అందమైన లోకమనీ “అమ్‌స్టర్‌డామ్‌” లా వుంటుందనీ….-2

మార్చి 19, 2008పలు కాలువలతో నిర్మితమైన ఈ పట్టణం సముద్ర మట్టానికి కనీసం 4 మీటర్ల దిగువన వుంది. సముద్రంలోని నీరు కాలువల ద్వారా వెనక్కు వచ్చి నగరాన్ని ముంచేయకుండా వుండటానికి గాను, ఆనుక్షణమూ నీటిని తోడిపారబోయడానికి వీరు డైక్ అనబడే అనకట్టలను నిర్మించుకున్నారు.  ప్రకృతినే ఎదురొడ్డి నిలిచిన వీరి నీటిపారుదల సాంకేతిక పరిజ్ఞానమును భారత్ తో సహా ప్రపంచ దేశాలన్నీ వినియోగించుకుంటాయి. విలాస జీవితం గడపటానికి ఇష్టపడే వీరి జీవన విధానం చాలా ఆసక్తికరంగా వుంటుంది. సూర్యోదయ సమయంతో నిమిత్తం లేకుండా ఎక్కువ మంది ఉదయం నాలుగు గంటలకే మేల్కొంటారు. వ్యాపార సంస్థలు మినహాయించి పాఠశాలలు , కళాశాలలు వంటివన్నీ ఉదయం ఏడు గంటలకే ప్రారంభం. అలాగే మద్యాహ్నం గరిష్టంగా 1500 గంటలకల్లా అందరూ తట్టా, బుట్టా సర్దేస్తారు. వ్యాపార సంస్థలు, కార్యాలయాలు  కూడా సాయంత్రం 1800 కల్లా ముసుగు తన్నేయాల్సిందే. సాయంత్రం 1900 గంటలలోపు రాత్రి బోజనం కూడా అయిపోతుంది. ఆ తర్వాత అలా టీవీ ముందు కాళ్ళు చాపుకొని కూర్చొని బీరు గానీ వైను గానీ చప్పరిస్తూ సరదాగా కబుర్లతో గడిపేస్తారు.


లాహిరి, లాహిరి , లాహిరి లో...


ఇక పోతే, పని గంటల విషయం లో కూడా మరీ ఖండితంగా వుంటారు.రోజుకు 9 గంటల చొప్పున వారానికి 36 గంటలు (అంటే వారానికి నాలుగు రోజులే) పనిచేయాలి. ఆపైన పని చేసిన ప్రతీ నిమిషం ఓవర్‌టైము కిందే లెక్క. సాదారణంగా సోమ, మంగళవారం పనిచేసి మళ్ళీ బుధవారం సెలవుతీసుకుంటారు. మళ్ళీ గురు, శుక్ర వారాలు కాస్త వొళ్ళొంచితే ఇక వారాంతమే. ఎక్కువ మంది శుక్రవారం సాయంత్రమే వారాంతం గడపడానికి తమకు నచ్చిన చోటుకు వెళ్ళిపోతారు.


చౌకధరల షాపులు, చక్కనైన షోకులు..


ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటైన నెదర్లాండ్స్ లో ఆయుధ సంస్కృతి పెద్దగా లేదు. ఎవరైనా సరే, ఎంత అర్ధరాత్రి వేళయినా నిర్భయంగా కావలసినచోటుకు వెళ్ళొచ్చు. అన్నట్టు ఇక్కడ దాదాపు అన్ని రకాల మాదకద్రవ్యాలు కూడా స్వేచ్చగా షాపుల్లో అమ్ముతారు. వ్యభిచారం కూడా చట్టబద్దమైన గౌరవనీయమైన వ్యాపారమే. చాలా దేశాల్లో వ్యభిచారం పొట్టకూటికోసం జరిగితే, ఇక్కడ మాత్రం మరింత విలాసవంతమైన జీవితం కోసం, థ్రిల్ కోసం, సరదా కోసం జరుగుతుంది.


గారడీ వీరులూ ఇక్కడా వుంటారు మరి!


ఇక్కడి విలాసవంతమైన జీవితానికి నిదర్శనమా అన్నట్టు, చాల మంది స్థానికులు ఏవైనా కొత్త వస్తువులు కొనగానే, తమ పాత వస్తువులను ఇంటి ముందు వదిలేస్తారు. అలా వదిలేసిన వస్తువులలో పూర్తి స్థాయిలో  పని చేసే పెంటియం లాప్‌టాపులు, ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్లూ, మైక్రోవేవ్ ఓవెన్లతో పాటు మంచి ఫర్నీచర్లు ఇంకా మరెన్నో గృహోపయోగమైన వస్తువులూ వుంటాయి.  ఉదయమే వచ్చే మున్సిపాలిటీ (ఇక్కడ ఏవంటారో మరి) వాన్ లో ఈ వస్తువులన్నీ క్రష్ అవుతుంటాయి.


రిక్షావాలా ధూమ్ ధామ్


సహజవనరులు అతి తక్కువగా వున్నా, ప్రగతిపథంలో మాత్రం ముందుకు దూసుకుపోయే ఈ దేశంలో ఆదాయం పన్ను కూడా చాలా ఎక్కువే. ఎలాంటి మినహాయింపులూ లేకుండా అందరూ తమ ఆదాయంలో 33.60% నుండి 52% వరకూ  వివిధ శ్లాబులలో అదాయం పన్నుగా కట్టాల్సిందే. అయితే ప్రభుత్వం కల్పించే సదుపాయాలు కూడా అందుకు ధీటుగా వుంటాయి. ఉదాహరణకు, నిరుద్యోగ భృతి సంగతే తీసుకోండి. ఏ కారణం వల్లనైనా, ఉద్యోగం కోల్పోయి నిరుద్యోగులైతే కోల్పోయిన ఉద్యోగం ద్వారా లభించే ఆదాయంలో  75% నిరుద్యోగ భృతిగా (గరిష్ఠంగా రోజుకు 177 యురోలు) లభిస్తుంది. [ ఒక వ్యక్తికి సరిపడే ఆహారం ఖర్చు నెలకు గరిష్టంగా 300-500 యూరోలు]


అదాయం  పన్ను ��వనం, అంతా తెరిచిన పుస్తకం


అమ్‌స్టర్‌డామ్‌ లోని ప్రజలు తమ మాతృభాష డచ్ కు ఇచ్చే ప్రాధాన్యం కూడా అనన్యమైనది. దాదాపు ప్రతీ ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడగలిగి వుండి యాత్రికులుగా వచ్చిన వారికి సాద్యమైనంతగా సహాయం చేస్తారు. కానీ, వుద్యోగరీత్యా,వ్యాపార రీత్యా ఇంకా చదువురీత్యా, మరే ఇతర అవసరం రీత్యా అక్కడ నివసించే విదేశీయులు మాత్రం డచ్ భాష నేర్చుకోవలసిందే. డచ్ భాష ను ఉచితంగా నేర్పే శిక్షణా సంస్థలు కూడా వున్నాయి. ఒకటి రెండు సంవత్సరాలకు పైగా నివసించే వారికి తప్పని సరిగా డచ్ మాట్లాడటం వచ్చి వుండాలి లేకపొతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక  తప్పదు. ఉదాహరణకు, విమానాశ్రయంలో పాస్‌పొర్ట్, వర్క్ పర్మిట్ పరిశీలించేటప్పుడు  అక్కడి అధికారి మీరు అక్కడ చాలా కాలంగా వుంటున్నట్టు గమనిస్తే మీతో డచ్ భాషలోనే మాట్లాడతాడు. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడటానికి ప్రయత్నిస్తే కుదరదు. అన్ని రోజులు నెదర్లాండ్స్ లో వున్నప్పటికీ ఎందుకు డచ్ భాష నేర్చుకోలేదనే ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం డచ్ భాష నేర్చుకోని కారణంగా కోరిన సహాయం (తాత్కాలికంగా) నిరాకరించిన సందర్భాలు కూడా వున్నాయి. మన తెలుగు భాషా సంఘం వాళ్ళు ఇక్కడకొచ్చి భాషాభిమానం అంటే ఏవిటో నేర్చుకోవాలి అని నాకు ఎన్నిసార్లు అనిపించిందో.మరిన్ని ఇతర విశేషాలు తరువాయి భాగాలలో చదవండి.


ప్రకటనలు

అందమైన లోకమనీ “అమ్‌స్టర్‌డామ్‌” లా వుంటుందనీ…-1

ఫిబ్రవరి 11, 2008నెదర్లాండ్స్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:00 కు అమ్‌స్టర్‌డామ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లో దిగగానే తెలియని వింత అనుభూతి, మరో కొత్త దేశంలో అడుగు  పెడుతున్నానని కాబోలు. ప్రపంచంలో అతి పెద్ద విమానాశ్రాయాల్లో ఇదీ ఒకటి. అయినా ఎక్కడా తప్పిపోయే ఆవకాశం లేదు లెండి. ఇమ్మిగ్రేషన్ కౌంటరుకు వెళ్ళడానికే దాదాపు 15 నిమిషాలు పట్టింది. అక్కడ పెద్దగా ప్రశ్నలు ఏమీ అడగలేదు. అక్కడి నుండి బాగేజ్ బెల్టులదగ్గరికి మళ్ళీ ఓ 15 నిమిషాలపాటు నడక. నా బాగేజ్ తీసుకుని బయట హాల్లోకి వచ్చేసరికి నా కోసం హోటల్ వాళ్ళు ఏర్పాటు ఛేసిన టాక్సీ   డ్రైవరు ప్లకార్డుతో  నాకెదురుగా వచ్చాడు. విమానాశ్రయం నుండి బయటకు వస్తుంటేనే చిరుజల్లులు, చల్లగాలులూ స్వాగతం చెప్పాయి. సూర్యోదయమై ఇంకా గంటసేపు కూడా అయినట్టులేదు.


నా గది కిటికీ లోంచి పలకరించే సుందర దృశ్యం ...భూ ఉత్తరార్థగోళం లోని,  పశ్చిమ యూరప్ లో ఉన్న నెదర్లాండ్స్ లో భారత దేశంతో పోల్చితే కొంచం విపరీత పరిస్థితే అని చెప్పాలి. అక్టోబర్ నుండీ మార్చి నెల వరకూ శీతాకాలంగానే పరిగణించవచ్చు. సరాసరి ఉష్ణోగ్రతలు కూడా 7’C నుంది 2’C ల స్థాయిలో వుంటుంది. శీతాకాలంలో పగటి సమయం కూడ  చాలా తగ్గిపోతుంది. ఈ వ్యాసం రాస్తున్న సమయానికి, అంటే ఈ రోజు (1-Feb-08) ఉదయం 8:22 కు సూర్యోదయం అయింది. సాయంత్రం 5:26 కల్లా సూర్యాస్తమయం అవుతుంది. వేసవిలో అయితే రాత్రి పదకొండు అయినా ఆకాశంలో సూర్యుడు కనిపిస్తూనే వుంటాడు. అన్నట్టు శీతాకాలంలో కూడా రాత్రి అవగానే మరీ దట్టమైన చీకట్లు ఏమీ కమ్ముకోవు. అంత అర్ధరాత్రి అయినా ఆకాశం అంతా ఓ రకమైన సంజ కెంజాయ వర్ణం కమ్ముకుంటుంది. 


అర్ధరాత్రి అయినా ఆకాశంలో సంజకెంజాయ రంగులే...


హఠాత్తుగా సున్నాకు దిగువస్థాయిలోకి పడిపోయె ఉష్ణోగ్రతలు, విపరీతమైన వేగంతో ( దాదాపు గంటకు 50 నుండి 90 కిలోమీటర్లు) వీచే గాలుల వల్ల చలి ఉధృతి మరింత పెరిగినట్టు అనిపిస్తుంది. మరీ కుంభపోతగా కాకపోయినా వర్షపాతం కూడా ఇదే దారిలో వుంటుంది.


ప్రపంచవ్యాప్తముగ వున్న అతి పురాతన నగరాలలో అమ్‌స్టర్‌డామ్‌ కూడా ఒకటి. క్రీ.శ. 1200 నుండీ ఈ నగరం ఫరిడవిల్లుతూనే వుంది.  వంద, రెండు వందల సంవత్సరాల క్రితం కట్టిన పలు భవనాలు ఇప్పటికీ నగరంలో పూర్తిస్థాయి నివాసయోగ్యమైన భవనాలుగా వున్నాయి. అవడానికి నగరం చాలా పురాతనమైనదైనా, చక్కటి ప్లానింగ్ తో నగరం ముచ్చట గొల్పుతుంది. ముఖ్యంగా నగరంలో చాలా  ప్రాంతాలకు కాలువల రూపంలో విస్తరించిన నీటి రవాణా వ్యవస్థ అద్భుతంగా అనిపిస్తుంది. చాలా మంది తమ తమ ఇళ్ళతో పాటు స్వంతంగా తమకోసం ఒక బోట్ హవుస్ ను కూడా ఏర్పాటు చేసుకుంటారు. శాశ్వతంగా బోట్ హవుసలలోనే నివసించే వారికీ తక్కువలేదు. ఈ బోట్ హవుస్ లు కూడా ఆషామాషీగా వుండకుండా, సకల సౌకర్యాలతో విరాజిల్లుతుంటాయి. సంవత్సరానికి ఒకసారి పార్కింగ్ రుసుము చెల్లించేస్తే, మనకు నచ్చిన చోట బోటుహవుస్ ను కావలసిన చోటుకు తీసుకెళ్ళి కావలసినని రోజులు నిలుపుకోవచ్చు.


ఏమి  ‘Home’ లే హలా, పడవ  గృహములే  ఇలా ... 


మనకు రోడ్ పై రైల్వే క్రాసింగులకు మల్లే ఇక్కడ వాటర్ వే క్రాసింగులు వుంటాయి. వంతెన కింది నుండి చాలా పడవలు క్రాసింగుల గొడవలేకుండా ఎంచక్క వెళ్ళిపోతుంటాయి. కాస్త పెద్ద పడవలు / బోట్ హవుసులు వచ్చినప్పుడు మాత్రం, ట్రాఫిక్ అంతటికీ రెడ్ లైట్ వెలగడం, వంతెనలపై వాహనాలు ఏవీ లేవని నిర్ధారణ అవగానే, నెమ్మదిగా వంతెన తెరుచుకోవడం, అటు పిమ్మట రోడ్డుకు అడ్డంగా నెమ్మదిగా కదిలిపోయె పడవలూ, బోట్ హవుసులు.  చూచి తీరాల్సిన దృశ్యం.


జల రవాణా సదుపాయాలతో పాటుగా నగరంలో రోడ్డు, రైలు రవాణా వ్యవస్థలు కూడా చాలా అభివృద్ది చెందాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రజా రవాణ వ్యవస్థ గురించి. దాదాపు నగరంలోని ప్రతీ మూల నుండీ నిమిషానికి రెండు మూడు ట్రాముల చొప్పున బయలుదేరుతుంటాయి. ప్రతీ వెయ్యి, రెండు వేల గజాలకీ ఒక స్టాపు. వ్యక్తిగత వాహానాల వాహనాలను ఉపయోగించాల్సిన అవసరం ఏవిటిలే అనిపించేంత సౌకర్యంగా వుంటుంది.


ట్రాము, కారు, బైకు, ఏదైనా సరే  పాదచారుల కోసం  ఆగాలసిందే...కళలకీ పెట్టింది పేరైన అమ్‌స్టర్‌డామ్‌లో చూడడానికి బోలెడన్ని మ్యూజియంలు వున్నాయి.సృజనాత్మకత లో కూడా కొంటెతనాన్ని చొప్పించగల సమర్థత చాలా చోట్ల కనిపిస్తుంది.


ఇలాంటి కొంటె ప్రకటనలకీ కొదవేం లేదు మరి ...ఇక్కడి జీవన విధానంపై, ఆర్థిక పరిస్థితి, మరియూ సంస్కృతీ   మరిన్ని ఇతర విశేషాలు తరువాయి భాగాలలో చదవండి.
%d bloggers like this: