బద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ, బార్యలు మారరు లే నెవరూ…

అక్టోబర్ 1, 2007

“కమలా కుచ చూచుక కుంకుమతో…” అని బ్రెయిన్ వేవ్స్ జెనరేట్ అవుతుండగా నాకు మెలకువ వచ్చింది. అప్పుడే టైం అయిపోయిందా అనుకుంటుండగా  కళ్ళ ముందు ఒక్క క్షణం “IET” (Indian Eastern Time) మెరిసింది.

“2017 Sep 29 05 10 00”.

స్పేస్ స్టేషన్ ఆర్బిటర్-29  లో నేను రెండు నెలలుగా పని చేస్తున్నాను.   నేను చేసే పని గురించి చెప్పాలంటే కొంచం ప్రపంచ చరిత్ర గురించీ, ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన రెండు ముఖ్య ఆవిష్కారాలను గురించి చెప్పాలి.  

2014 లో ప్రవస్ అనే భారతీయ సాంకేతిక వేత్త , “లిమిటెడ్ బ్రెయిన్ వేవ్స్ ప్రోగ్రామింగ్ అండ్ ఇంటిగ్రేషన్” ను కనిపెట్టడం తో ప్రపంచం లోంచి మొబైల్ ఫొన్, క్లాక్ లాంటి చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు తుడిచి పెట్టుకుపొయాయి. ప్రవస్ టెక్నాలజీ అని పేరొందిన ఈ పద్దతిలో, నియమిత స్థాయిలో మెదడు తాలూకూ స్పందనలను నియత్రించడం, ప్రసారం చేయడం సాధ్యపడింది. గతంలో ఉదయం నిద్రలేవగానే సమయం తెలుసుకోవడానికి గడియారం వంకో, మొబైలు వంకో చూడాల్సి వచ్చేది. కాని, ప్రవస్ టెక్నాలజీ ద్వారా, “టైమెంతయిందో?” అని మనసులో అనుకోవడం ఆలస్యం, కళ్ళముందు సమయం మెరుస్తుంది. “అంజిగాడు ఎలా ఉన్నాడో ?” అని అనుకోవడం ఆలస్యం,”ఆంజి గాడికి నా మేధొ తరంగాలు చేరిపోతాయి.  ఈ టెక్నాలజీ సంగతి నాకు తెలియగానే ముందు నేను మా మార్కెటింగ్ బాలాజీ ని తల్చుకున్నాను. “పెళ్ళంటేనే వేడెక్కిందీ గాలి!… మళ్ళీ అంటే ఏమవుతాడో బాలాజీ…” అని ఇందాక ఒక సారి వాడి పెళ్ళి కథ అని నా బ్లాగు లో పెట్టినట్టు గుర్తు. వాడు, వాడి పెళ్ళైన తర్వాత కథలు ఒకోటి మరింత వివరంగా చెబుతుంటే పడీ పడీ నవ్వాను. 

ఇలాంటి సర్వీసులన్నిటికీ  ప్రవస్ సంస్థ రుసుమును వసూలు చేస్తుంది. ప్రవస్ టెక్నాలజీస్ ప్రారంభించిన నాల్గవ నెల ప్రవస్ ప్రపంచంలో కెల్లా ధనికుఢయ్యాడు.  ఏదేమైతేనేం, గతం లో మాదిరి టెలిఫోన్లు, సెల్ ఫోన్లతో కాకుండా, భాషా, స్థాయిలతో పని లేకుండా నేరుగా సమాచారాన్ని, కోరుకున్న వ్యక్తికి అందించడం సాధ్యమవుతొంది. 

ఇదే టెక్నాలజీ లో ప్రకటనలు కూడా నేరుగా వినియొగదారులకు చేరడం తో, ఆదాయం లేక న్యూస్ పేపర్లు, టివీ ఛానళ్ళు దాదాపుగా మూత పడే స్థితికి  వచ్చాయి. కోరుకున్న వినియోగదారునికి మాత్రం ప్రకటన చేరుతుంది. మిగిలిన వాళ్ళకి మాత్రం ఆ సంగతి కూడా తెలీదు. ప్రకటనలను నేను వద్దనుకోవడంతో నాకు ఆ గోల లేకుండాపోయింది.

తల పక్కకు తిప్పి చూసాను నేను . గాజు అద్దంలోంచి సుదీర్ఘమైన నిశీధి చివర మెరుస్తున్న భూమి అంచు. 

వేపర్ కాబిన్ (ఆవిరి గది) లో నుండి బట్టలు వేసుకొని బయటకు వస్తూ టెలిపోర్టేషన్ సర్వీస్ కు బ్రేకుఫాస్ట్ ఆర్డర్ చేసాను. మరో రెండు నిమిషాల్లో వేడి వేడి ఇడ్లీ, సాంబార్, అల్లం పచ్చడి  ప్రత్యక్షం. మానవ జాతి ని మలుపు తిప్పిన మరో అద్బుత ఆవిష్కారం టెలిపోర్టేషన్. ప్రతీ వస్తువునీ ఆణువుల కిందికి విడగొట్టవచ్చు కనుక ఆణువులను కూర్చడం ద్వారా ఏ పదార్థాన్ని అయినా రూపొందిచవచ్చు అన్న సిద్దాంతం ఆధారంగా టెలిపోర్టర్ ను కనిపెట్టిన తర్వాత సరకు రవాణా వ్యవస్థ అనేది దాదాపుగా లేకుండా పోయింది. 

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరింత స్థలం పెరిగే అవకాశం ఏదీ లేకపొవడంతో సాధ్యమైనన్ని సర్వీసులను రోబోలకు అప్పగించి వాటిని స్పేస్ స్టేషన్ నుండి పనిచేసేలా రూపొందించిన ప్రాజెక్టుకు నేను చీఫ్ టెక్నాలజిస్టు గా పని చేస్తున్నాను. అదిగో ఆ పనిలో భాగంగానే రెండు నెలలు క్రితం ఆర్బిటర్-29 కు వచ్చాను.

ప్రతీ రోజూ తినేప్పుడు మా ఆవిడతో కాసేపు కబుర్లు చెప్పడం అలవాటు అయిపోయింది. మిగితా టైము లో సాధారణంగా నేను బిజీ గా ఉంటాను కనుక తనతో అసలు మాట్లాడం కుదరదు. ఇడ్లీని తుంచి సాంబారులో వేస్తూ, “హలో, ఏంటీ సంగతులు ” అన్నాను. స్పేస్ స్టేషన్ లో ఉన్నా సరే, చేతితో తినడమే నాకు ఇష్టం. అలా తుంచి నోట్లో వేసుకున్న ఇడ్లీ కరిగిపోకముండె కాసింత అల్లం పచ్చడి నాలిక్కి రాసుకుంటే ఉంటుంది చూడండి, అహా,  

స్పేస్  స్టేషన్ కు భూమికి మధ్య గల దూరం దృష్ఠ్యా, రెస్పాన్సు రావడానికి 8 నుండి 10 సెకన్ల సమయం పడుతుంది. ఇంకో ఇడ్లీ ముక్క తుంచబోతుండగా, ఎదురుగా వర్చువల్ రియాలిటీ లో 3-డి ప్రతిబింబము ప్రత్యక్షమైంది.అయితే, అనుకున్నట్టుగా అది మా ఆవిడది కాదు. ప్రపంచ సుందరి నిశ్వర్యారాయ్ ది. 

తినబోతున్న ఇడ్లీ నోట్లోంచి జారి పోయింది.

“మీ గురించే ఆలోచిస్తున్నాను ప్రసాదం..ఆసలు మీరంటే, చాలా ఇష్ఠం నాకు ” అంది నిశ్వర్య 

నాకు గుండె ఊడి గొంతులోకి వచ్చినట్టు అనిపించింది.

“..కానీ, మీరు నన్ను … ఐ మీన్…ఇలా మాట్లాడటం …ఓహ్హ్ నాకేం చెప్పాలో తెలీడం లేదు”

“ప్రసాదం, నేను ఎక్కడ ఉన్నా ఎప్పుడూ నీ గురించే అనుకుంటూ ఉంటాను. నిన్ను కొంచం ముందు చూసి ఉంటే , ఎలాగైనా నిన్నే చెసుకునేదాన్ని, ప్చ్ నాకు అదృష్టం లేదు”

“నిశ్వర్యా,.. ఇదంతా నిజమేనా?….నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. అంటే చాలా మందికి నువ్వంటే ఇష్టం అనుకో, కానీ నేను వేరు…అంటే…” నాకింకా తడబాటు పోలేదు. 

“ప్రసాదం, నాకు షూటింగ్ ఉంది . మళ్ళీ ఎప్పుడు….” అని ఇంక ఎదో అనబోతుండగా, నేను అన్నాను.

“ఫరవాలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, నీ ఇష్టం” అంటుండగా నిశ్వర్యారాయ్ అదృష్యమై మా ఆవిడ ప్రత్యక్షమైంది.

“ఏవిటీ, మీకు నిశ్వర్యా రాయ్ కావాలా? పెళ్ళై ఇన్నాళ్ళైనా ఇంక పెడబుద్ది పోలేదు. నాతో మాట్లాడటానికి అయితే బిజిగా ఉంటానని చెబ్తారా? నిశ్వర్యారాయ్ అయితే ఎప్పుడైనా ఫర్లేదా?….నాకన్నీ తెలుసు…..”

“అది కాదు ….” అని నేనేదో చెప్పబోతుండగా,

“మీరేం చెప్పక్కర్లేదు. ఇప్పుడు వచ్చింది కూడా నేనే, నిశ్వర్యారాయ్ కాదు. గంట క్రితం కొత్తగా మార్కెట్లోకి రిలీజైన లయర్ అండ్ లవ్లీ క్రీం రాసుకుని దానిపై నిశ్వర్యారాయ్ ఫేస్ పాక్ అప్లై చేసుకుంటే అచ్చు నిశ్వర్యారాయ్ లా ఉంటారని చెప్పారు. ఐదు నిమిషాల సాంపిల్ పాక్ అప్ప్లై చేసుకుని వస్తే మీ అసలు రంగు  తెలిసింది. ఈ సారి వీకెండు కు ఇంటికొచ్చేయండి ” అని అదృష్యమైంది.

ఇక చెప్పడానికేం ఉంది.

మా ఆవిడ ఇంతే, మరి మీ ఆవిడ…?

=============================================================

సరదాలు అన్నా, సైన్సు ఫిక్షన్ అన్నా చాలా ఇష్టం. ఈ రెంటిని కలిపితే ఎలా ఉంటుంది అన్న ఊహకు రూపం తొడిగితే ఈ కథ తయారైంది. ఇది సరదా సైన్సు ఫిక్షన్ కథ అవునో లేక, తలా తోకా లేని తెలుగు సినిమా కథో  చెప్పాల్సింది మీరే.

ప్రసాదం