బ్లాగు వారి మాటలకు భావాలే వేరులే…[తొలిభాగం]

మార్చి 11, 2008Telugu Alphabetఇక్కడున్నదంతా చెప్పడానికి నాకు వున్న అర్హత ఏవిటంటే నేను ఏమీ చెప్పలేను కానీ, చెప్పడంలో వుద్దేశం మాత్రం ఏ బ్లాగర్నీ తక్కువ చేయాలని కాదు. వీలయితే మీ బ్లాగులకు, మీ రచనలు (తద్వారా తెలుగుకు) కాసింత ఎక్కువ మంది అభిమానులను చేర్చడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నంలో భాగంగా నేను చెప్పాలనుకున్నది ఆవిష్కరించడానికి పలు బ్లాగుల నుండి టపాలను ఉదాహరణగా తీసుకున్నాను. ముందస్తు అనుమతి కోరడం వల్ల నా అలోచన తాలూకూ వుద్దేశం మరుగున పడిపోతుందనే భయంతో, మీ అనుమతి లేకుండా మీ టపాలను ఉపయోగించుకున్నందుకు క్షమాపణలు కోరుతూ, ఇహ అసలు సంగతి మొదలెడుతున్నాను.


తెలుగు అంతర్జాలంలో మరిన్ని బ్లాగులు వికసించడం ఇటీవలికాలంలోని శుభపరిణామం. అయితే బ్లాగర్లందరూ ఎంతో కష్ఠపడి, ఇష్ఠపడి రాసుకున్నతమ టపాను ప్రచురించడానికి ముందు గుర్తుంచుకోవలసిన అతిముఖ్యమైన విషయం ఏవిటంటే, “మీ బ్లాగు చూడడానికి వచ్చేది ఎవరు?“ అన్న సంగతి.తెలుగు భాషను ఉద్దరించాలన్న వుద్దేశంతోనే ఎవరైనా  తెలుగు బ్లాగులను చూడానికి వస్తారు అనుకోవడం అంత హస్యాస్పదమైన సంగతి ఇంకోకటి వుండదు. ఏ మిట్ట మద్యాహ్నమో, ఏ ఆఫీస్ క్యాంటీన్ లోనో హాడావుడిగా భోజనం కానిచ్చి మళ్ళీ పనిలోకి దూకేముందు ఓసారి అలా కూడలిలోనో, జల్లెడలోనో ఓ చూపు చూద్దాం అనుకుని వచ్చేవాళ్ళే తప్ప తీరుబడిగా కూర్చొని ప్రతీ బ్లాగును చదవాలనుకునె వారి సంఖ్య చాలా తక్కువ. ఇక ఏ బ్లాగు అగ్రిగేటర్ అయినా, మీ బ్లాగు పేరు, టపా శీర్షిక తో పాటు రెండు వాక్యాలు ప్రచురిస్తుందే కానీ, మిగితా వివరాలు ఏమీ వుండవు. గోడ మీద పోస్టరు చూసి సినిమాకు వెళ్ళాలో వద్దో నిర్ణయించుకున్నట్టుగా, కూడలిలో వున్న కాస్త సమాచారం అధారంగా కొన్ని అంచనాలకు వచ్చిన పాఠకుడు లేదా చదువరి మీ బ్లాగును తెరుస్తాడు. సదరు పాఠకుడికి ఏర్పడిన అంచనాలకు తగినట్టుగా మీ టపా వుంటే, మీ టపా హిట్టు కింద లెక్క. లేకపోతే ఇక చెప్పేదేవుంది.  అయితే చదువరులకు అంచనాలను కలుగజేస్తున్నదేమిటంటే, మీ టపాకు మీరిచ్చే శీర్షిక. పలువురు బ్లాగర్లు అద్బుతమైన టపాలను రాస్తున్నా, తగిన శీర్షికను చేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్టు నాకు తోస్తోంది.మచ్చుకు రానారె గారు తమ సాహస యాత్రను అద్భుతంగా విపులీకరించిన టపాల సమాహారం కు పెట్టిన శీర్షిక “ట్రావెలాగుడు“. శీర్షిక చూడగానే నాకు మనసులో, తోచిందేవిటంటే “రానారె గారు ఏదో ప్రయాణం గురించి బాగా లాగదీస్తూ చెబుతున్నారు.”  శీర్షిక లోనే ‘లాగుడు” వుంది కదా మరి.  ఈ టపా ప్రచురించింది రానారె కనుక ఆ బ్లాగుకు ఒక చాలా వ్యక్తిగత చరిస్మా వుంది కనుక పలువురు చదువరులు బ్లాగులోకి తొంగిచూసి కామెంట్లేసారు. మనమందరమూ రానారె స్థాయి కి చేరడానికి (కొందరైనా చేరగలరని నా ఆశ) చాల సమయముంది కాబట్టి మనం మన టపాలకు తగిన శీర్షికలను వెతుక్కుందాము. ఏదేమైనా రానారె గారు ఈ టపా శీర్షిక విషయంలో మరింత శ్రద్ద తీసుకునివుంటే, తప్పకుండా ఈ టపా మరింత మందిని ఆకర్షించివుండేది.సరే, ఇక సరైన శీర్షికను ఎంచుకోవడం గురించి కాసేపు చెప్పే ప్రయత్నం చేస్తాను. “నువ్వు చెప్పేదేంటోయ్ బోడి,మాకు తెలుసులే” అంటారా, “సరే, మీకు తెలిసిందే మరోసారి చెప్తాను, సరిగ్గా చెప్పానో లేదో కాస్త సరి చూడండి గురూజీ!”టపా శీర్షికకు వుండవలసిన అతి ముఖ్యమైన లక్షణం ఏమంటే, “టపాలో వున్నదంతా సంక్షిప్తంగా ప్రతిఫలిస్తూ వుండాలి”. ఈ సంగతిని మామూలుగా వివరించడం కన్నా, ఉదాహరణతో అయితే సరిగా చెప్పగలనేమో. నా ఎరికలో గల బ్లాగులలో అత్యద్భుతమైన శీర్షికలను పెట్టడంలో  పప్పు నాగరాజు గారు అగ్రస్థానంలో నిలబడతారు. కావాలంటే “నేలకొరిగిన ఇంద్రధనస్సు”  అన్న ఈ శీర్షికను పరిశీలించండి.  టపాను తెరవగానే కనిపించే నాలుగు వాక్యాలు మొత్తం కథంతా చెప్పేస్తాయి. మొదటి వాక్యం ” మొన్న ఆదివారం అమీర్ ఖాన్ తారే జమీన్ పర్ సినిమా చూసొచ్చా.” అని చదవగానే, “ఓహో ఇది తారే జమీన్ పర్ చిత్రంపై సమీక్ష అన్నమాట” అని అర్థం అయిపోతుంది. ఇక “నేలకొరిగిన ఇంద్రధనస్సు“ శీర్షికను కలుపుకొని చూస్తే  ఆయన ఏ అబిప్రాయాన్ని వెలిబుచ్చబోతున్నాడో అనేది మన ఊహకి అందిపోతుంది. ఇలాంటి శీర్షికల వలన పాఠకులకూ,చదువరులకూ తన బ్లాగులో ఏ మేరకు సమాచారం వుందో సరైన అంచనాను బ్లాగరు అందించగలుగుతాడు. నా ఉద్దేశంలో మీ బ్లాగు విజయానికి అదే మొదటి మెట్టు.సరే, అలా ఓ రకమైన అంచనాలతో బ్లాగును తెరిచిన తర్వాత  అక్కడ సరైన సరుకు లేకపోతే ఏమవుతుందంటారా? ఇదుగో ఈ టపా కు పడ్డట్టుగా ఇలా అక్షింతలు పడతాయి.  బ్లాగు పై పడిన అక్షింతల్లో ఆశీర్వచనాలను ఎలా ఎంచుకోవాలో,  అలోచనలను అందంగా ఎలా పంచుకోవాలో లాంటి  మరిన్ని సంగతులను నాకు చేతనైన స్థాయిలో త్వరలో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను.అభినందనలతో
ప్రసాదంప్రకటనలు

%d bloggers like this: