ఎదుట నిలిచింది చూడు, కల “కారు” వన్నెలేవో..

జూన్ 29, 2013

ఆక్సిడెంటు మూలాన కారు లేకుండా పోవడంతో, మరో కొత్త కారు కొనే ప్రయత్నాల్లో వున్నాను. కారు భీమా డబ్బు వ్యవహారం ఇంకా తేలలేదు. ఎలాగూ మరో కారు కొనాల్సిందే కదా అని నా అవసరాలకి సరిపోయే గుణగణాలున్న ‘కారా’న్వేషణ (వరాన్వేషణ లాగా అన్న మాట. ఈ పదం నేనే కనిపెట్టాను అంచేత కాపీరైటు నాదే మరి హి,హి,హి :-D) మొదలెట్టి ఒక రోజైనా గడవవకుండానే, మా పెద్దాయన ఫోనెత్తి పిలిచాడు. మా పెద్దాయన కథ టూకీగా ఇక్కడుంది. విషయమేమంటే, మా కంపనీ చాలా కాలం పాటు చేసిన కృషి, ప్రయత్నాల మూలంగా పురిటినొప్పులు పడుతున్న ఓ కొత్త ఖాతా వ్యవహారంలో, ప్రసవానికి ముందు తలెత్తిన కాసిన్ని ఇబ్బందులని పరీక్షించి సరిచేయాల్సిన అవసరం వచ్చింది. అందువల్ల ఆగ మేఘాల మీద (అవును మేఘాల మీదే మరి) నేను అక్కడికి ప్రయాణం కట్టాల్సిందేనని మా పెద్దాయన హుకుం జారీ చేసాడు. Annual Appraisal ఫలితాలు ప్రకటించే నెలల్లో నేను మా పెద్దాయనకు ఎదురు చెప్పను. మీరు కూడా అంతే అని నాకు తెలుసు. నాకున్న ఈ బలహీనత కనిపెట్టి మా పెద్దాయన ప్రతీ మూడు నెలలకీ ఓ సారి Appraisal అంటున్నాడు.

అక్కడికి చేరుకున్న మొదటి రెండు రోజుల్లో జెట్‌లాగ్ తో ఒక రోజు, జుట్టు లాక్కోవడం వల్ల మరో రోజు, రెండూ రెండు క్షణాల్లా గడిచిపోయాయి. మూడో రోజు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చి కారు కూతలు, బీరు మూతలు సద్దుమణిగాక మళ్ళీ నా కారాన్వేషణ గుర్తొచ్చింది.

నేను సెడాన్ టైపు కార్లని వుపయోగించడానికి ఇష్టపడతాను. మరో రకంగా చెప్పాలంటే, దేశీయ రోడ్లపై తిరుగాడే బుజ్జి కార్లని (హాచ్-బాక్ అని అంటారు) నేను కార్ల కింద లెక్కించను. అవి నా కళ్ళకి మేకప్పు వేసిన ఆటో రిక్షాల్లా అనిపిస్తాయి. భద్రతా పరంగా కూడా ఆధార పడదగిన వాహనాలు కావు అని నా భావన. నా స్నేహితుల్లో కొందరు హాచ్-బాక్ బావుంటుందని ఆ రాత్రి కారు కూతలు కూసేరు. ఈ నానా కూతల మధ్య నే కోరుకునే గుణగణాలన్నీ ఏ కారులో వున్నాయా అని కాసేపు మల్లగుల్లాలు పడి, ఏ విషయము నిర్ధారణ అవకుండానే అవే అలోచనలతో నిద్రలోకి జారుకున్నాను.

ఉదయాన్నే కులకూజితాల కువ కువ రాగాలని వెంటబెట్టుకొని, భానుడు సుప్రభాతం పాడి నిదుర లేపాడు. నిద్ర లేవగానే నాల్గవ అంతస్తులో వున్న నా పడక గది కిటికీలొంచి కనిపించిన దృశ్యం చూసి నాకు మతిపోయింది. మీ అందరి మతికూడా పోగొడదామని, ఆ దృశ్య్యాన్ని కెమెరాతో బంధించి ఈ కింద జత చేసాను. అంత పెద్ద వృక్షాన్నీ ఎవరో శ్రద్దగా కత్తిరించినట్టు, అచ్చు Sedan కారు లాగ. మీకేం కనిపిస్తోంది, Sedan or Hatchback?

ప్రసాదం : కలల కారు ప్రకృతి సాక్షిగా

అన్నట్టు ఆ వృక్షాన్ని నా గదిలోంచి తప్ప, ఇంకే కోణంలో చూసినా ఇలా కారు ఆకారంలో కనిపించడం లేదు. ప్రకృతి ప్రతిస్పందన అంటే ఇలాగే వుంటుందేమో?

ఇట్లు
మీ ప్రసాదం.

ప్రకటనలు

%d bloggers like this: