అన్నీ వేదాల్లోనే వున్నాయిష….

డిసెంబర్ 27, 2010

ఆ దేశమూ ఈ దేశమూ  తిరుగుతూ పుట్టిన దేశాన్ని తిరక్కపోతే బావుండదని బుద్ది పుట్టి, ఓ ఆరు నెలల క్రితం ముంబై లో దిగీ దిగగానే పోలోమంటూ బోలెడు చోట్లకు బయలుదేరాను. వెళ్లేప్పుడు తోడుగా బోలెడు పాటల్ని తీసుకెళ్ళేను కదా,  అలాగే వచ్చేప్పుడు బోలెడు జ్ఞాపకాలు తోడు తెచ్చుకోవచ్చని, భుజాన ఓ కెమెరా తగిలించుకుని మరీ కారెక్కాను. సెల్ ఫోన్ లో కెమెరా ఎంచేతో నాకు అస్సలు నచ్చని విషయం అనుకోండి. నా ప్రయాణంలో పదనిసలు కొన్ని, జ్ఞాపకాల గమకాలు కాసిన్ని ఇక్కడ గుది గుచ్చేను.

ముసురుపట్టిన ముంబై నుండి  బయట పడి అరవై కిలోమీటర్లు అలా అడవిలోకి వెళ్ళి, “దేశమెంత మధురం, పరదేశమంత కఠినం … ” అని అనుకుంటుండగానే మేఘపు షాలువా కప్పుకున్న ప్రకృతి ఇదిగో, ఇలా స్వాగతం చెప్పింది.

 ప్రసాదం


చెప్పొద్దూ, ఎప్పుడో విన్న పాట అలలు అలలుగా గుర్తొచ్చేసింది.

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ,
ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను చేరెదను,…”


అలా ఇంకాస్త ముందుకెళ్ళగానే వలపు గాలి తమకం తో చుట్టేసినట్టు ఇదిగో ప్రకృతి ఇలా అల్లుకుపోయి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటే,  ఏమని చెప్పను, ఎలా చెప్పను? 
 

ప్రసాదం
 

ప్రకృతి కాంత ను పరవశించి చూస్తూ పొలము పుట్రా వెంట  కారు పరిగెత్తిస్తుండగా.. హఠాత్తుగా నేను దారి తప్పేనేమోనని అనుమానం వచ్చింది. ఎవరినైనా అడుగుదాము అని కారు అలా కాస్త నెమ్మదిగా పోనిస్తుండగా, అదృష్ఠం బావుండి పశువులు కాసుకునే కుర్రాడొకడు ఓ కొమ్ములు తిరిగిన గేదె పై కూర్చొని, “నీది కారు అయితే నాది రోల్స్ రాయిసు …” అనేంత దర్పంతో  ఎదురొచ్చాడు. నేను కారు దిగి వచ్చీ రాని మరాఠి లో కొంత, హిందీ లో మరి కొంత కష్ఠ పడి అడిగితే, నాకు సరిన దారి చూపించాడు; గేదె దిగకుండానే లెండి. 

హమ్మయ్య , దారి తెలిసింది అన్న ఉత్సాహంతో  కారు స్టార్టు చేస్తూ   అలవాట్లో పొరపాటుగా నేను “థాంక్యూ ” అన్నాను.  

“వెరీమచ్ ” అంతే వేగంగా ఆ కుర్రాడు నాకు సమాధానం చెప్పేడు. “నాక్కూడా వచ్చు లేవో ఆ మాత్రం ఇంగ్లీష్ … ” అన్నట్టున్నాయి అతని కళ్ళు.

ప్రసాదం

 

అలా నవ్వుల ఆటలతో , ఆటల పాటలతో, పెదాల అంచున పదాలు పాడుతూ, మంచు తెరల చాటుగా,  గాలి మరల  మీదుగా ప్రయాణించి ఆ రాత్రికి గమ్యం చేరుకున్నాను. చాలా కాలం తర్వాత కలుసుకుంటున్న ఆనందం కాబోలు,ఇన్ని వందల మైళ్ళు ప్రయాణించినా కాస్త అలసట కూడా లేదు.

అక్కడక్కడా విసిరేసినట్టున్న ఇళ్ళు. అంతా కలిపి ఓ రెండు వందలు వుంటాయేమో. 

కరంటు పోయి  చాలా సేపు అయినట్టుంది. కప్పల బెక బెకలు, కీచురాళ్ళ రొద;

నా చుట్టూ మాత్రం జ్ఞాపకాల పయ్యెద.


పొరలు పొరలుగా విప్పుకునే నా జ్ఞాపకాల అరలు,
తెరలు తెరలుగా కమ్ముకునే జీవితాల సరాగాలు,


మధ్య మధ్యలో జంతికల జావళీలు, కూడా మమకారపు కారప్పూస,
ఓ చేత చేగోడీలు, ప్లేటు నిండా పకోడీలు, ఆపై వేడి వేడి టీలు.


వదిలిపోకుండా నేనూ వున్నాను అని అప్పుడప్పుడూ త్వరపడే వరుణుడి అడుగుల సవ్వడి;
-జల్లు జల్లు మంటూ 


నిదురపోకుండా నేనూ వింటున్నాను అని ఎప్పటికప్పుడు తడబడే, వయసు పైబడిన స్వర సడి;
-ఖళ్ళు ఖళ్ళు మంటూ


పక్క గదిలోకి వెళ్ళి అడిగాను.


“తాతగారూ ఎలా వున్నారు”? 

“బానే వున్నాను కానీ, ….” కాస్త ఆగి శ్వాస తీసుకొని “వయసైపోతుంది కదరా.., ఎనభయ్ దాటలేదూ,నీ కబుర్లు వింటున్నాను… చాలా పెద్దాడివయ్యావ్”  


ఒకప్పుడు వేదం పలికిన దేహం

ఇప్పుడు నిర్వేదం తొణికే దేహం


పెళ్ళి చేసుకుంటావా తాతా అంటే నాకు పిల్లనెవరిస్తార్రా అని అనటం మామూలే కదా, అలా  కాసేపు ఉత్సాహాం పోగేద్దామని తాతకి కబుర్లు చెప్పడం మొదలెట్టాను.  
ఏదో వర్షం పడుతోందని ఇలా పడుకున్నావు కానీ, అసలు వయసైపోయినట్టు కనిపిస్తున్నావా తాతా? నేనుండే దేశంలో, నీకులా ఉత్సాహంగా వుండే వాళ్ళంటే  పడి చస్తారు తెలుసా. అందాకా ఎందుకు; నువ్వు అనుకోవాలే గానీ పడుచు పిల్లలు మీ వెంట తిరగరూ…


ఆ,.. ఆ.. వయసైపోయినవాన్ని, పడుచు పిల్లల గొడవ నాకెందుకుగానీ  ఒరే అబ్బీ, వూరంతా పడవల్లో లాహిరి లాహిరి అంటూ తిరగొచ్చన్నావ్, హిమపాతాలన్నావ్, సుందరాంగులు, స్వేచ్చాప్రణయాలు, సంపదలు  అన్నీ అంటున్నావ్, ఇలాంటి లక్షణాలతో వుండే వూరు గురించి మా కాలంలో పురాణాల ఆచార్యులు చెప్పేవారు. వూరు పేరేమిటన్నావ్.. మళ్ళీ చెప్పు.”  అన్నాడు శ్వాస  ఎగపీలుస్తూ

అమ్‌స్టర్‌డామ్ తాతయ్య.” చాతీ పై నిమురుతూ చెప్పాను

అంతో ఇంతో వేదాధ్యయనం చేసిన వాడివి, నీకూ ఉచ్చారణా దోషాలేమిట్రా? ఆచార్యులవారిలా స్వచ్చంగా అమరేశ్వరధామం  అన్లేవూ.  నోరు తిరగని మ్లేచ్చవెధవలు  అమ్‌స్టర్‌డామ్ అంటే నువ్వు అలాగేనా అనడం. …… ¤§£..=#/..æm?€^~ “

తాతయ్య ఎడా పెడా వాయించేస్తున్నాడు. అన్నీ వేదాల్లోనే వున్నాయిష… అని గిరీశం చెప్పింది నిజమేకాబోలు. 


….ఏమని చెప్పేది తాతయ్యకి

==================================================

కొన్నాళ్ళ (కొన్నేళ్ళ అనాలేమో ) క్రితం రాసిన  అమ్‌స్టర్‌డామ్ విశేషాలు ఇక్కడ   చదవండి

ప్రకటనలు

అందమైన లోకమనీ “అమ్‌స్టర్‌డామ్‌” లా వుంటుందనీ…-1

ఫిబ్రవరి 11, 2008నెదర్లాండ్స్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:00 కు అమ్‌స్టర్‌డామ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లో దిగగానే తెలియని వింత అనుభూతి, మరో కొత్త దేశంలో అడుగు  పెడుతున్నానని కాబోలు. ప్రపంచంలో అతి పెద్ద విమానాశ్రాయాల్లో ఇదీ ఒకటి. అయినా ఎక్కడా తప్పిపోయే ఆవకాశం లేదు లెండి. ఇమ్మిగ్రేషన్ కౌంటరుకు వెళ్ళడానికే దాదాపు 15 నిమిషాలు పట్టింది. అక్కడ పెద్దగా ప్రశ్నలు ఏమీ అడగలేదు. అక్కడి నుండి బాగేజ్ బెల్టులదగ్గరికి మళ్ళీ ఓ 15 నిమిషాలపాటు నడక. నా బాగేజ్ తీసుకుని బయట హాల్లోకి వచ్చేసరికి నా కోసం హోటల్ వాళ్ళు ఏర్పాటు ఛేసిన టాక్సీ   డ్రైవరు ప్లకార్డుతో  నాకెదురుగా వచ్చాడు. విమానాశ్రయం నుండి బయటకు వస్తుంటేనే చిరుజల్లులు, చల్లగాలులూ స్వాగతం చెప్పాయి. సూర్యోదయమై ఇంకా గంటసేపు కూడా అయినట్టులేదు.


నా గది కిటికీ లోంచి పలకరించే సుందర దృశ్యం ...భూ ఉత్తరార్థగోళం లోని,  పశ్చిమ యూరప్ లో ఉన్న నెదర్లాండ్స్ లో భారత దేశంతో పోల్చితే కొంచం విపరీత పరిస్థితే అని చెప్పాలి. అక్టోబర్ నుండీ మార్చి నెల వరకూ శీతాకాలంగానే పరిగణించవచ్చు. సరాసరి ఉష్ణోగ్రతలు కూడా 7’C నుంది 2’C ల స్థాయిలో వుంటుంది. శీతాకాలంలో పగటి సమయం కూడ  చాలా తగ్గిపోతుంది. ఈ వ్యాసం రాస్తున్న సమయానికి, అంటే ఈ రోజు (1-Feb-08) ఉదయం 8:22 కు సూర్యోదయం అయింది. సాయంత్రం 5:26 కల్లా సూర్యాస్తమయం అవుతుంది. వేసవిలో అయితే రాత్రి పదకొండు అయినా ఆకాశంలో సూర్యుడు కనిపిస్తూనే వుంటాడు. అన్నట్టు శీతాకాలంలో కూడా రాత్రి అవగానే మరీ దట్టమైన చీకట్లు ఏమీ కమ్ముకోవు. అంత అర్ధరాత్రి అయినా ఆకాశం అంతా ఓ రకమైన సంజ కెంజాయ వర్ణం కమ్ముకుంటుంది. 


అర్ధరాత్రి అయినా ఆకాశంలో సంజకెంజాయ రంగులే...


హఠాత్తుగా సున్నాకు దిగువస్థాయిలోకి పడిపోయె ఉష్ణోగ్రతలు, విపరీతమైన వేగంతో ( దాదాపు గంటకు 50 నుండి 90 కిలోమీటర్లు) వీచే గాలుల వల్ల చలి ఉధృతి మరింత పెరిగినట్టు అనిపిస్తుంది. మరీ కుంభపోతగా కాకపోయినా వర్షపాతం కూడా ఇదే దారిలో వుంటుంది.


ప్రపంచవ్యాప్తముగ వున్న అతి పురాతన నగరాలలో అమ్‌స్టర్‌డామ్‌ కూడా ఒకటి. క్రీ.శ. 1200 నుండీ ఈ నగరం ఫరిడవిల్లుతూనే వుంది.  వంద, రెండు వందల సంవత్సరాల క్రితం కట్టిన పలు భవనాలు ఇప్పటికీ నగరంలో పూర్తిస్థాయి నివాసయోగ్యమైన భవనాలుగా వున్నాయి. అవడానికి నగరం చాలా పురాతనమైనదైనా, చక్కటి ప్లానింగ్ తో నగరం ముచ్చట గొల్పుతుంది. ముఖ్యంగా నగరంలో చాలా  ప్రాంతాలకు కాలువల రూపంలో విస్తరించిన నీటి రవాణా వ్యవస్థ అద్భుతంగా అనిపిస్తుంది. చాలా మంది తమ తమ ఇళ్ళతో పాటు స్వంతంగా తమకోసం ఒక బోట్ హవుస్ ను కూడా ఏర్పాటు చేసుకుంటారు. శాశ్వతంగా బోట్ హవుసలలోనే నివసించే వారికీ తక్కువలేదు. ఈ బోట్ హవుస్ లు కూడా ఆషామాషీగా వుండకుండా, సకల సౌకర్యాలతో విరాజిల్లుతుంటాయి. సంవత్సరానికి ఒకసారి పార్కింగ్ రుసుము చెల్లించేస్తే, మనకు నచ్చిన చోట బోటుహవుస్ ను కావలసిన చోటుకు తీసుకెళ్ళి కావలసినని రోజులు నిలుపుకోవచ్చు.


ఏమి  ‘Home’ లే హలా, పడవ  గృహములే  ఇలా ... 


మనకు రోడ్ పై రైల్వే క్రాసింగులకు మల్లే ఇక్కడ వాటర్ వే క్రాసింగులు వుంటాయి. వంతెన కింది నుండి చాలా పడవలు క్రాసింగుల గొడవలేకుండా ఎంచక్క వెళ్ళిపోతుంటాయి. కాస్త పెద్ద పడవలు / బోట్ హవుసులు వచ్చినప్పుడు మాత్రం, ట్రాఫిక్ అంతటికీ రెడ్ లైట్ వెలగడం, వంతెనలపై వాహనాలు ఏవీ లేవని నిర్ధారణ అవగానే, నెమ్మదిగా వంతెన తెరుచుకోవడం, అటు పిమ్మట రోడ్డుకు అడ్డంగా నెమ్మదిగా కదిలిపోయె పడవలూ, బోట్ హవుసులు.  చూచి తీరాల్సిన దృశ్యం.


జల రవాణా సదుపాయాలతో పాటుగా నగరంలో రోడ్డు, రైలు రవాణా వ్యవస్థలు కూడా చాలా అభివృద్ది చెందాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రజా రవాణ వ్యవస్థ గురించి. దాదాపు నగరంలోని ప్రతీ మూల నుండీ నిమిషానికి రెండు మూడు ట్రాముల చొప్పున బయలుదేరుతుంటాయి. ప్రతీ వెయ్యి, రెండు వేల గజాలకీ ఒక స్టాపు. వ్యక్తిగత వాహానాల వాహనాలను ఉపయోగించాల్సిన అవసరం ఏవిటిలే అనిపించేంత సౌకర్యంగా వుంటుంది.


ట్రాము, కారు, బైకు, ఏదైనా సరే  పాదచారుల కోసం  ఆగాలసిందే...కళలకీ పెట్టింది పేరైన అమ్‌స్టర్‌డామ్‌లో చూడడానికి బోలెడన్ని మ్యూజియంలు వున్నాయి.సృజనాత్మకత లో కూడా కొంటెతనాన్ని చొప్పించగల సమర్థత చాలా చోట్ల కనిపిస్తుంది.


ఇలాంటి కొంటె ప్రకటనలకీ కొదవేం లేదు మరి ...ఇక్కడి జీవన విధానంపై, ఆర్థిక పరిస్థితి, మరియూ సంస్కృతీ   మరిన్ని ఇతర విశేషాలు తరువాయి భాగాలలో చదవండి.
%d bloggers like this: