అన్నీ వేదాల్లోనే వున్నాయిష….

డిసెంబర్ 27, 2010

ఆ దేశమూ ఈ దేశమూ  తిరుగుతూ పుట్టిన దేశాన్ని తిరక్కపోతే బావుండదని బుద్ది పుట్టి, ఓ ఆరు నెలల క్రితం ముంబై లో దిగీ దిగగానే పోలోమంటూ బోలెడు చోట్లకు బయలుదేరాను. వెళ్లేప్పుడు తోడుగా బోలెడు పాటల్ని తీసుకెళ్ళేను కదా,  అలాగే వచ్చేప్పుడు బోలెడు జ్ఞాపకాలు తోడు తెచ్చుకోవచ్చని, భుజాన ఓ కెమెరా తగిలించుకుని మరీ కారెక్కాను. సెల్ ఫోన్ లో కెమెరా ఎంచేతో నాకు అస్సలు నచ్చని విషయం అనుకోండి. నా ప్రయాణంలో పదనిసలు కొన్ని, జ్ఞాపకాల గమకాలు కాసిన్ని ఇక్కడ గుది గుచ్చేను.

ముసురుపట్టిన ముంబై నుండి  బయట పడి అరవై కిలోమీటర్లు అలా అడవిలోకి వెళ్ళి, “దేశమెంత మధురం, పరదేశమంత కఠినం … ” అని అనుకుంటుండగానే మేఘపు షాలువా కప్పుకున్న ప్రకృతి ఇదిగో, ఇలా స్వాగతం చెప్పింది.

 ప్రసాదం


చెప్పొద్దూ, ఎప్పుడో విన్న పాట అలలు అలలుగా గుర్తొచ్చేసింది.

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ,
ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను చేరెదను,…”


అలా ఇంకాస్త ముందుకెళ్ళగానే వలపు గాలి తమకం తో చుట్టేసినట్టు ఇదిగో ప్రకృతి ఇలా అల్లుకుపోయి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటే,  ఏమని చెప్పను, ఎలా చెప్పను? 
 

ప్రసాదం
 

ప్రకృతి కాంత ను పరవశించి చూస్తూ పొలము పుట్రా వెంట  కారు పరిగెత్తిస్తుండగా.. హఠాత్తుగా నేను దారి తప్పేనేమోనని అనుమానం వచ్చింది. ఎవరినైనా అడుగుదాము అని కారు అలా కాస్త నెమ్మదిగా పోనిస్తుండగా, అదృష్ఠం బావుండి పశువులు కాసుకునే కుర్రాడొకడు ఓ కొమ్ములు తిరిగిన గేదె పై కూర్చొని, “నీది కారు అయితే నాది రోల్స్ రాయిసు …” అనేంత దర్పంతో  ఎదురొచ్చాడు. నేను కారు దిగి వచ్చీ రాని మరాఠి లో కొంత, హిందీ లో మరి కొంత కష్ఠ పడి అడిగితే, నాకు సరిన దారి చూపించాడు; గేదె దిగకుండానే లెండి. 

హమ్మయ్య , దారి తెలిసింది అన్న ఉత్సాహంతో  కారు స్టార్టు చేస్తూ   అలవాట్లో పొరపాటుగా నేను “థాంక్యూ ” అన్నాను.  

“వెరీమచ్ ” అంతే వేగంగా ఆ కుర్రాడు నాకు సమాధానం చెప్పేడు. “నాక్కూడా వచ్చు లేవో ఆ మాత్రం ఇంగ్లీష్ … ” అన్నట్టున్నాయి అతని కళ్ళు.

ప్రసాదం

 

అలా నవ్వుల ఆటలతో , ఆటల పాటలతో, పెదాల అంచున పదాలు పాడుతూ, మంచు తెరల చాటుగా,  గాలి మరల  మీదుగా ప్రయాణించి ఆ రాత్రికి గమ్యం చేరుకున్నాను. చాలా కాలం తర్వాత కలుసుకుంటున్న ఆనందం కాబోలు,ఇన్ని వందల మైళ్ళు ప్రయాణించినా కాస్త అలసట కూడా లేదు.

అక్కడక్కడా విసిరేసినట్టున్న ఇళ్ళు. అంతా కలిపి ఓ రెండు వందలు వుంటాయేమో. 

కరంటు పోయి  చాలా సేపు అయినట్టుంది. కప్పల బెక బెకలు, కీచురాళ్ళ రొద;

నా చుట్టూ మాత్రం జ్ఞాపకాల పయ్యెద.


పొరలు పొరలుగా విప్పుకునే నా జ్ఞాపకాల అరలు,
తెరలు తెరలుగా కమ్ముకునే జీవితాల సరాగాలు,


మధ్య మధ్యలో జంతికల జావళీలు, కూడా మమకారపు కారప్పూస,
ఓ చేత చేగోడీలు, ప్లేటు నిండా పకోడీలు, ఆపై వేడి వేడి టీలు.


వదిలిపోకుండా నేనూ వున్నాను అని అప్పుడప్పుడూ త్వరపడే వరుణుడి అడుగుల సవ్వడి;
-జల్లు జల్లు మంటూ 


నిదురపోకుండా నేనూ వింటున్నాను అని ఎప్పటికప్పుడు తడబడే, వయసు పైబడిన స్వర సడి;
-ఖళ్ళు ఖళ్ళు మంటూ


పక్క గదిలోకి వెళ్ళి అడిగాను.


“తాతగారూ ఎలా వున్నారు”? 

“బానే వున్నాను కానీ, ….” కాస్త ఆగి శ్వాస తీసుకొని “వయసైపోతుంది కదరా.., ఎనభయ్ దాటలేదూ,నీ కబుర్లు వింటున్నాను… చాలా పెద్దాడివయ్యావ్”  


ఒకప్పుడు వేదం పలికిన దేహం

ఇప్పుడు నిర్వేదం తొణికే దేహం


పెళ్ళి చేసుకుంటావా తాతా అంటే నాకు పిల్లనెవరిస్తార్రా అని అనటం మామూలే కదా, అలా  కాసేపు ఉత్సాహాం పోగేద్దామని తాతకి కబుర్లు చెప్పడం మొదలెట్టాను.  
ఏదో వర్షం పడుతోందని ఇలా పడుకున్నావు కానీ, అసలు వయసైపోయినట్టు కనిపిస్తున్నావా తాతా? నేనుండే దేశంలో, నీకులా ఉత్సాహంగా వుండే వాళ్ళంటే  పడి చస్తారు తెలుసా. అందాకా ఎందుకు; నువ్వు అనుకోవాలే గానీ పడుచు పిల్లలు మీ వెంట తిరగరూ…


ఆ,.. ఆ.. వయసైపోయినవాన్ని, పడుచు పిల్లల గొడవ నాకెందుకుగానీ  ఒరే అబ్బీ, వూరంతా పడవల్లో లాహిరి లాహిరి అంటూ తిరగొచ్చన్నావ్, హిమపాతాలన్నావ్, సుందరాంగులు, స్వేచ్చాప్రణయాలు, సంపదలు  అన్నీ అంటున్నావ్, ఇలాంటి లక్షణాలతో వుండే వూరు గురించి మా కాలంలో పురాణాల ఆచార్యులు చెప్పేవారు. వూరు పేరేమిటన్నావ్.. మళ్ళీ చెప్పు.”  అన్నాడు శ్వాస  ఎగపీలుస్తూ

అమ్‌స్టర్‌డామ్ తాతయ్య.” చాతీ పై నిమురుతూ చెప్పాను

అంతో ఇంతో వేదాధ్యయనం చేసిన వాడివి, నీకూ ఉచ్చారణా దోషాలేమిట్రా? ఆచార్యులవారిలా స్వచ్చంగా అమరేశ్వరధామం  అన్లేవూ.  నోరు తిరగని మ్లేచ్చవెధవలు  అమ్‌స్టర్‌డామ్ అంటే నువ్వు అలాగేనా అనడం. …… ¤§£..=#/..æm?€^~ “

తాతయ్య ఎడా పెడా వాయించేస్తున్నాడు. అన్నీ వేదాల్లోనే వున్నాయిష… అని గిరీశం చెప్పింది నిజమేకాబోలు. 


….ఏమని చెప్పేది తాతయ్యకి

==================================================

కొన్నాళ్ళ (కొన్నేళ్ళ అనాలేమో ) క్రితం రాసిన  అమ్‌స్టర్‌డామ్ విశేషాలు ఇక్కడ   చదవండి

ప్రకటనలు

అందమైన లోకమనీ “అమ్‌స్టర్‌డామ్‌” లా వుంటుందనీ….-2

మార్చి 19, 2008పలు కాలువలతో నిర్మితమైన ఈ పట్టణం సముద్ర మట్టానికి కనీసం 4 మీటర్ల దిగువన వుంది. సముద్రంలోని నీరు కాలువల ద్వారా వెనక్కు వచ్చి నగరాన్ని ముంచేయకుండా వుండటానికి గాను, ఆనుక్షణమూ నీటిని తోడిపారబోయడానికి వీరు డైక్ అనబడే అనకట్టలను నిర్మించుకున్నారు.  ప్రకృతినే ఎదురొడ్డి నిలిచిన వీరి నీటిపారుదల సాంకేతిక పరిజ్ఞానమును భారత్ తో సహా ప్రపంచ దేశాలన్నీ వినియోగించుకుంటాయి. విలాస జీవితం గడపటానికి ఇష్టపడే వీరి జీవన విధానం చాలా ఆసక్తికరంగా వుంటుంది. సూర్యోదయ సమయంతో నిమిత్తం లేకుండా ఎక్కువ మంది ఉదయం నాలుగు గంటలకే మేల్కొంటారు. వ్యాపార సంస్థలు మినహాయించి పాఠశాలలు , కళాశాలలు వంటివన్నీ ఉదయం ఏడు గంటలకే ప్రారంభం. అలాగే మద్యాహ్నం గరిష్టంగా 1500 గంటలకల్లా అందరూ తట్టా, బుట్టా సర్దేస్తారు. వ్యాపార సంస్థలు, కార్యాలయాలు  కూడా సాయంత్రం 1800 కల్లా ముసుగు తన్నేయాల్సిందే. సాయంత్రం 1900 గంటలలోపు రాత్రి బోజనం కూడా అయిపోతుంది. ఆ తర్వాత అలా టీవీ ముందు కాళ్ళు చాపుకొని కూర్చొని బీరు గానీ వైను గానీ చప్పరిస్తూ సరదాగా కబుర్లతో గడిపేస్తారు.


లాహిరి, లాహిరి , లాహిరి లో...


ఇక పోతే, పని గంటల విషయం లో కూడా మరీ ఖండితంగా వుంటారు.రోజుకు 9 గంటల చొప్పున వారానికి 36 గంటలు (అంటే వారానికి నాలుగు రోజులే) పనిచేయాలి. ఆపైన పని చేసిన ప్రతీ నిమిషం ఓవర్‌టైము కిందే లెక్క. సాదారణంగా సోమ, మంగళవారం పనిచేసి మళ్ళీ బుధవారం సెలవుతీసుకుంటారు. మళ్ళీ గురు, శుక్ర వారాలు కాస్త వొళ్ళొంచితే ఇక వారాంతమే. ఎక్కువ మంది శుక్రవారం సాయంత్రమే వారాంతం గడపడానికి తమకు నచ్చిన చోటుకు వెళ్ళిపోతారు.


చౌకధరల షాపులు, చక్కనైన షోకులు..


ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటైన నెదర్లాండ్స్ లో ఆయుధ సంస్కృతి పెద్దగా లేదు. ఎవరైనా సరే, ఎంత అర్ధరాత్రి వేళయినా నిర్భయంగా కావలసినచోటుకు వెళ్ళొచ్చు. అన్నట్టు ఇక్కడ దాదాపు అన్ని రకాల మాదకద్రవ్యాలు కూడా స్వేచ్చగా షాపుల్లో అమ్ముతారు. వ్యభిచారం కూడా చట్టబద్దమైన గౌరవనీయమైన వ్యాపారమే. చాలా దేశాల్లో వ్యభిచారం పొట్టకూటికోసం జరిగితే, ఇక్కడ మాత్రం మరింత విలాసవంతమైన జీవితం కోసం, థ్రిల్ కోసం, సరదా కోసం జరుగుతుంది.


గారడీ వీరులూ ఇక్కడా వుంటారు మరి!


ఇక్కడి విలాసవంతమైన జీవితానికి నిదర్శనమా అన్నట్టు, చాల మంది స్థానికులు ఏవైనా కొత్త వస్తువులు కొనగానే, తమ పాత వస్తువులను ఇంటి ముందు వదిలేస్తారు. అలా వదిలేసిన వస్తువులలో పూర్తి స్థాయిలో  పని చేసే పెంటియం లాప్‌టాపులు, ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్లూ, మైక్రోవేవ్ ఓవెన్లతో పాటు మంచి ఫర్నీచర్లు ఇంకా మరెన్నో గృహోపయోగమైన వస్తువులూ వుంటాయి.  ఉదయమే వచ్చే మున్సిపాలిటీ (ఇక్కడ ఏవంటారో మరి) వాన్ లో ఈ వస్తువులన్నీ క్రష్ అవుతుంటాయి.


రిక్షావాలా ధూమ్ ధామ్


సహజవనరులు అతి తక్కువగా వున్నా, ప్రగతిపథంలో మాత్రం ముందుకు దూసుకుపోయే ఈ దేశంలో ఆదాయం పన్ను కూడా చాలా ఎక్కువే. ఎలాంటి మినహాయింపులూ లేకుండా అందరూ తమ ఆదాయంలో 33.60% నుండి 52% వరకూ  వివిధ శ్లాబులలో అదాయం పన్నుగా కట్టాల్సిందే. అయితే ప్రభుత్వం కల్పించే సదుపాయాలు కూడా అందుకు ధీటుగా వుంటాయి. ఉదాహరణకు, నిరుద్యోగ భృతి సంగతే తీసుకోండి. ఏ కారణం వల్లనైనా, ఉద్యోగం కోల్పోయి నిరుద్యోగులైతే కోల్పోయిన ఉద్యోగం ద్వారా లభించే ఆదాయంలో  75% నిరుద్యోగ భృతిగా (గరిష్ఠంగా రోజుకు 177 యురోలు) లభిస్తుంది. [ ఒక వ్యక్తికి సరిపడే ఆహారం ఖర్చు నెలకు గరిష్టంగా 300-500 యూరోలు]


అదాయం  పన్ను ��వనం, అంతా తెరిచిన పుస్తకం


అమ్‌స్టర్‌డామ్‌ లోని ప్రజలు తమ మాతృభాష డచ్ కు ఇచ్చే ప్రాధాన్యం కూడా అనన్యమైనది. దాదాపు ప్రతీ ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడగలిగి వుండి యాత్రికులుగా వచ్చిన వారికి సాద్యమైనంతగా సహాయం చేస్తారు. కానీ, వుద్యోగరీత్యా,వ్యాపార రీత్యా ఇంకా చదువురీత్యా, మరే ఇతర అవసరం రీత్యా అక్కడ నివసించే విదేశీయులు మాత్రం డచ్ భాష నేర్చుకోవలసిందే. డచ్ భాష ను ఉచితంగా నేర్పే శిక్షణా సంస్థలు కూడా వున్నాయి. ఒకటి రెండు సంవత్సరాలకు పైగా నివసించే వారికి తప్పని సరిగా డచ్ మాట్లాడటం వచ్చి వుండాలి లేకపొతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక  తప్పదు. ఉదాహరణకు, విమానాశ్రయంలో పాస్‌పొర్ట్, వర్క్ పర్మిట్ పరిశీలించేటప్పుడు  అక్కడి అధికారి మీరు అక్కడ చాలా కాలంగా వుంటున్నట్టు గమనిస్తే మీతో డచ్ భాషలోనే మాట్లాడతాడు. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడటానికి ప్రయత్నిస్తే కుదరదు. అన్ని రోజులు నెదర్లాండ్స్ లో వున్నప్పటికీ ఎందుకు డచ్ భాష నేర్చుకోలేదనే ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం డచ్ భాష నేర్చుకోని కారణంగా కోరిన సహాయం (తాత్కాలికంగా) నిరాకరించిన సందర్భాలు కూడా వున్నాయి. మన తెలుగు భాషా సంఘం వాళ్ళు ఇక్కడకొచ్చి భాషాభిమానం అంటే ఏవిటో నేర్చుకోవాలి అని నాకు ఎన్నిసార్లు అనిపించిందో.మరిన్ని ఇతర విశేషాలు తరువాయి భాగాలలో చదవండి.%d bloggers like this: