కొత్త కొలువులో చిన్నది, “కొత్తిమీర” నే విన్నది….

ఫిబ్రవరి 7, 2008

చాలా సంవత్సరాల క్రితం, వివాహత్పూర్వ జీవితాన్ని ఆనందిస్తున్నప్పటి  సంగతి. ఆనందించడమేవిటి నా మొహం, వివాహానికి ముందు మొగాళ్ళ జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. పెళ్ళైన మొగాళ్ళందరూ (వాళ్ళ వాళ్ళ భార్యలకు తెలియకుండా) ఈ విషయంలో నాతోనే ఉంటారని ఎక్కడ కావాలంటే అక్కడ రాసిస్తాను. అలాంటి బంగారపు రోజుల్లో ఒకానొకరోజు ప్రతిష్ఠాత్మకమైన మల్టీ నేషనల్ కంపనీలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని  ఉద్యోగంలో చేరడానికి వెళ్ళాను.  నాతో పాటు దాదాపు మరో ముప్ఫై మంది అబ్బాయిలకూ, ఇరవై మంది అమ్మయిలకూ కంపనీ లో అదే మొదటి రోజు. వస్త్రధారణ కు సంబంధించి సంస్థకు నియమావళి ఏమీ లేకపోవడంతో (వస్త్రాలు ధరించడం మాత్రం తప్పనిసరి అనుకోండి) ఒక్క ఉదుటున ఇంద్రధనస్సు రంగులన్నీ కంపనీలోకి కదలి వచ్చినట్టు అనిపించింది. నేను అంతకు ముందు పని చేసిన కంపనీలో తలమాసినా పర్లేదు గానీ, షూ పాలిష్ మాత్రం మాయకూడదు అనే దిక్కు మాలిన రూల్ ఒకటి ఉండటంతో, దానికి దానికి తగిన వేషం వేసుకోవడం నాకూ, నా లాంటి వేషగాళ్ళను చూడడం నా  కళ్ళకూ అలవాటైపోయింది. ఒక్కసారి అన్ని రంగులను చూసే సరికి నాకు కంపనీలో కాకుండా ఏదో టైం మెషీన్లో కాలేజీ రోజులకు వెళ్ళిపోయిన ఫీలింగ్. అన్ని అందమైన రంగుల్లో నాదొక్కటే బ్లాక్ అండ్ వైట్ వేషం. తెల్ల చొక్కా – నల్ల పాంటు; నాకు చాలా ఇష్టమైన డ్రెస్.

ఇండక్షన్ ప్రోగ్రాం అనే పేరు కింద మమ్మల్నందరినీ ఒక హాల్లోకి తోసారు. టక్కు టక్కు మంటూ ఓ టెక్కులాడి మా హాల్లోకి వచ్చింది. “హల్లో ఎవ్విరిబడీ, ఐయాం ప్రం ద కంపనీ హెచ్ఆర్ డిపార్టుమెంట్. ఐ విల్ కోఆర్డినేట్ దిస్ ఇండక్షన్ ప్రోగ్రాము. ఫస్ట్ ఇంట్రడ్యుస్ యువర్‌సెల్ఫ్” అంది.

ఒక్కొక్కరు తమ తమ వివరాలు చెప్పడం మొదలెట్టారు. “నా పేరు కేశవ్” అంటూ ఒకాయన లేచాడు. పాపం నెత్తిన ఆరెకరాలు పైగా నున్నగా బట్టతల మెరుస్తోంది. ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారికి కూడా బట్టతల వుండే వుంటుంది. కొడుకుకైనా నెత్తిన నిండుగా కేశాలు వుండాలని నోరారా కేశవ్  అని పేరు పెట్టుకుని వుంటాడు. కానీ ఏం లాభం,  పేరులో తప్ప నెత్తిన కేశాలు మిగలలేదు. తర్వాత ఓ కోకిల వదనం “నా పేరు చంద్ర కళ” అంటూ, అదృష్ఠం! “సూర్య కళ” అని పేరు పెట్టుకోలేదు.

అన్నట్టు మనుషుల ప్రవర్తనను బట్టీ, ఆకారాలను బట్టీ పేర్లు పెట్టే పద్దతి వుంటే బావుండేదేమో. అయినా ఇప్పుడున్న్న నిక్ నేం లన్నీ అవే కదా. నాకు మా స్కూల్ లో పెట్టిన నిక్ నేం గుర్తొచ్చింది. పైగా నాకు అ పేరు తగిలించింది మా ప్రిన్స్‌పాల్ కావడంతో జనమంతా నా అసలు పేరు మర్చిపోయారు. ఇప్పుడు ఎంత సరదాగా అనిపించినా, స్కూల్ లో వున్నప్పుడు మాత్రం నన్ను ఎవరైనా ఆ పేరుతో పిలిస్తే ఎంత మండేదో. (అమ్మా! నా నిక్‌నేం ఇక్కడ చెబుతా అనుకున్నారా? అస్సలు చెప్పను.)

ఇంతలో నా పక్కన కూర్చున్న పొట్టి జడ అమ్మాయి లేచింది. ఆమెకు మాట్లాడేటప్పుడు తల బాగా వూపడం అలవాటేమో. “గూడ్ మాణింగ్ ఆల్.. ” ఆమె తల వూపుతుంటె దానికి అనుగుణంగా పొట్టిజడ కదుల్తోంది. 

“నా పేరు…” అంటూ ఏదో చెప్పింది కానీ నా దృష్ఠంతా వూగుతున్నపొట్టి జడపైనే వుంది.

“ఈ లయబద్దమైన కదలికను ఎక్కడో చూసాను. యస్ ఇప్పుడు గుర్తొచ్చింది. రైతు బజార్ లో ఆకు కూరలు అమ్మే చోట ఇలాగే ఆకు కూర కట్టలను పట్టుకుని ఊపుతారు. యస్… యస్ ఈమెకు కరక్టైన నిక్‌నేం కొత్తిమీర కట్ట”. మనసులో నవ్వుకున్నాను.

ఆమె చెప్పడం పూర్తయ్యింది. తర్వాత వంతు నాదే. నిలబడి అసంకల్పితంగా “కొత్తిమీర కట్ట ” అన్నాను.

ఒక్కసారి నిశబ్దం.

మనసులో మాట హటాత్తుగా బయటపడే సరికి కొద్దిగా తడబడ్డాను.

తడబాటులో అన్నాను. “…నాట్ మై నేం. హర్ నిక్ నేం… ” అని ఆమె వంక చేయి చూపించాను.

హాల్లో ఒక్కసారి  గుసగుసలు. కొత్తిమీర కట్ట తాళింపు పెట్టిన ఎండుమిరప లా ధుమధుమలాడుతోంది.  ఆమె వంక తిరిగి సారీ అన్నాను. హాల్లో గుసగుసలు నవ్వులుగా మారాయి. దాంతో తాళింపులో ఘాటు ఎక్కువై కళ్ళల్లో నీళ్ళు తిరగడం మొదలైంది. కొత్తిమీర కట్ట లేచి బయటకు వెళ్ళిపోయింది. గోల గోలగా వుండగానే నేను నా గురించి చెప్పడం మొదలెట్టాను.

“నా పేరు ప్రసాదం. సాప్ట్‌వేర్ ఫీల్డ్ లో వున్నా ప్రాసెస్ రీ-ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టం. నా రెగ్యులర్ జాబ్ కూడా రీ-ఇంజనీర్ చేసి సరి కొత్త ఫలితాలు తీసుకురావడం నా పద్దతి.” అంటూ రెండు ముక్కల్లో ముగించాను. నా పరిచయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ “కొత్తిమీరకట్ట” పుణ్యమా అని నేను చాలా మందికి గుర్తుండిపోయాను.

అలా నెమ్మదిగా పరిచయాల కార్యక్రమం పూర్తి కాగానే కాసేపు టీ బ్రేక్  ప్రకటించారు. బ్రేక్ నుండి తిరిగి వచ్చే సరికి మా సరికొత్త ఐడెంటిటీ కార్డులు సిద్దంగా వున్నాయి. బ్లూ కలర్ టాగ్ కు తెల్లగా మెరిసిపోతున్న ఐడెంటిటీ కార్డులను అందరం తగిలించుకున్నాము.

ఈ లోపు ఒకాయన కళ్ళజోడు సర్దుకుంటూ హాల్లోకి ప్రవేశించాడు. వేదిక మధ్యలోకి చేరుకుని ఓ సారి చుట్టూ చూసి “ఐ వెల్కం ఆల్ అఫ్ యు టు దిస్ వండర్‌ఫుల్ కంపనీ. ఐ వాంట్ ఆల్ అఫ్ యు టు గ్రో హియర్ టు సీనియర్ లెవల్స్.. ” అని మెడలో ఎర్ర రంగు టాగ్ కు వేలాడుతున్న తన ఐడెంటిటీ కార్డును సర్దుకుని మా పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించిన టెక్కులాడి వంక చూస్తూ “ఐయాం యాక్త్చువల్లీ బిజీ టుడే, యు ప్లీజ్ కంటిన్యు దిస్ ప్రోగ్రాం” అని మా వంక తిరిగి “ఎనీ క్వొశన్స్?” అని అడిగాడు.

ఓ సందేహాల్రావ్ లేచి “మా టాగ్స్ అన్ని బ్లూ కలర్లో వున్నాయి, మీ టాగ్, మేడం టాగ్ మాత్రం రెడ్ కలర్లో వుంది, ఎందుకని?” అని అడిగాడు.

కళ్ళజోడు ఆయన మళ్ళీ టెక్కులాడి వంక తిరిగి “షి విల్ ఎక్స్‌ప్లెయెన్ ” అని హడావిడిగా హాలు బయటకి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే టెక్కులాడి గొంతు సర్దుకుంది. ” ఏ స్థాయిలో అయినా సరే, కంపనీ లో కొత్తగా చేరిన వాళ్ళందరికీ బ్లూ కలర్ టాగ్స్ ఇస్తారు. కంపనీలో ఐదు సంవత్సరాలు పూర్తి అయితే గానీ రెడ్ టాగ్ రాదు. అలాగే ప్రతీ ఐదు సంవత్సరాలకీ మల్లీ టాగ్ కలర్ మారుతుంది. మీ టాగ్ కలర్ కంపనీ లో మీ సీనియారిటీ ని తెలియజేస్తుంది.” అని అర్థమైందా అన్నట్టుగా ఒక సారి హాలంతా చూస్తూ, తన రెడ్ టాగ్ ను ఒకసారి కొంచం గర్వంగా సర్దుకుంది..

అందరం ఓ సారి తలాడించాం “అర్థమైంది” అని గుర్తుగా.

“ఓకే , ఈ టాగ్స్ సిస్టం గురించి ప్రాసెస్ రీ-ఇంజనీరింగ్ ప్రసాదం చెప్తాడు” అని నా వంక చూడడంతో నేను ఉలిక్కి పడ్డాను.

కొత్తిమీరకట్ట నన్ను చూసి కొంచం అదోలా నవ్వుతోంది. 

“ఇదో పెద్ద ప్రశ్నా” అని మనసులో అనుకుంటూ లేచి “టాగ్ కలర్, కంపనీ లో సీనియారిటీ ని తెలియజేస్తుంది.” అన్నాను.

“ప్రసాదం, మీకు ప్రాసెస్ రీ-ఇంజనీరింగ్ అంటే ఇష్టం కదా, ఈ టాగ్స్ సిస్టం గురించి నీ పద్దతిలో కొంచం డిఫరెంటుగా ఇన్నొవేటివ్‌గా చెప్పు” అని టెక్కులాడి నన్ను రెచ్చగొడుతూ అంది.

కొత్తిమీరకట్ట ఇంకొంచం విశాలంగా “ఎక్కడికీ పోతావు చిన్నవాడా..!”  టైపులోనవ్వింది.

“హమ్మ కొత్తిమీరకట్టా! ఇందాక టీ బ్రేక్ లో వెళ్ళి టక్కులాడి దగ్గర గుసగుసలు పోతె ఏవిటో అనుకున్నా, నన్ను ఇరికించాలని  ఇద్దరూ ఫిక్స్ అయ్యారన్న మాట”. నేను ఓ సారి గాఢంగా ఊపిరి పీల్చుకొని, ఇందాక వచ్చిన కళ్ళజోడాయన దగ్గర్లో లేదని కన్‌ఫర్మ్ చేసుకుని, ఓ సారి కొత్తిమీరకట్ట వంక ఓరకంట చూస్తూ టెక్కులాడితో అన్నాను.

“రెడ్ టాగ్ అంటే ఐదు సంవత్సరాలకు పైగా ఎంత ప్రయత్నించినా బయటెక్కడా ఉద్యోగాలు దొరకని వాళ్ళు అని అర్థం ” అని కూర్చున్నాను. హాలంతా ఒకటే నవ్వులు ఆ పైన చప్పట్లు.

అంతే!  టెక్కులాడి ఇంకెప్పుడూ నన్ను ఇరుకున పెట్టే ప్రశ్నలు వెయ్యలేదు. కొత్తిమీర కట్ట కూడా చాలా కాలం నాజోలికి రాలేదు. తర్వాత మా ఇద్దరికీ దోస్తీ కుదిరింది లెండి. అదే కంపనీలో రెడ్‌టాగ్ కూడా తెచ్చుకున్న కొత్తిమీరకట్టను ఇప్పుడు వాళ్ళాయన కూడా “కొత్తిమీరకట్టా…” అనే పిలుస్తున్నాడట.

మరి ప్రసాదమా? మజాకా!
      

ప్రకటనలు

%d bloggers like this: