శంకరాభరణం 3-D

జూలై 9, 2013కొద్దిరోజుల క్రితం హఠాత్తుగా విదేశాలకు వెళ్ళాల్సి వచ్చింది. నేను అలా బయలుదేరటము, అరటి తొక్కపై కాలేసినట్టు, రూపాయి విలువ జారిపోవడము ఒకేసారి జరిగాయి. డాలరు బూస్టూ, హార్లిక్సు తాగి కుమ్మెస్తుంటే, నే వెళ్ళిన దేశపు నగదు విలువ కూడా కలరా వచ్చిన కోడిపిల్లలాగా కూలబడిపోయింది. ఇలాంటి స్థితిలో, నా దగ్గర మా పెద్దాయన డాలర్లలో ఇచ్చిన భత్యం పర్సు పగిలేలా బలిసి, బయటకు తొంగి చూడ్డం మొదలెట్టింది. అలాగని పెద్దాయన నాకేదో బహు వుదారంగా ఇస్తారనుకునేరు. ఆబ్బే, తెలుగు సినిమాల్లో ఐటం పాపల బట్టలకు తీసిపోకుండా ఇస్తారు. కట్టుకున్నా, ఆకట్టుకున్నా అంతా దాన్లోనే.ఇలా నేను డాలర్ల దురదతో సతమతమౌతుండగా, ఒక రోజు సాయంత్రం బసకు తిరిగివస్తూ, స్థానికంగా పైగా వుచితంగా దొరికే పత్రిక తెచ్చుకున్నాను. ఆ సాయంత్రం కాస్త బీరు చప్పరిస్తూ, చూద్దును కదా, పత్రిక మొదటి పేజీలోని 46 అంగుళాల స్మార్టు టివీ (Smart TV) ప్రకటన నన్ను ఆకట్టుకొంది.శ్యాంసంగ్ వారి సదరు మోడలు టివీ భారతదేశంలో ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇదే మోడలు టివీ కి దరిదాపుల్లో వున్న టివీ ధర ఆరంకెల్లో మిడిసిపడుతోంది. జాతర్లో ధర మన దేశపు ధర కన్న చాలా తక్కువ. పైగా చక్కని సదుపాయాలు. ముఖ్యంగా ఒక్క బటన్ తో మామూలు టివీ కార్యక్రమాన్ని 3D లోకి మార్చుకోవచ్చు. ఏ పాడుతా తీయగా లాంటి ప్రొగ్రామో 3D లో చూస్తూ ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొన్న అనుభూతి సొంతం చేసుకోవచ్చు. ఓక్క ఈ ప్రొగ్రామే అని ఏమిటి, క్రికెట్టూ మ్యాచులు, కోరుకున్న సినిమాలు, మీరు స్వంతంగా ఇంట్లోనో, పికినిక్కులోనో తీసిన వీడియోలు అన్నీ 3D లో కి మారిపోతాయి. (నేను HD వీడియో కెమెరా తో తీసిన వీడియోలను పరిశీలించాను. 3D ఎఫెక్టు అద్బుతః 3D కెమెరా తో చిత్రీకరించిన స్థాయి లో దృశ్యాలు కనువిందు చేసాయి అంటే నమ్మండి)ఇంకో చక్కని సదుపాయం ఏమంటే, శతభిశలు ఏమీ లేకుండా ఇంట్లోని వై-ఫై ఇంటర్నెట్ తో అనుసంధానమవుతుంది. ఆలాగే స్మార్ట్ ఫోన్‌తో కూడా. ఫోన్లో వున్న వీడియోను అలా టివీ వంక తోసేస్తే ఎంచక్కా అదంతా టివీలో వచ్చేస్తుంది.ఇన్ని చక్కని సదుపాయాలన్నీ మూటగట్టినట్టున్న టివీ చవగ్గా వస్తోందనగానే కొనాలనిపించింది. ఆసలు సమస్య అప్పుడు మొదలైంది. నేను ఎంపిక చేసుకున్న టివీ సైజు సాధారణంగా విమానాల్లో అనుమతించే బాగేజ్ కొలతల కన్నా చాలా ఎక్కువ. అమ్మకపు జాతర అయ్యెలోపు కొనాలని వున్నా, తీరా కొన్నతరువాత అంత పెద్ద కొలతలు గల టివీ విమానంలో అనుమతించకపోతే, రెంటికీ చెడిన కథ అవుతుంది.ముందుగా నా తిరుగు ప్రయాణపు విమాన సంస్థ కు రాసాను, ఇలాగిలాగ నేను మీ విమానాల్లో తెగ తిరుగుతాను. నా తిరుగుబోతు తనాన్ని మీరు కూడా ఫలానా నంబరుతో ముడేసి బోలెడు పాయింట్లు నా ఖాతాలో జమ చేసి గాలిగాడు అని బిరుదు కూడా ఇచ్చారు. మరేమో ఇప్పుడు నాకిలాగ అవసరం వచ్చింది. కాస్త సాయం చేద్దురూ అని మొహమాటం లేకుండా అడిగేసాను. రెండు రోజులపాటు బెల్లం కొట్టిన రాయిలాగా గమ్మున కూర్చున్నారు. తర్వాత రోజుకో రెండుసార్లు పొడిస్తే నాలుగు రోజుల తర్వాత సరే అని తలూపారు.ఈలోగా సదరు అమ్మకాల జాతర అయిపోయింది. అక్కడా ఇక్కడా గాలించినా ఎక్కడా ఆ మోడలు టివీ షాపుల్లొ కనిపించలేదు. సర్లే, మన సుడి ఇంతే అని మళ్ళీ కాస్త బీరు చప్పరించేసి నోరు మూసుకున్నాను.ఇండియా బయలుదేరడానికి సరిగా ఒక రోజు ముందు, బోజనం చేయడానికి ఆఫీసుకి కాస్త దూరంగా వున్న ఒక రెస్టారెంటుకి ఒక స్నేహితుడితో వెళ్ళాను. రెస్టారెంటు పక్కనే పెద్ద టివీ ల దుకాణం. ఊత్సుకతతో లోనికి తొంగి చూసాను. నేను ఎంపిక చేసుకున్న మోడల్ టివీలు కేవలం రెండంటే రెండు, అదిన్నూ, జాతర ధర కన్నా ఇంకాస్త తక్కువ ధరలో. ఇంకేమీ ఆలోచంచకుండా కొనేసాను.చెక్ ఇన్ సరిగమలు, కస్టమ్స్ వారి పదనిసలు అస్వాదిస్తూ టివీ ఇంటికి చేర్చాను.ఇదుగో ఈ టివీ లోనే మొన్న వరసబెట్టి చాలా సినిమాలు చూసాను. ఆన్నీ 3Dలో. మిధునం, శంకరాభరణం(శంకరా, నాద శరీరాపరా పాట గొప్ప అనుభూతి. శంకర శాస్త్రి వీరంగాన్ని మనం ఓ పక్క నించొని చూస్తున్నట్టుగా) సాగరసంగమం(తకిట తధిమి పాట వేరే చెప్పాలా)తనికెళ్ళ భరణి గారు, విశ్వనాథ్ మాష్టారు వింటున్నారా నేను మీ సినిమాలు 3D లో చూసాను.

ప్రకటనలు

%d bloggers like this: