అంజి, నేను at అమ్ స్టర్ డాం

జనవరి 30, 2008

     గతంలో నేను ఉద్యోగం వెలగబెట్టిన ఒకానొక సంస్థ లో నిప్పు అప్పలసామిలాంటి మా ప్రాజెక్టు మేనేజర్ నుండి తప్పించుకునే ప్రయత్నంలో నేను కూడా ప్రాజెక్ట్ మేనేజర్ అవడంతో నా పరిస్థితి తంతే గారెల బుట్టలో పడ్డట్టు గా కనిపించినా, నేను పడింది పాముల పుట్టలో అని నాకు తొందరగానే అర్థమైంది. క్లైంట్ దగ్గర నుంది షెల్లింగ్ తప్ప బిల్లింగ్ రాని ప్రాజెక్టుకు నన్ను తగిలించారు. ఎటుతిరిగీ పడింది పాముల పుట్టలోనే కదా అని కత్తి కాంతారావ్ లా కదుల్తూ, నా పద్దతిలో నాద స్వరం ఊదే సరికి పుట్టలో నాగ జాతి మాయమై నా జాతి తయారైంది. నా లెక్క బాగుందో, మా కంపనీ లక్కు బాగుందో తెలీదు గానీ మొత్తానికి ప్రాజెక్ట్ మేనేజరుగా నేను ప్రవేశపెట్టిన విధానాలు సత్ఫలితాలు ఇవ్వడంతో, నా పాముల పుట్ట ప్రాజెక్టు కాస్త కాసుల గుట్టయై కూర్చుంది.

    టీవీలో సీరియళ్ళు రాని సాయంత్రంలా జీవితం ప్రశాంతంగా గడచిపొతుండగా, ఓరోజు నాకు మా “చెడ్డాయన” అంటే మా బాసు దగ్గరనుండి పిలుపు వచ్చింది. “చెడ్డాయన” అంటే చెడ్డవాడేం కాదు లెండి. ఆయన తరచుగా ఒక చెడ్డీ వేసుకొని ఆఫీసుకొచ్చేవాడు. అందుకని అలా నామకరణం జరిగిందాయనకు. (ఆయన వేసుకునే చెడ్డీని ఆంగ్లములో షార్ట్ అని అంటారు) ఏవిటో సంగతీ, నా ప్రాజెక్టు గురించి పిర్యాదులు గానీ ఏవీ లేవు కద అని మరోసారి మెయిల్స్ అన్నీ చూసుకుని ఎందుకైనా మంచిదని నా రాజీనామా లేఖను కూడా తయారు చేసి జేబులో పెట్టుకొని చెడ్డాయన గదికి దగ్గరికి బయలుదేరాను. హఠాత్తుగా ఇలాంటి పిలుపులు వచ్చినప్పుడు మనల్ని తీసేయడం తో సహా ఏదైనా జరగొచ్చు కనక, అలాంటి పరిస్థితి వస్తే “నన్ను మీరు తీసేసేదేవిటి, నేనే రిజైన్ చేస్తున్నాను” అని సినిమాల్లో మాదిరి రాజీనామా వాళ్ళ ముఖాన పడేసి రావచ్చు అన్న ముందు జాగర్తతో రెజిగ్నేషన్ లెటర్ జేబులో వేసుకొని చెడ్డాయన గది తలుపు తట్టాను. చెడ్డాయన విశాలంగా నవ్వుతూ ఆహ్వానించాడు.

     “మన యూరోపియన్ క్లైంట్స్ దగ్గరనుండి మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ తాలూకూ వ్యాపార వ్యవహారాలు గురించి చర్చించడానికి నువ్వు యూరోప్ కు వెళ్ళాలి. నువ్వు కొత్తరకం కథలన్నీ చెప్పి మనకు కావలసిన విధంగా సాధించుకొస్తావ్” అన్నాడు.

     నన్ను తిడుతున్నాడో, పొగడ్తున్నాడో తెలీక నేను అయోమయంగా చూస్తుంటే “ఐ నో వాట్ యు అర్. అన్నట్టు మనం బిల్లింగ్ రేట్స్ కూడ పెంచుతున్నాము. ఇప్పుడు మన కంపనీ సిక్స్ సిగ్మా సర్టిఫైడ్ కదా. మన క్వాలిటీ స్టాండర్డ్స్ గురించి, బిల్లింగ్ హైక్ జస్టిఫికేషన్ గురించీ వాళ్ళకు సరిగ్గా కమ్యునికేట్ చెయ్యాలి” అన్నాడు.

   యూరోపియన్ దేశాలు ISO ను గుర్తించినట్టుగా CMMi ను గానీ, సిక్స్ సిగ్మాను కానీ పట్టించుకోవు. పైగా బిల్లింగ్ రేట్లు పెంచినప్పుడు క్లయింట్లు తమ తమ బడ్జెట్ కు అనుగుణంగా కొందరిని ప్రాజెక్టులనుండి తొలగించడం కూడా జరుగుతుంది. అలా జరిగితే, దానికి నన్ను బాధ్యున్ని చేసి నాకు ఉద్వాసన పలకొచ్చు. ప్రాజెక్టు మేనేజరుగా వుంటూ అలాంటి బాధ్యత తలకెత్తుకోవడం ఆత్మహత్యా సదృశ్యమే కనుక ఇదంతా నన్ను తీసేయడానికి మొదలెట్టిన ఆటలా అనిపించి (కార్పోరేట్ ప్రపంచంలో ఇలాంటి ఎత్తులన్నీ మామూలే మరి) నా చొక్కా జేబులోంచి రాజీనామా లేఖను తీయబోతుండగా, మా చెడ్డాయన అన్నాడు.

   “నీకొక గుడ్ న్యూస్, ఈ కొత్త బాధ్యతలను సరిగా చేయగలవని నమ్మకం తో నిన్ను ప్రమోట్ చేస్తున్నాను. ఇది నీ రివైజ్డ్ పే స్ట్రక్చర్” అని తన లాప్‌టాప్‌ను నా వంక తిప్పి “కంగ్రాట్చ్యులేషన్స్” అంటూ చేయి చాచాడు. నా రాజీనామ లేఖను జేబులోకి తోసేసి అప్యాయంగా చెడ్డాయన చేయందుకున్నాను. నాకు 40% ఇంక్రిమెంటు ఇంకా ఇతర సదుపాయాలను కల్పిస్తున్నట్టు లాప్‌టాప్‌పై అక్షరాలు మెరుస్తున్నాయి.

   “బిల్లింగ్ నెగోషియేషన్స్ గురించి సీనియర్ సేల్సు మేనేజర్ కొన్ని వివరాలు ఇస్తాడు. నీకు అవసరం అనుకుంటే నువ్వు ఇంకా ఎవరినైనా నీతో పాటు యూరోప్ తీసుకెళ్ళు. యు విల్ ఆపరేట్ ఫ్రం నెదర్లాండ్స్ ఆఫీస్ ఫర్ నెక్స్ట్ టూ మంత్స్.” అంటూ ముగించాడు.

  వారం రోజుల్లో వీసాతో సహా అన్నీ సిద్ధం. నాతో పాటు అంజి గాడు కూడా. ఇండియాలో బయలుదేరడానికి ముందే, కంపనీ తరపున నెదర్లాండ్స్ లో హోటల్ గది బుకింగ్స్ అవీ జరిగిపోయాయి. మాకు బుక్ చేసిన హోటల్ తాలూకు వెబ్ సైట్ లో ఏర్‌పోర్టు దగ్గర పికప్ చేసుకోవడానికి టాక్సీగా రకరకాల కార్ల నుండి ఎంపిక చేసుకునే సదుపాయం వుంది. నాకు పెద్దగా కారుపై మోజు లేకపోవడంతో “Any thing will do” అని ఎంచుకున్నాను. అంజిగాడు మాత్రం “Benz car only” అని క్లిక్ చేసి మురిసిపొయాడు. ఆ తర్వాత నాకు కూడా కొంచం ఈర్ష్యగా అనిపించింది. నా కారును మార్చుకోవడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు.

   అంజికి అదే మొదటి విమాన ప్రయాణం అవడంతో వాడు చాలా ఎక్సైటింగ్ గా వున్నాడు. విమానం లోకి ప్రవేశించగానే చుట్టూ చూస్తూ, “మస్తుంది మామా. లోపల మరీ ఇంత పెద్దగా వుంటుందనుకోలేదు. ఏమైనా కనిపెట్టినవాడు గ్రేటు..” అంటూ కామెంట్లు మొదలెట్టాడు. నేను పెద్దగా పట్టించుకోకుండా నా పుస్తక పఠనం లో మునిగిపోయాను. ఎంత దూర ప్రయాణం అయినా సరే, నేను ఒకటి రెండు గంటలకన్నా ఎక్కువ నిద్ర పోకుండా ఏదో ఒక పుస్తకాం కొనేసి జర్నీ అయిపోయేలోగా దాన్ని చదివేస్తాను. నేను వాడి కామెంట్లు పట్టించుకోకపోవడం చూసి, నా దగ్గర వున్న పుస్తకం లాక్కొని “Six Thinking Hats” అని పుస్తకం పేరును పైకే చదివి కాసేపు అటూ ఇటూ తిరగేసాడు. “ఎక్కడ దొరుకుతాయి మామా నీకు, అన్నీ ఇలాంటి పుస్తకాలు?” అని అడిగాడు. నేను నవ్వేసి ఊరుకున్నాను. విమానం టేకాఫ్ అయిన తర్వాత విమానంలో ఆ చివరనుండీ, ఈ చివర వరకూ టాయ్‌లెట్ కోసం ఒకసారి తిరిగి, పని పూర్తి చేసుకుని వచ్చి నా పక్కన కూర్చొని నా పుస్తకాన్ని చూపిస్తూ, సిక్స్ థింకింగ్ హాట్స్ టైపులో ఆలొచిస్తే, “ఈ విమానాల్ని మన అర్.టీ.సీ వాడు నడపకపోవడం మన అదృష్టం రా” అన్నాడు.

“ఏం? ఎందుకని అదృష్ఠం?” అన్నాను నేను పుస్తకాన్ని మూసేస్తూ.

ఒకటి కాదు, రెండు కారణాలు వున్నాయి. నంబర్ వన్, ఆర్టీసీ బస్సులపై “బస్సు చక్రం ప్రజా ప్రగతికి చిహ్నం ” అని రాసినట్టుగా విమానాలకు కూడా “విమానం రెక్క, ప్రగతికి మొక్క” అనో “విమానం తోక, ప్రగతికి బాకా” అనో రాయించేవారు. నంబర్ టూ అండ్ మోస్ట్ ఇంపార్టెంటు, మన ఆర్టీసీ లో 33% మహిళలకు రిజర్వు చేస్తారు కదా, ఫ్లైట్లలో కూడా అలాగే చేసేవారు. ఇప్పుడీ విమానంలో పది టాయ్‌లెట్లు వున్నాయి కదా, మూడింటికి పసుపు పచ్చ రంగు పూసి, “స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం, వారికి కేటాయించిన దొడ్లలోవారినే కూర్చోనిద్దాం” అని కూడా రాయించేవాళ్ళు. “కడుపు నొప్పితో చచ్చిపోయి వుండేవాన్ని…” అని వాడు రిలాక్సింగా పొట్ట నిమురుకుంటూ అంటూ వుంటే నాకు ఏమనాలో తోచలేదు.

   నెదర్లాండ్స్ రాజధాని అమ్-స్టర్-డాం లో దిగి బాగేజ్ తీసుకుని బయటకు రాగానే హోటల్ వాళ్ళు ఏర్పాటు చేసిన టాక్సీ డ్రైవర్లు ప్లకార్డులతో ఎదురయ్యారు. కాస్త బయటకు నడిచిన తర్వాత పార్కింగ్లో మా కోసం నిలబడిన టాక్సీలు చూసాకా అంజి గాడు మొహం వేలాడేసుకుని, కిమ్మనకుండా నాతో పాటు నా టాక్సీ (వోక్స్ వాగన్) లో కూర్చొన్నాడు. ఏందుకంటారా? వాడి కోసం హోటల్ వాళ్ళు పంపింది బెంజ్ కారే కానీ చాలా పాతది. అయితే ఏవంటి అంటారా? అది అచ్చు మన అంబాసిడర్ కారులా వుంది మరి. కావాలంటే ఆ కారును ఇక్కడ చూడండి.

అమ్ స్టర్ డాం అంబాసిడరు

అమ్ స్టర్ డాం అంబాసిడరు
అదీ సంగతి. మరిన్ని విశేషాలు వీలుచూసుకొని ప్రచురిస్తాను.

ప్రసాదం.

*******************

గతంలో పొద్దు వెబ్‌జైన్లో ఇక్కడ ప్రచురించబడింది. పొద్దు పెద్దలకు కృతజ్ఞతలతో

ప్రకటనలు

%d bloggers like this: