Life is an Accident

మే 15, 2013


పదుగురూ లేనప్పుడు నువ్వు ఏం చేస్తావో, జీవితంలో అది నీ క్యారెక్టర్
నువ్వే లేనప్పుడు పదుగురూ ఏమంటారో, ప్రపంచం లో అది నీ చాప్టర్


జీవితం కొనల నుండి చూస్తేనే జీవన పథం గెలుస్తుందేమో. మరణం అంచుల నుండి చూస్తేనే మనిషి విలువ తెలుస్తుందేమో, ఎందుకో తెలీదు కానీ, మరణమే మరోసారి జీవించే అవకాశం ఇచ్చింది. నా తత్వాన్ని తనివితీరా కాకున్నా, తడిమి చూసుకునే అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఇవ్వకుంటే, ఈ రోజుకి నేను మరణించి వారం అయివుండేది. కానీ అలా జరగలేదు. అసలేం జరిగిందంటే…..

***************************************************************************


మే 11 , శనివారం మధ్యాహ్నం మూడు గంటలు.


అప్పటికి మరో నాలుగు గంటల ప్రయాణం చేయాల్సి వుంది. వంటరిగానే కారు డ్రైవ్ చేస్తున్నా పెద్దగా అలసట కూడా ఏమీ లేదు. పైగా తెలిసిన జాతీయ రహదారే అవడంతో గాలిని కోస్తూ దూసుకు పోతున్నాను. స్పీడో మీటరు ముల్లు నిట్టనిలువుగా నిలబడి, కారులో నెమ్మదిగా వినిపిస్తున్న ఘంటసాల స్వరాలకు కాస్త, కాస్త తలూపుతోంది.


మరో అరగంట తర్వాత, కారు ముందుభాగపు పైకప్పుపై, సరిగ్గా చెప్పాలంటే రియర్ వ్యూ మిర్రర్ పైభాగాన ఎగురుతున్న తెల్లటి పావురము ఢీ కొంది. ఠాప్ మంటూ ఉలిక్కిపడేయంత శబ్దం. రెక్కలు విరిగిన పక్షి గిలగిలా తన్నుకుంటూ కారుపై నుండి రోడ్డు పైకి జారిపోవడం రియర్ వ్యూ మిర్రర్ లోంచి నిస్సహాయంగా గమనిస్తూ మనస్పూర్తిగా మనసులోనే క్షమాపణ వేడుకున్నాను నేను. ఇలా ఒక పక్షి ఢీకొనడము అనేది కనీసం నా వరకెప్పుడో జరగలేదు. ( మీకెప్పుడైనా జరిగిందా?) . నెమ్మది నెమ్మదిగా ఘంటసాల గళంలో పడి మామూలు అయిపోయేను. మరో పెద్ద సంఘటన నాకోసం ఎదురు చూస్తోందని నాకప్పుడు తెలీదు.

***************************************************************************


మరో రెండున్నర గంటల తర్వాత, సుమారు సాయంత్రం ఆరు గంటలకు;


సూరీడు సంధ్య తో ఎర్రని నిప్పుల హోలీ ఆడుతుండగా, కుడివైపు వంపు తిరుగుతున్న జాతీయ రహదారి పై నా కారు దూసుకుపోతుండగా, హఠాత్తుగా 50 – 70 మీటర్ల దూరంలో రోడ్డు డివైడర్ లోనుండి అపసవ్య దిశలో రోడ్డు పైకి ముగ్గురు కుర్రాళ్ళతో కూడిన బైకు ప్రత్యక్షమైంది.


అసంకల్పితంగా, ఓ చేయి హారన్ మీదకు, ఓ కాలు బ్రేక్ మీదకు వెళ్ళిపోయాయి. బైకును ఢీ కొనకూడదని తప్పని పరిస్థితిలో అంత వేగంలో నా కారుని పూర్తిగా ఎడమవైపు లేను కు తిప్పుతుండగా ఎడమపక్క మరో 50 మీటర్ల దూరంలోవున్న చిన్న బస్టాపును, అక్కడ వున్న జనాన్ని గమనించేను.


వెంటనే మరో షార్పు టర్ను, కుడి వైపుకి రోడ్డు డివైడర్ వైపుగా-


రోడ్డు మధ్యలోకి కారును మరో టర్న్ తీసుకునేయంత వ్యవధి లేకపోయింది.


నా కారు డివైడరు పైకి ఎక్కేయడం, అక్కడున్న మైలురాయిని ఢీకొనడము, ఆ ధాటికి ఆ మైలురాయి పెకలింపబడి కారుతో పాటు గాలిలోకి లేవడము చకచక జరిగిపోయాయి. పక్కనే వున్న బస్ షెల్టరు కన్నా పైకి (కనీసం 8 అడుగులు ) ఎగిరిన కారు ఎడమ పక్కకి తిరిగి నేలను తాకిన క్షణంలో భళ్లుమంటూ అద్దాలన్నీ పగలడము, వెంటనే కారు మరో రెండు సార్లు పల్టీలు కొట్టి వంగిన చక్రాలపై నిలబడిపోవడము నాకు తెలుస్తూనే వుంది.


బస్టాపులో జనమంతా కేకలు వేస్తూ కారు దగ్గరకు వచ్చేసి, పగిలిపోయిన కిటికిలోంచి గాయాలేమీ లేకుండా పూర్తిగా స్పృహ లోనే సీట్లో వున్న నన్ను కళ్ళింత చేసుకొని చూస్తున్నారు. కారుకు ప్రమాదం జరిగిందన్న సంగతి జీర్ణించుకోవడానికి నాకు ఒక్క క్షణం పట్టింది.


సీటు బెల్టు విప్పుకొని, పక్క సీటు కింది నుండి తొంగి చూస్తున్న నీళ్ళ సీసా అందుకొని, రెండు గుక్కల నీళ్ళు తాగాను. బైకు కుర్రాళ్ళ క్షేమ సమాచారం అడిగేను. వాళ్లు పారిపోయారని చెప్పారు. విరిగిపోయిన డాష్ బోర్డు కింద ఇరుక్కుపోయిన పర్సు తీసుకున్నాను. పోలీసులకు, ఇన్సురెన్సు కంపనీకి కాల్ చేయడానికి ఫోన్ కోసం వెదికా కానీ దొరకలేదు. కారులోంచి విసురుగా బయట పడిపోయిన ఫోన్ ను అప్పటికే ఒక దొంగ గారు చేజిక్కించుకొని వుడాయించాడు అన్న సంగతి నాకు అప్పటికి తెలీదు. [సదరు దొంగగారిని, పోలీసుల సాయం లేకుండా 45 గంటల్లో నేనే స్వయంగా పట్టుకొని, ఫోన్ సంపాదించుకున్నాను. ఆ కథ మరోసారి చెప్తాను]

ప్రసాదం; కారు ప్రమాదం


ఓ సారి గాడంగా శ్వాస తీసుకొని, కార్లోంచి దిగాను. జనం ఇంకా అపనమ్మకంగా చూస్తున్నారు. ఫోన్ అడిగాను ఒకర్ని.


“నా దగ్గర బాలన్స్ లేదు” అన్నాడు ఒకతను. నిజమే కాబోలు.


“నీదే కులం” అడిగాడు మరొకాయన. “నేనొక మనిషిని, ఈ పరిస్థితిలో నీకు కులం అవసరమైతే నాకు నీ ఫోన్ అక్కర్లేదు” అని చెప్పాను.


ఒక ముసలాయన ఎవరో తన ఫోన్ ఇచ్చాడు. ముందుగా పోలీస్ కు ఫోన్ చేసాను. తర్వాత ఓ స్నేహితుడికి, అంతే. కంగారు పడతారని ఇంట్లో వాళ్ళకు కూడా తెలియనివ్వలేదు. నేనే స్వయంగా వెళ్లి చెప్పాలి. నన్ను చూస్తే గానీ నాకేమీ కాలేదని నమ్మరు. ముందు ఫోన్ వెతకాలి… చూట్టూ గుమికూడిన వాళ్ళలో కొందరు నా నంబరుకు ఫోన్ చేయడం ప్రారంభించారు. రింగవుతోంది కానీ ఎవరూ ఎత్తడం లేదు.


మరొకరెవరో ఫోన్ ఇచ్చారు. ఇన్సూరెన్సు కంపనీకి ఫోన్ చేసాను. ఫోటోలు తీయాలని చెప్పారు ఇన్సూరెన్సు అయ్యవార్లు. బాగ్ లోపల ఉన్న ఐపాడ్ బయటకు తీసి దాంతో ఫొటోలు తీసాను. ఈ లోగా వచ్చిన పోలీసులతో మిగిలిన కాసిన్ని పనులు పూర్తి చేసుకొని, కదల లేని స్థితిలో వున్న కారును, క్రేన్ తో పక్కకు జరిపించి, ఓ ట్రక్కు లో వేయించి, మిగిలిన, కాసిని భాగాలు ఎవరూ ఎత్తుకుపోకుండా కాస్త సురక్షిత మైన చోటికి తరలించేను, మరో కార్లో గమ్య స్థానం చేసుకునేసరికి రాత్రి 10.30


పది నిమిషాల పాటు పరామర్శలలో గడిపి, ఆ వెంటనే ఇంటర్నెట్ కు కనెక్టు అవగానే నాఫోన్ లొకేషన్ వెతకడం మొదలెట్టాను. మాప్ లో ఎక్కడో గుర్తు తెలియని చోట నా ఫోన్ వేగంగా కదులుతోంది. ఫోన్ ఎత్తుకుపోయిన వ్యక్తి ఏదో వాహనం తో వున్నాడని అర్థం అయింది. ఫోన్ Lost Mode పెట్టిన కాసేపటికి స్విచ్కాఫ్ అయిపొయింది.


భగవద్గీత లోని “కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన । మా కర్మ ఫల హేతురభుహ, మాఁ తే సంగోత్స్వ కర్మణ్యే” ను మనసా వాచా నమ్మిన వాన్ని, ఈ రోజు పనులు సరిగా నిర్వర్తించానన్న తృప్తితో భోజనం చేసి మామూలుగానే నిద్ర పోయాను.

***************************************************************************


ఆదివారం అంతా పరామర్శలు, ఫోన్ కోసం వెతకడం (150 కిలోమీటర్లకు పైగా తిరిగాను) సరిపోయింది. సోమవారం సాయంత్రం దొంగ గారింటికి వెళ్లి ఫోన్ తీసుకున్నాను. అతనో టాక్సీ డ్రైవరు. ముసలి తల్లి, ఇద్దరో ముగ్గురో పసి పిల్లలు, భార్యా, ఇదీ అతని సంసారం. ప్రమాదం లో వున్న నా నుండి, నా ఉద్యోగానికి అవసరమైనదాన్ని (చాలా ముఖ్యమైన సమాచారం, కంటాక్ట్ వివరాలు వున్నాయి) తీసుకుపోయిన అతన్నినేను దొంగని చేసాను. అతని ఉద్యోగానికి అవసరమైన ఆ విలువని (ఆ చిన్న వూర్లో దొంగ గా ముద్ర పడితే బతుకు బండి లాగడం బరువైపోదా?) లాక్కున్న నాకు, అతనికీ పెద్ద తేడా లేదనిపించింది. పోలీస్ కం ప్లైంటు ఏమి ఇవ్వలేదు. అతని కుటుంబం వద్దంటున్నా, అతనికి కొంత డబ్బు ఇచ్చాను. ఇంతకన్నా నేను చేయగలిగింది ఏముంది?


దెబ్బతిన్న కారు ని వర్కు షాపు కు పంపే ఏర్పాట్లు చేసి, మరో కారు డ్రైవు చేస్తూ (అవును, నేనే నడిపాను) అర్ధ రాత్రి దాటాక ఇల్లు చేరుకున్నాను. మంగళవారం ఉదయం, ఇన్సూరెన్సు తాలూకు వ్యవహారాలూ పూర్తిచేసుకొని ఆఫీస్ లో జాయిన్ అయిపోయాను.


రెండు రోజుల పాటు పని వత్తిడి లో వున్నా, మనసు లోతుల్లోంచి ఏదో అలజడి. అప్పుడప్పుడూ గగుర్పాటు, ” నేను నిజంగా ప్రాణాలతో వున్నానా అన్న సంశయం. ఎందుకని ఏ తెలియని దివ్య శక్తో నన్ను కాపాడింది? దైవత్వం మీద తప్ప, దైవం మీద నమ్మకం లేని వాణ్ని. తెలీని శక్తి ఏదో వుందని నమ్మినా, ఆ శక్తి తలానీలాలకు, తడి బట్టల ప్రదక్షిణాలకు తలోగ్గుతుందని నమ్మను నేను. ఊహ తెలిసాక, ప్రసాదం తినడానికి, శిల్పకళా ఉత్సుకతతో తప్ప మొక్కులు చెల్లించడానికి నాలుగు గోడల గుడి మెట్లు ఎక్కలేదు. ఇప్పుడూ ఎక్కాలన్న ఉద్దేశం లేదు. నాకు తెలిసిన దేవాలయం సమాజమే, నాకు తెలిసిన పూజా పద్దతి, తోచిన సాయం చేయడమే. అందుకే నాకు తెలిసిన అనాధ శరణాలయానికి ఫోన్ చేసాను, ప్రస్తుతం చదివిస్తున్న అమ్మాయిలకు తోడుగా, నా స్థోమత కు తగ్గట్టు మరి కొంతమంది అమ్మాయిలకు చదివించే బాధ్యతా తీసుకోవడానికి.

***************************************************************************


ఇదంతా రాయడానికి, నాకున్న రెండు కారణాలు.


మొదటిది, ముఖ్యమైనది. దయ చేసి కారు లో ప్రయాణిస్తున్నప్పుడు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. నేను బతికుండడానికి అతిముఖ్య కారణం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం.


రెండవది, నేను కృతజ్ఞతలు చెప్పే పద్దతి మీద నాకు మరింత నమ్మకం కలగడానికి.


మీ ప్రసాదం

ప్రకటనలు

%d bloggers like this: