ఆ దేశమూ ఈ దేశమూ తిరుగుతూ పుట్టిన దేశాన్ని తిరక్కపోతే బావుండదని బుద్ది పుట్టి, ఓ ఆరు నెలల క్రితం ముంబై లో దిగీ దిగగానే పోలోమంటూ బోలెడు చోట్లకు బయలుదేరాను. వెళ్లేప్పుడు తోడుగా బోలెడు పాటల్ని తీసుకెళ్ళేను కదా, అలాగే వచ్చేప్పుడు బోలెడు జ్ఞాపకాలు తోడు తెచ్చుకోవచ్చని, భుజాన ఓ కెమెరా తగిలించుకుని మరీ కారెక్కాను. సెల్ ఫోన్ లో కెమెరా ఎంచేతో నాకు అస్సలు నచ్చని విషయం అనుకోండి. నా ప్రయాణంలో పదనిసలు కొన్ని, జ్ఞాపకాల గమకాలు కాసిన్ని ఇక్కడ గుది గుచ్చేను.
ముసురుపట్టిన ముంబై నుండి బయట పడి అరవై కిలోమీటర్లు అలా అడవిలోకి వెళ్ళి, “దేశమెంత మధురం, పరదేశమంత కఠినం … ” అని అనుకుంటుండగానే మేఘపు షాలువా కప్పుకున్న ప్రకృతి ఇదిగో, ఇలా స్వాగతం చెప్పింది.
చెప్పొద్దూ, ఎప్పుడో విన్న పాట అలలు అలలుగా గుర్తొచ్చేసింది.
“మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ,
ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను చేరెదను,…”
అలా ఇంకాస్త ముందుకెళ్ళగానే వలపు గాలి తమకం తో చుట్టేసినట్టు ఇదిగో ప్రకృతి ఇలా అల్లుకుపోయి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటే, ఏమని చెప్పను, ఎలా చెప్పను?
హమ్మయ్య , దారి తెలిసింది అన్న ఉత్సాహంతో కారు స్టార్టు చేస్తూ అలవాట్లో పొరపాటుగా నేను “థాంక్యూ ” అన్నాను.
“వెరీమచ్ ” అంతే వేగంగా ఆ కుర్రాడు నాకు సమాధానం చెప్పేడు. “నాక్కూడా వచ్చు లేవో ఆ మాత్రం ఇంగ్లీష్ … ” అన్నట్టున్నాయి అతని కళ్ళు.
అలా నవ్వుల ఆటలతో , ఆటల పాటలతో, పెదాల అంచున పదాలు పాడుతూ, మంచు తెరల చాటుగా, గాలి మరల మీదుగా ప్రయాణించి ఆ రాత్రికి గమ్యం చేరుకున్నాను. చాలా కాలం తర్వాత కలుసుకుంటున్న ఆనందం కాబోలు,ఇన్ని వందల మైళ్ళు ప్రయాణించినా కాస్త అలసట కూడా లేదు.
అక్కడక్కడా విసిరేసినట్టున్న ఇళ్ళు. అంతా కలిపి ఓ రెండు వందలు వుంటాయేమో.
కరంటు పోయి చాలా సేపు అయినట్టుంది. కప్పల బెక బెకలు, కీచురాళ్ళ రొద;
నా చుట్టూ మాత్రం జ్ఞాపకాల పయ్యెద.
పొరలు పొరలుగా విప్పుకునే నా జ్ఞాపకాల అరలు,
తెరలు తెరలుగా కమ్ముకునే జీవితాల సరాగాలు,
మధ్య మధ్యలో జంతికల జావళీలు, కూడా మమకారపు కారప్పూస,
ఓ చేత చేగోడీలు, ప్లేటు నిండా పకోడీలు, ఆపై వేడి వేడి టీలు.
వదిలిపోకుండా నేనూ వున్నాను అని అప్పుడప్పుడూ త్వరపడే వరుణుడి అడుగుల సవ్వడి;
-జల్లు జల్లు మంటూ
నిదురపోకుండా నేనూ వింటున్నాను అని ఎప్పటికప్పుడు తడబడే, వయసు పైబడిన స్వర సడి;
-ఖళ్ళు ఖళ్ళు మంటూ
పక్క గదిలోకి వెళ్ళి అడిగాను. “తాతగారూ ఎలా వున్నారు”?
“బానే వున్నాను కానీ, ….” కాస్త ఆగి శ్వాస తీసుకొని “వయసైపోతుంది కదరా.., ఎనభయ్ దాటలేదూ,నీ కబుర్లు వింటున్నాను… చాలా పెద్దాడివయ్యావ్”
ఒకప్పుడు వేదం పలికిన దేహం
ఇప్పుడు నిర్వేదం తొణికే దేహం
పెళ్ళి చేసుకుంటావా తాతా అంటే నాకు పిల్లనెవరిస్తార్రా అని అనటం మామూలే కదా, అలా కాసేపు ఉత్సాహాం పోగేద్దామని తాతకి కబుర్లు చెప్పడం మొదలెట్టాను.
“ఏదో వర్షం పడుతోందని ఇలా పడుకున్నావు కానీ, అసలు వయసైపోయినట్టు కనిపిస్తున్నావా తాతా? నేనుండే దేశంలో, నీకులా ఉత్సాహంగా వుండే వాళ్ళంటే పడి చస్తారు తెలుసా. అందాకా ఎందుకు; నువ్వు అనుకోవాలే గానీ పడుచు పిల్లలు మీ వెంట తిరగరూ…”
“ఆ,.. ఆ.. వయసైపోయినవాన్ని, పడుచు పిల్లల గొడవ నాకెందుకుగానీ ఒరే అబ్బీ, వూరంతా పడవల్లో లాహిరి లాహిరి అంటూ తిరగొచ్చన్నావ్, హిమపాతాలన్నావ్, సుందరాంగులు, స్వేచ్చాప్రణయాలు, సంపదలు అన్నీ అంటున్నావ్, ఇలాంటి లక్షణాలతో వుండే వూరు గురించి మా కాలంలో పురాణాల ఆచార్యులు చెప్పేవారు. వూరు పేరేమిటన్నావ్.. మళ్ళీ చెప్పు.” అన్నాడు శ్వాస ఎగపీలుస్తూ
“అమ్‌స్టర్‌డామ్ తాతయ్య.” చాతీ పై నిమురుతూ చెప్పాను
“అంతో ఇంతో వేదాధ్యయనం చేసిన వెధవ్వి, నీకూ ఉచ్చారణా దోషాలేమిట్రా? ఆచార్యులవారిలా స్వచ్చంగా అమరేశ్వరధామం అన్లేవూ. నోరు తిరగని మ్లేచ్చవెధవలు అమ్‌స్టర్‌డామ్ అంటే నువ్వు అలాగేనా అనడం. …… ¤§£..=#/..æm?€^~ “
తాతయ్య ఎడా పెడా వాయించేస్తున్నాడు. అనీ వేదాల్లోనే వున్నాయిష అని గిరీశం చెప్పింది నిజమేకాబోలు.
….ఏమని చెప్పేది తాతయ్యకి
==================================================
కొన్నాళ్ళ (కొన్నేళ్ళ అనాలేమో ) క్రితం రాసిన అమ్‌స్టర్‌డామ్ విశేషాలు ఇక్కడ చదవండి



ప్రసాదం యొక్క టపా