కను రెప్పల కౌగిలిలో, నును సిగ్గుల లోగిలి లో…

ఫిబ్రవరి 13, 2008

ప్రియమైన నీ,

          కనురెప్పల కౌగిలిలో, నును సిగ్గుల లోగిలి లో,
          కలలు కనే మనసును కాలం తో కదిపితే, కదిలే  నా ఆశలు …
          ఇలా,
          పరుచుకున్న అక్షరాలు,
          పరువపు విరి శరముల వ్రాలు..
 
          గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో విరిసిన ఆ రాత్రి,..

          నుదుట కుంకుమ బొట్టు పెట్టి,
          వలపు తలపుల చీరకట్టి,
          సిగ్గు పక్కన ఒగ్గి పెట్టి,
          బుగ్గ చుక్కన ముద్దు పెట్టి,

          గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో తడిసిన ఆ రాత్రి,..

          పలకరింతలే పులకరింతలై,
          నిలువరింతలే పలవరింతలై,
          కనులు కావ్యపు  కవితలల్లగా,
          పెదవి శ్రావ్యపు మరులు చల్లగా,
 
          గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో గడచిన ఆ రాత్రి,..

          పులకరింతలే పలకరింతలై,
          పలవరింతలే నిలువరింతలై,
          నే కౌముదిలో నిను చూచి,
          నీ కౌగిలిలో నను దాచి,

          గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో ఎగసిన ఆ రాత్రి,..

          పరవశమే పరిచయమై,
          పరువంలో విరి శరమై,
          మనసంతా నీ వశమై,
          మది అంతా పరవశమై,
 
          గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో ముగిసిన ఆ రాత్రి,..

          నువ్వూ నేనూ ఒక స్వరంగా
          నువ్వే నాకై ఒక వరంగా,
          నా మనసులో మిగిలుండనీ !
          నీ మనసుగా నను వుండనీ !!


లెక్కలేనంత ప్రేమతో,

నీ  కనురెప్పల కౌగిలిలో…

=======================================================

నాకు అందనంత దూరాన వున్న నీకు, “నన్ను” నేను అందించే ప్రయంత్నంలో,
ఇదంతా…

నన్నందుకుంటావని, ఎదకందుకుంటావని,,
ఆశతో…, అదే శ్వాసతో…

నేను 

ప్రకటనలు

%d bloggers like this: