ రాజు కథ ఇలా చెప్పడం మొదలెట్టాడు. ఆ కథ ఏమంటే..” గాలికి కూడా నేను చెప్తున్న కథ పూర్తిగా అర్థమైనట్టుంది. గట్టిగా వీయడం మొదలెట్టాడు.

“…అనగనగా ఒక రాజుంటాడు, …ఆ రాజుకు ఒకే ఒక అందమైన భార్య, ఓ వెన్నెల రాత్రి, ఆమె రాజును ఓ కథ చెప్పమంది. అప్పుడు ఆ రాజు …” అంటున్న నన్ను ఆపి “ఈ కథలో ఎంత మంది రాజులు వున్నారు ఇలా,” అడిగింది మా ఆవిడ.

“నువ్వు విన్నంత సేపు ఇలా రాజులు వస్తూనే వుంటారు అన్నాను నేను ఊయలలోంచి లేస్తూ …”

మేఘుడు కూడా ఫేటేల్మని నవ్వేడు. గాలి మరింత ఉధృతంగా నవ్వింది. నందివర్ధనం ఆకులు రాలిపోయెంతగా నవ్వింది.

“నిన్నూ, నిన్నూ,….” మా ఆవిడ నన్ను అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. నెమ్మదిగా నడక పరుగుగా మారి, ఊయల చుట్టూ అందకుండా తిరుగుతూ నేను, నన్ను అందుకోవాలని తనూ.

“టప్”, వరుణుడు భుజం తడుతున్నట్టుగా  మొదటి చినుకు.

“హేయ్, వర్షం ” అంటూ మా ఆవిడ ఇంట్లోకి పరిగెడుతూ వుంటె, వెనకాలే నేనూ …” ఇంట్లోకి చేరే సరికి పూర్తిగా తడిసిపోయి,

తడిసిన తనువులతో, మురిసిన మనసులతో

అది

వర్షం కురిసిన రాత్రి, అమృతం విరిసిన రాత్రి.

*  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *

పొద్దున్నే మా ఆవిడ కన్న ముందే నిద్ర లేచి, తనని నిద్ర లేపుతూ అడిగాను. “నాకు పొద్దున్నే చెబుతా అన్నావు కదా, ఇప్పుడు చెప్పు మరి” అని

“ఏదీ” అని ప్రశాంతంగా అడిగింది తను.

“అదే, ఇంగ్లీష్ లో ఒక చిన్న వాక్యం,  మూడే మూడు పదాలు వుంటాయి. మొదటి పదంలోనేమో ఒక్క అక్షరమే, రెండో పదంలో నాలుగక్షరాలు, చివరి పదంలో మూడే అక్షరాలు..” గడ గడ గా చెబుతూ గుర్తు చేసాను నేను.

“నిజంగా చెప్పాలా? ” గోముగా అడిగింది.

తప్పదు మరి, అన్నాను నేను వినడానికి సిద్దంగా.

“సరె” అని తను కళ్ళు మూసుకొని చెప్పసాగింది ” I …”

నేను ఓళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నాను

“I…” మళ్ళీ అంది

ఆనందంతో నా గుండె వేగం పెరిగింది.

“I…” మళ్ళీ అంది.

ఈసారి గుండె వేగం రెట్టింపు అయింది.

“I Want Tea” అని “ఒక చిన్న వాక్యం,  మూడే మూడు పదాలు వుంటాయి. మొదటి పదంలోనేమో ఒక్క అక్షరమే, రెండో పదంలో నాలుగక్షరాలు, చివరి పదంలో మూడే అక్షరాలు  వున్నాయో లేదో కావాలంటే చూసుకో” అనేసి మళ్ళీ ముసుగు తన్నేసింది.

నా పరిస్థితి, ఇంకెందుకులెండి చెప్పడం!..

మా ఆవిడ ఇంతే, మరి మీ ఆవిడ…?  [పక్కనే వున్న లింక్ ను క్లిక్ చేయండి. నా తొలి కథను చదవండి.]


%d bloggers like this: