జన్మాష్టమి వేళ, గాన గోపికలతో బాలమురళీకృష్ణ…

ఆగస్ట్ 27, 2008ద్వాపర యుగంలో  గోవుల్నీగోకులాన్ని ఆనంద సాగరంలో ముంచెత్తిన మురళీగానం గురించి వినివుంటారు మీరు  కానీ  నేను మీ అందరి కంటే ఒకింత అదృష్టవంతున్ని కాబోలు.  ఏమంటే నిన్నటి జన్మాష్టమి వేళ, కలియుగంలో శిశువులనీ, పశువులనీ, పండితులనీ, పామరులనీ సంగీత సాగరంలో ముంచెత్తిన బాల మురళీ గానాన్ని ముగ్గురు గాన గోపికల సాక్షిగా అస్వాదించిన నా అపురూప అనుభూతుల సమాహారం ఈ అక్షరహారం. అసలు కథ చెప్పే ముందు ఈ అపురూపమైన చిత్రాన్ని చూడండి. బహుశా ఇంతకు ముందు ఇలాంటి సంగమం ఎప్పుడూ జరిగి వుండి వుండదు. అందుకే ఇది అపురూప కలయిక స్వర రాగ మధురిమల కలబోత.


ఒకే వేదికపై, శాస్త్రీయ సంగీత సామ్రాట్ శ్రీ మంగళంపల్లి బాల మురళీ కృష్ణ తో దక్షిణ��ారతదేశంలోని శిఖరాగ్రస్థాయి సీనీ గాయనిమణులు (రావు బాల సరస్వతీ గారు, సుశీల గారు, జానకి గారు)


బాల మురళీ కృష్ణ గారిని చూడటం నాకు ఇదే తొలిసారి కాకపోయినప్పటికీ (ఏడాది క్రితం, ఆ సంగీత సామ్రాట్టుతో ఏకాంతంగా దాదాపు రెండున్నర గంటలకు పైగా కబుర్లు కలబోసుకోగలిగిన అదృష్టవంతున్ని నేను. ఆ వివరాలు మరెప్పుడైనా చెబుతాను) ఈ సారి జరిగిన కచేరిలో ఓ ప్రత్యేకత వుంది. ఏ కళాకారుడికైనా కావలసింది తనలోని కళను అర్థం చేసుకొని ఆస్వాదించే రస హృదయం. అలాంటి రస హృదయులు వుంటే కళ కట్టలు తెగిన కడలే అవుతుంది. ఈ గాన కచేరిలో, సరిగ్గా అదే జరిగింది. కచేరి ప్రారంభానికి ముందే తొలి వరుసలో ఆసీనులైన గాయనీమణులు శ్రీమతి రావు బాల సరస్వతీగారు, శ్రీమతి జానకి గారు, సుశీల గారు మరియు సంగీత దర్శకులు శ్రీ కీరవాణి లాంటి దిగ్గజాలు వున్నందువల్లనేమో, బాల మురళీ కృష్ణ గారి గానం శాస్తీయ సంగీత స్వర సంహితాన్ని ఆవిష్కరించింది.


మరి గురువు గళం కదం తొక్కితే వాద్య గణం పదం కలపకుండా వుంటుందా? రాగ స్వరాలు చేసిన సవాలు కు వాద్య గణాలు ధీటుగా జవాబిస్తే ఆ స్వర సంగ్రామం శ్రుతిలయల సంగమమై రసహృదయ రంజితమై కాలం కరిగి ఆ దినమే ఒక క్షణమై, అనుదినం అనుభవమై,..


ఓహ్, ఏమని చెప్పను ఆ అనుభవం…మీ అందరికీ ఆ ఆపర గాన గంధర్వుని గళ విన్యాసాలు నా బ్లాగు ద్వారా రుచి చూపాలని వున్నా కాపీరైటు కట్టుదిట్టాల మూలంగా కాళ్ళు చేతులు కట్టేసుకోవాల్సి వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ప్రాయోజితం చేసిన పెద్దల దగ్గర కచేరి పూర్తి వీడియోను సంపాదించే ప్రయత్నంలో వున్నాను. అంత వరకూ సెలవా మరి.


మీ ప్రసాదం


ప్రకటనలు

%d bloggers like this: