అంతా భామ మయం, మనసంతా భామ మయం….,

డిసెంబర్ 5, 2007

…. 

ఆ రోజు గురు వారం. చివరి వర్కింగ్ డే. నాతో సహా ఆఫీసులో అందరిలో రాబోయే లాంగ్ వీకెండు ఉత్సాహం ప్రతిఫలిస్తోంది. పైగా మర్నాడు పెద్ద పార్టీ ఒకటి ఏర్పాటు చేసారు. ఏమంటే, మా కంపనీ మరో (బారతీయ ) కంపనీ ని చాలా విజయవంతంగా టేకోవర్ చేసింది. ఈ టేకోవర్లో కూడా నేను కూడా పాలు పంచుకోవడంతో, నాకు కూడా కంపనీ తలకాయల (Head) సరసన చోటు లబించవచ్చని జోరుగా సాగే ఊహా గానాలు నా వరకూ వచ్చాయి. నాలో ఉత్సాహం మరింత పెరిగింది. పైగా వీకెండ్ పార్టీ అంటే ఇక చెప్పేదేముంది.  మందు సంగతి సరే సరి. ఆదివారం సాయంత్రం పార్టీ.

 ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. విషయం తెలిసిన దగ్గర్నుండీ, మా ఆవిడ కూడా నన్ను ఈ రెండురోజులూ ప్రశంసా పూర్వకంగా చూసింది. లేకపోతే ఎక్కడో సర్కారీ బడిలో చదివి, సాధారణ గవర్నమెంటు డిగ్రీ వెలగబెట్టి, ఒక చిన్న సంస్థ లో డాటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తూ ప్రోగ్రామింగు నేర్చుకుని, నెమ్మదిగా బహుళజాతి సంస్థల్లో చేరి, చేరిన ప్రతీ సంస్థలో అవార్డులందుకొని, బిజినెస్ ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ లో ఆడుగు పెట్టి, ఒక్కో మెట్టే ఎక్కుతూ మిలియన్ డాలర్ల వ్యాపార సంస్థల టేకోవర్లలో పాత్ర పోషించే స్థాయికి ఎదగడం వెనుక ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో చాలా దగ్గరగా గమనించింది తను.  ప్రశంసాపూర్వకంగా పెద్దగా మాటలేమీ ఉండవు. కేవలం కళ్ళకు తెలిసే భాష. “ఇదంతా సాధించింది  నువ్వేనా సుమా?” అనే ఒక రకమైన విభ్రమ పూరితమైన చూపు అంతే.

మా ఆవిడ శనివారం ఉదయమే తెలిసిన వాళ్ళింట్లో సీమంతం అని బయటకి చెక్కేసింది. నేను ఒంటరిగా ఇంట్లో కూర్చుని చేతికందిన పుస్తకం తీసుకున్నాను. కళ్ళు పేజీల వెంట పరుగులు తీస్తొంటే, నా మనసు నన్ను పాత్ర లవెంట తడిమి చూసుకొంది. పుస్తకం పేరు “నల్లంచు తెల్ల చీర”.

*                                               *                                                  *

పార్టీ సమన్వయ పరిచే బాధ్యత నాదే కనుక ఆదివారం మధ్యాహ్నం నేను బయలుదేరుతుండగా,  మా ఆవిడ నన్ను అడిగింది. ” సాయంత్రం పార్టీకి ఏ చీర కట్టుకోమంటారు? “

ఎదురుగా సోఫాలో మూడు చీరలు మెరిసిపోతున్నాయి.

ఒకటి  లేత ఆకుపచ్చ రంగు పై జరీ చేసింది. రెండవది,  తెలుపు పసుపు మిశ్రమ రంగు నెమ్మదిగా కిందికి పరచుకుంటుంటే, కింద నీలం రంగు బోర్డరు. సింపుల్ గా ఉంది. మూడో చీరను నేను పెద్దగా పట్టించుకోలేదు.

నేను ఒక్క క్షణం చూసి “ఇది కట్టుకో,” అని రెండవదాని వైపు చూపించి “సాయంత్రం ఆరు కల్లా పార్టీ కి వచ్చెయ్యి” అని మరోసారి గుర్తుచేసి నేను బయలుదేరాను.

సాయంత్రం సరైన సమయానికే పార్టీ మొదలైంది. అతిథులు ఒక్కొకరు రావడం మొదలైంది. మా కొత్త CEO నాతో కరచాలనం చేస్తూ “ఐ హ సోమ అబ యు. యు డి వెగుజా” (I heard somuch about you, You did very good job) అన్నాడు. పక్కనే మా డైరెక్టరు గొంతు కలుపుతూ, “యు రా, హి వి టే నురో  షాలీ” (You are right, He will take new role shortly) అంటూ గ్లాసు అందించాడు. నేను “థా” (Thanks) అంటూ గ్లాసు పైకెత్తాను.

ఎవరో పిలవడంతో, మా డైరెక్టరు, కొత్త సీయివో తో సహా, పక్కకు వెళ్ళాడు. ముందు వేదిక పై, ఏవో కల్చరల్ కార్యక్రమాలు. అక్కడంతా గోల గోలగా ఉంది. నేను నెమ్మదిగా నా ఆఫీస్ వైపు అడుగులు వేసాను. నా ఆఫీస్  గది గాజు అద్దాల్లోంచి బయట పార్టీ వాతావరణం మ్యూట్ చేసిన  యం టీవీ చానల్ లా కనిపిస్తోంది.

సాయంత్రం ఏడయింది. పార్టీ లో ఎక్కడా మా ఆవిడ  కనిపించలేదు. మొబైల్ కు ప్రయత్నించాను.  రింగ్ అవుతొంది. ఎవరూ ఎత్తడం లేదు.   

నాకు మూడవ పెగ్గు పూర్తయింది. మరింత మంది డైరెక్టర్లు, అభినందనలు.

సమయం ఏడున్నర. నా కళ్ళు వెదుకుతూనే ఉన్నాయి. నీలం రంగు బోర్డరు కనిపించలేదు.

లాప్‌టాప్ లో జస్వంత్ సింగ్ మంద్రంగా పాడుతున్నాడు. “వక్త్ కా యెహ్ పరిందా రుఖా హై కహ, మై థా పాగల్ జో ఇస్కో బులాతా రహా, చార్ పైసా కమానే మై ఆయా షహర్, గావ్ మెరా ముజె యాద్ ఆతా రహా…

वक्त का ये परिंदा रुका है कहा
मई था पागल जो इसको बुलाता रहा |
चार पैसा कमाने मैं आया शहर
गाव मेरा मुजे याद आता रहा  … गाव मेरा मुजे याद आता रहा … ||

నాకు మా వూరు, లెక్కల మాష్టారు చేతిలో నేను తిన్న తన్నులు, పదవతరగతిలో నా ముందు కూర్చునే రామ లక్ష్మి జడ, ఇంటర్ లో నేను ఫెయిల్ అయ్యానని తెలిసిన తర్వాత నాన్న గారి వుగ్ర రూపం, నేను ఎందుకూ పనికిరానని, నాకు ఎలాంటి భవిష్యత్తు లేదని నాన్న తీర్మానించడము వరసగా గుర్తొచ్చాయి. బరువెక్కుతున్న అలోచనలను స్కాచ్ తేలిక చేస్తుందా లేక స్కాచ్ వల్ల అలోచనలు బరువెక్కుతున్నాయా అన్న మీమాంస లో ఉండగా, సెల్లు మోగింది. మొబైల్ పై  “అంజి” అన్న అక్షరాలు డాన్స్ చేస్తున్నాయి. “ఎక్కడున్నవ్ మామా,……పార్టీ కూడా డెస్క్ దగ్గరెనా?. బయటకు రా మామా, ఫుల్ల్ కలర్స్ ఇక్కడ…… నేనా, ఇక్కడ ఫౌంటేన్ దగ్గర ఉన్నాను. “

బయటకు బయలు దేరబోతూ నీలం రంగు బోర్డర్ కోసం ఒక సారి చూసాను. ఎక్కడా కనిపించలేదు. మా ఆవిడ కు ఫొన్ చేసాను. ప్చ్ ఎవరూ ఫోన్ ఎత్తడం లేదు. నేను వెళ్ళేసరికి ఫౌంటేన్ దగ్గర గోల గోలగా ఉంది. నేను కనిపించగానే అంజి, “వెల్‌కం మామా, నిన్ను ప్రమోట్ చేస్తున్నరటగా. కంగ్రాట్స్ రా” అంటూ నన్ను హత్తుకున్నాడు.

నా కళ్ళు మా ఆవిడ కోసం వెతుకుతూ ఉన్నాయి. వేదిక మీద ఏదో గ్రూప్ డాన్స్ జరుగుతోంది. నాకు హఠాత్తుగా మేము ఇంటర్లో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రదర్శన గుర్తొచ్చింది. ” ఓ పాపలు, ఓ పాపలు, ఐ లవ్ యు….” అని మా కాలనీ గణేష్ మండలి లో నేను మా గాంగ్ తొ కలిసి  చేసిన డాన్స్, అది చూసి విస విస లాడుతూ  గిరుక్కున తిరిగి జడ తిప్పుతూ వెళ్ళిపోయిన రామ లక్ష్మి మళ్ళీ గుర్తొచ్చింది. పాపం ఎక్కడుందో. ముంబై లో పని చేసే వాళ్ళ బావను పెళ్ళి చేసుకుందిగా. పిల్లలూ, మొగుడితో కలిసి అంధేరీ లోనో, ఇంకెక్కడో లోకల్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. లోకల్ ట్రైన్ లో అంత పోడవాటి జడ తో ప్రయణం చేయడం కష్టం కావచ్చు. ఎందుకనో పొడవాటి జడ అంటే ఇష్టం ఏర్పడిపోయింది.  మా ఆవిడకేమో పొడవాటి జుట్టు ఇష్టం ఉండదు. అన్నట్టు మా ఆవిడ ఎక్కడుంది. ఇంకా కనిపించలేదు. మళ్ళీ ఒకసారి చుట్టూ చూసాను. నీలం రంగు బార్డరు చీర ఎక్కడా కనిపించలేదు. ఆరవ రౌండ్ స్కాచ్ నెమ్మదిగా ప్రభావం చూపిస్తోంది. మరోసారి ఫొన్ చేయ్యాలి. ఫోన్,… ఫోన్… ఓకే, నా డెస్క్ దగ్గరే ఉంది. నెమ్మదిగా నా కాబిన్ కు నడవడం మొదలెట్టాను.

రెండడుగులు వేయగానే కుడి వినిపించిన స్వరం ఎక్కడో విన్నట్టు అనిపించింది. చటుక్కున పక్కకు తిరిగాను. పొడవాటి జడ, జడ కుచ్చులు, చెవికి జూకాలు, నల్లంచు తెల్ల చీర… వావ్. ఎక్సైట్‌మెంట్ తో దాదాపు అరిచాను. “ఏయ్ రామ లక్ష్మి, నువ్వు? ఇక్కడ! ఎలా ఉన్నావ్?… ఎక్కడుంటున్నవ్ ఇప్పుడు…” నేను ఇంకా మాట్లాడుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే, ఎవరితోనో మట్లాడుతున్న తను వెనక్కి తిరిగింది.

తను నా వంక తిరిగి ఒక అడుగు ముందుకు వేసి కొంచం నెమ్మదిగా, “ష్ , నేనూ, మీ ఆవిడను. కొత్తగా ఈ రామ లక్ష్మి ఎవరు? మీకు గర్లు ప్రండ్ కూడా ఉందా?..అయితే మీ గర్లు ప్రండ్ పేరు రామ లక్ష్మి అన్నమాట. వచ్చిన ప్రమోషన్లు, అయిన పార్టీలు చాలు. ఇంటికి పదండి” అంది.

ఇంటికి వెళ్ళగానే నేను చెప్పేది వినిపించుకోకుండా మా ఆవిడ నాకు ప్రైవేట్ క్లాస్ తీసుకుందీ …… చూడండీ… 

ఆహాహ్ , …. ఒహోహ్… ఎందుకు లెండి చెప్పడం.

మా ఆవిడ ఇంతే, మరి మీ ఆవిడ ?
==================================================

కొస మెరుపు : నాకు ఇష్టమని, మా ఆవిడ బ్యూటీ పార్లర్ కు వెళ్ళి జడకుచ్చులు, జూకాలు పెట్టించుకుందిట. ఆ బ్యూటిషియన్ సలహా మీదే నల్లంచు తెల్లచీర కట్టుకుందని నాకు తరువాత తెలిసింది.     

ప్రకటనలు

%d bloggers like this: