దారి తప్పిన దేవత,.. ఈ చేయి ఇకపై తాకక

జూన్ 25, 2013


ఈ మధ్యనే కొన్నాళ్ళుగా నానా దేశాలు తిరుగుతూ కాసింత ప్రపంచ జ్ఞానం పెంచుకునే ప్రయత్నాల్లో పడ్డాను. అన్నట్టు ఇప్పటికి 12 దేశాల్లో సందర్శించాను. ఈ సంవత్సరం తిరిగే లోగా మరో 2 దేశాలైనా సందర్శించాలన్న లక్ష్యం కూడా వుంది. అలా తిరుగుతూ డెన్మార్క్ రాజధాని కోపెన్-హాగన్ సెంట్రల్ స్టేషన్ నుండి స్వీడన్ (Malmo) వెళ్ళే రైలు బయలుదేరడానికి ఇంకా రెండు నిమిషాల సమయముండగా, పరిగెత్తుకుంటూనే కదలడానికి సిధ్ధంగా వున్న రైల్లోకి అడుగు పెట్టేను నేను.

ప్లాట్‌ఫాం వరకూ వచ్చి మాకు దారి చూపించిన కుందనపు బొమ్మ లాంటి విదేశీ అమ్మాయికి థాంక్స్ చెబుతూ నా వెనకాలే అంజి కూడా ఎక్కేడు. (ఇక్కడంతా కాండిల్ బొమ్మల్లాంటి అమ్మయిలే తప్ప, కుందనపు బొమ్మలు అరుదు ;)) ప్రతీ 10 నిమిషాలకు Sun Exotic Pineapple n Coconut
మాల్మో వెళ్ళడానికి రైలు ఉంటుందని, ఒకసారి టికట్టు కొంటే 24 గంటలలోపు ఏ రైల్లో అయినా ప్రయాణించవచ్చని అప్పటికి మాకు తెలీదు.

సీట్లలొ సర్దుకుని కూర్చొగానే “కుందనపు బొమ్మ పుణ్యమా అని, కదలబోయే రైల్లోకి వచ్చి పడ్డాం. ఈ సందర్భానికి సరిపోయే పాట ఏదైనా చెప్పు మామా” అన్నాడు అంజి జ్యూస్ బాటిల్ బయటకు తీస్తూ. అన్నట్టు కొబ్బరి నీళ్ళు, పైనాపిల్ కలగలిపిన జ్యూస్ అద్బుతమైన రుచిగా వుంటుంది. ఈ మధ్య కాలంలో నా ఫేవరెట్ అయిపోయింది.


క్లీక్క్క్ మన్న శబ్దం తో ట్రైన్ తలుపులు ఆటోమాటిక్ మూసుకున్నాయి. మరు క్షణం ట్రైన్ కదిలింది.  మా కంపార్ట్మెంటులో పెద్దగా జనం లేరు. మాతో కలిపి ఎనిమిది మంది వుంటారేమో, ఎంత మంది వున్నారో అని ఓ కంట లెక్కేస్తూనే  ఒక్క క్షణం ఆలోచించి, “దారి చూపిన దేవతా….” అని గృహప్రవేశం చిత్రం లో జేసుదాసు పాడిన పాట అందుకున్నా
ను నేను.

“సూపర్, సూపర్… ఎంత స్పాంటేనియస్‌గా పాట అందుకున్నావు మామా…”

“సర్లే, మరీ మునగ చెట్టు ఎక్కించకు. పాటలో సరిపోయింది ఒక్క లైనే, దేవత గారు మనకు దారి చూపించి తన దారిన తను వెళ్ళిపోయారు.”

“వెళ్ళక, ఇంకా చేయి పట్టుకొని వచ్చేస్తుందనుకున్నావా? …”

“మరి పాటలో పరమార్థం అదే కద.”

“పరమార్థం పక్కనబెట్టి, పాట కట్టకూడదా మామా? సేం ట్యూను. కాకపోతే వ్యతిరేక అర్థంలో వుండాలి.” పేపర్ గ్లాసులో జ్యూసు నా చేతికిస్తూ అన్నాడు. 

“మరీ జ్యూసు తో అయితే కష్టమేమో… :D”

“నువ్వు అనుకోవాలే గానీ పావుగంట చాలదూ,..” అని రెచ్చగొట్టి చిచ్చు పెట్టేడు. ఇదేదో బావుంది, ప్రయత్నించి చూద్దాం అని నేనూ డిసైడ్ అయిపోయి జ్యూసు తాగుతూ ఓరిజినల్ పాట పూర్తిగా ఓసారి విన్నాను. జ్యూసు గొప్ప రుచిగా వుంది.

ఒరిజినల్ పాటలో అయితే, నాయకుడు పరమ దుర్మార్గుడు, చేయల్సిన అన్యాయమంతా(?) చేసినా, కథా నాయకి ఒక రాజు ఏడుగురు కొడుకులు కథలో చీమలా “నా బంగారు పుట్టలో వేలు పెడితే నే కుట్టనా..” అనకుండా అపకారికి ఉపకారము చేయడంతో, హీరోగారు కరిగి నీరైపోయి మారిపోయి కథానాయకిని జివితంలోకి రమ్మని ఆర్థించే సన్నివేశం.

ఇక్కడ సిట్యువేషన్ వ్యతిరేకం కనుక, అసలు పాటలోని పల్లవిని ఇలా మార్చాను.

దారి తప్పిన దేవత ఈ చేయి ఇకపై తాకక
దారి తప్పిన దేవత ఈ చేయి ఇకపై తాకక
జన్మ కర్మల జాడగా
నా దారిన నను వదలిపో
దారి తప్పిన దేవత ఈ చేయి ఇకపై తాకక

పల్లవి పూర్తిచేయగానే అంజి వంక చూసి కళ్ళెగరేసేను. “అద్బుతం” అన్నట్టుగా చూపుడు వేలు బొటన వేలు కలిపి గుండ్రంగా చుట్టి చూపిస్తూ ఇంకా చరణాలు వున్నయ్ అన్నట్టుగా నవ్వేడు. ఆలోచిస్తూ కిటికీ లోంచి బయటకు చూసేను. దాదాపు నాలుగు కిలోమీటర్ల పొడవైన టన్నెల్ గుండా ట్రైను దూసుకుపోతొంది. కాకపోతే, టన్నెల్ సముద్ర గర్భంలో ఉందనగానే కాస్త గగుర్పాటు అనిపించింది. సొరంగంలోని పగటి చీకట్లలో పచ్చని విద్యుత్ కాంతులు పోటాపోటీగా వెనక్కి పరిగెడుతున్నాయ్. మూడు వరసల అవతల కూర్చున్న ఒక యువ జంటలోని అమ్మాయి ఒకసారి కళ్ళజోడు సర్దుకుంటూ మమ్మల్ని చూసి , పెదాలు విడివడీవడనట్టుగా నవ్వి మళ్ళీ పుస్తకంలోకి తలదూర్చింది. పక్కనే వున్న కుర్రాడు, నిర్లక్షంగా ముందుకు పడుతున్న జుట్టును వెనక్కి తోసి కిటికీవైపు తల తిప్పి, కళ్ళతో ఆ అమ్మాయిని చూస్తున్నాడు.  నేను జ్యూసు గ్లాసు అందుకొని కళ్ళు మూసుకొని చరణం అందుకున్నాను.

మనసు నిండా కలవు నీవు
నిన్న చూసిన నేనులో
మమత విరిగి మనసు చెదిరి

చిధ్రమైతీ నీ చేతిలో
కలలు కరిగిన వేళలో
ఇంకేమీ వరముల దీర్చను?

దారి తప్పిన దేవత ఈ చేయి ఇకపై తాకక
జన్మ కర్మల జాడగా నా దారిన నను
వదలిపో


చరణం, ఆపై పల్లవి పూర్తి చేస్తూ కళ్ళు తెరిచాను.  అంజి అభినందిస్తున్నట్టుగా చిన్నగా చప్పట్లు కొడుతూ, “ఎక్సలెంట్, ఇంకొక్క చరణం, మాల్మో వచ్చేలోపు అయిపోవాలి 10 నిమిషాలు అంతే..”  అంటూ ఇంకేదో చెప్తున్నాడు. చప్పట్ల శబ్దానికి కాబోలు,  కళ్ళజోడు అమ్మాయి పుస్తకం మూసి మా వంక ఆసక్తిగా చూస్తోంది. పక్కనే అబ్బాయి  కిటికీలోంచి బయటకు దృష్టి సారించాడు. ట్రైన్ సొరంగంలోంచి బయటకు వచ్చి సముద్రంపై కట్టిన రోడ్, రైల్ వంతెనపై దూసుకుపోతోంది. కిటికీలోంచి కనిపిస్తున్న స్వీడన్ గడ్డపై ఒంటి స్థంభపు మేడలా ఠీవిగా నిలబడి మెలితిరిగినట్టున్న కట్టడాన్ని గుర్తు పట్టాను-“Turning Torso“, ఒక ఇంజనీరింగ్ అద్భుతం. స్కాండినేవియా మొత్తానికీ ఎత్తైన కట్టడం. యూరప్ మొత్తంలోనూ, మూడవ ఎత్తైన నివాస భవనం. ఫోన్ కెమెరాతో ఆ దృశ్యాన్ని ఒకసారి క్లిక్కుమనిపించి, గ్లాసులో మిగిలిన జ్యూసుని ఒక్కగుక్కలో తాగేసి, కళ్ళు మూసుకొని రెండో చరణం ఆరంభించాను.

ప్రసాదం : డెన్మార్క్ - స్వీడన్ ల మధ్య సముద్ర వంతెన

మరువలేను, మరచిపోనూ
నీవు చేసిన ద్రోహము
కలలనిండా అహము కూరి

నీవు చేసిన పాపము
ప్రేమ తార్చిన పావని

నా ప్రేమ నిను నిలదీయనీ

దారి తప్పిన దేవత ఈ చేయి ఇకపై తాకక
జన్మ కర్మల జాడగా
నా దారిన నను వదలిపో

నేను పూర్తిచేయడము, మాల్మో చేరుకుంటున్నట్టు రైల్లో ప్రకటించడమూ వెనువెంటనే జరిగాయి. అంజి నా చెయ్యి పట్టుకొని వూపేస్తూ “చాలా బావుంది, అరగంటలో రాసావంటే నమ్మడం కష్టం” అన్నాడు. కళ్ళజోడు అమ్మాయి ఈ సారి కాస్త విశాలంగా “అర్థం కాలేదు, కానీ బావుంది” అన్నట్టుగా నవ్వింది. మరి మీరేమంటారు?

మీ ప్రసాదం  

ప్రకటనలు

%d bloggers like this: