హరే రామ , హరే కృష్ణ , కృష్ణ కృష్ణ, సరే సరి…

డిసెంబర్ 10, 2007

నా చిన్నతనంలో 4వ తరగతి అయిన వేసవి సెలవల్లో కాబోలు, ఒక లావాటి పుస్తకం నా చేతికిచ్చి చదవమంది మా అమ్మ. దాదాపు వెయ్యి పేజీల ఆ పుస్తకం పేరు రామాయణం. ఆ వేసవి సెలవులోనే మహా భారతం ను కూడా ఒక పట్టు పట్టాను. చిన్నప్పటి నుండీ భగవద్గీత శ్లోకాలను తాత్పర్యాలతో సహ స్కూల్ (సరస్వతీ శిశుమందిర్) లో వల్లె వేయించడంతో దాన్ని మొదటిసారి ఎప్పుడు చదివానో గుర్తులేదు.


కారణం తెలీదు కానీ నెమ్మది నెమ్మదిగా, నాకు శ్రీ కృష్ణుడు తాలూకూ అలోచనా పద్దతి ఎక్కువ నచ్చినట్టు అనిపించింది. జీవితాన్ని అతడు ఎదుర్కున్న పద్దతీ, వివిధ సమస్యల పట్ల అతని దృక్పథం, నాకు స్పూర్తినిచ్చాయి. ఈ స్పూర్థినివ్వడంలో శ్రీకృష్ణుడి చుట్టూ తిరిగిన గోపికల పాత్ర చాలా తక్కువ అని మాత్రం చెప్పగలను. జీవితంలో ఎదో సాధించాను అని కాదు కానీ, ఒక స్థాయికి వచ్చిన తర్వాత, రోజులు గడుస్తున్నకొద్దీ కృష్ణుడి జీవిత విధానం పట్ల నాకు ఎందుకు ఇష్ఠం ఏర్పడిందో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరగడం మొదలైంది. కొద్ది రోజుల క్రితం మా అమ్మ పూజా పీఠం లో ఉన్న ఒక పుస్తకం చదివినప్పుడు నాకు ఏదో కాస్త అర్థం అయినట్టు అనిపించింది. ఆ పుస్తకం లో నన్ను అంతగా ఆకర్షించిన ఆ భాగం ఏవిటంటారా? అది ఇక్కడ చదవండి.


ఒకానొక ఊహాజనిత సమయంలో, ఊహాజనిత స్థలంలో రాముడు. కృష్ణుడు కలుసుకుని తమ గురించి ఇలా అనుకున్నారు(ట).


రామ : నన్ను రాముడు అంటారు. నేను సూర్య వంశానికి చెందిన వాన్ని. ఆది శేషుడు బలరాముడు అనే పేరుతో నాకు తమ్ముడు గా జన్మించాడు. నేను మా సోదరులలో పెద్దవాన్ని. నా జననం అయోధ్య నగరంలో చాలా వైభవంగా జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు నేను జన్మించాను.

కృష్ణ : నన్ను కృష్ణ అంటారు. నేను చంద్ర వంశానికి చెందిన వాన్ని. ఆది శేషుడు బలరాముడు అనే పేరుతో నాకు అన్న గా జన్మించాడు. నేను మా సోదరులలో చిన్నవాన్ని. నా జననం మధురలో కారాగారం లో భయాందోళనల మధ్య జరిగింది. రాత్రి 12 గంటలకు నేను జన్మించాను.

రామ : నా బాల్యం చాలా ఆనందంగా వేడుకగా గడిచింది. నేను పదహారేళ్ళ వయసులో ఒక విష బాణాన్ని ప్రయోగించి తాటకి అనే రాక్షసి ని వధించాను.

కృష్ణ : నా బాల్యం చాలా ప్రమాదాలతో, భయాలతో గడిచింది. నేను ఆరు రోజుల వయసులో పూతన అనే రాక్షసి ఇచ్చిన పాలు తాగుతూ, ఆ రాక్షసి ప్రాణాలు కూడా పీల్చేసాను.

రామ : నేను ఏకపత్నీ వ్రతున్ని. నా భార్యను రావణుడు అనే రాక్షసుడు అపహరించాడు. అతన్ని వధించి సీతను రావణ చెరనుండి విడిపించాను.

కృష్ణ : నేను బహు భార్యా సమేతున్ని. నా భార్యలలో ఒకతైన రుక్మిణిని నేను అపహరించి తెచ్చుకున్నాను. అడ్డు వచ్చిన శిశుపాలున్ని నామ మాత్రం కూడా లేకుండా చేసి శత్రుత్వం లేకుండా చేసుకున్నాను.

రామ : నన్ను వాంఛించి వచ్చిన శూర్పణకకు ముక్కు చెవులు దూరం చేసి వికృతంగా మార్చేసాను. నేను సదా ధనుర్బాణాలతోనే ఉంటాను. అందుకే నన్ను కోదండ రాముడు అంటారు.

కృష్ణ : నన్ను అభిలాషించి దగ్గరైన కుబ్జ యొక్క వికార రూపం పోగొట్టి అందమైన సుందరిగా తీర్చిదిద్దాను. నేను ఆయుధాలు ధరించను. పిల్లనగ్రోవితో ప్రకాశిస్తూ ఉంటాను. అందుకే నన్ను వేణు గోపాలుడు అంటారు.

రామ : ధర్మమే నాకు ప్రాణం. మానవులకు ధర్మాచరణం ఆచరించి చూపాను. అందుకే నన్ను రామో విగ్రహవాన్ ధర్మః అని శ్లాఘించారు.

కృష్ణ : ప్రేమయే నాకు ఊపిరి. జ్ఞానమే నాకు ప్రాణం. జ్ఞానంతో శోభించడం ఎలాగో మానవులకు ఆచరించి చూపాను. అందుకే నన్ను “కృష్ణస్తు భగవాన్ స్వయం ” అని కీర్తించారు.

రామ : నా భార్యను రావణుడు అపహరించిన వార్త నా గుండెను కుదిపేసింది. సీత లేనిదే బతుకెందుకని విలపించాను. సీత నన్ను చేరిన తర్వాతే నా హృదయం శాంతించింది.

కృష్ణ : నేను దూరమైతే ఆ వియోగంతో నా గోపికలందరి హృదయాలు నలిగిపోయేవి. కృష్ణుడు లేనిదే మా బ్రతుకెందుకని ఏడ్చేవారు. నేను మళ్ళీ వారికి కనిపించిన తర్వాతే వారి హృదయం శాంతించేది.

రామ : నేను ఒక్క అబద్దం కూడా చెప్పలేదు. దొంగతనం నాకు తెలియదు. హాస్యపు మాటలు నాకు తెలియవు. నన్ను అందరూ మర్యాద పురుషోత్తముడు అనేవారు. నన్ను సమీపించాలంటే అందరికీ భయం.

కృష్ణ : నాకు అబద్దాలు మంచి నీళ్ళు తాగినట్టే. దొంగతనం నా గుణం కాదు, వృత్తి. నాదంతా హాస్య భాషణమే. పొట్టచెక్కలయ్యేలా నవ్వే వారు నా సహచరులు. అందరూ నన్ను ప్రేమ మూర్తి అనేవారు. నన్ను సమీపిస్తే,తిరిగి ఎవరూ విడిచి వెళ్ళరు.

రామ : నా గుండెలో అంతా కరుణే. ఎవరికి ఏ కష్ఠమొచ్చినా నేను చింతించే వాన్ని. నాది జాలి హృదయం.

కృష్ణ : నా గుండెలో అంతా జ్ఞానమే. నా జీవితంలో ఉప్పెన లాగా కష్టాలొచ్చి పడినా నేను చలించే వాన్ని కాదు. నాది జ్ఞాన హృదయం.

రామ : నేను ఏకపత్నీ వ్రతున్ని కానీ ఏం ప్రయోజనం. జీవితమంతా బాధలే, దుఖాఃలే, ఏడుపులే

కృష్ణ : నేను బహు బార్యా సమేతున్ని. అయితే ఏమి? జీవితమంతా ఆటలే, పాటలే, ప్రేమ బాటలే.

రామ : నా భార్య ఉత్తమురాలు. ఆదర్శ మహిళ. అందుకే గౌరవంతో ఆమె పేరును నా పేరుతో జోడించి సీతారాం అని కీర్తిస్తారు భక్తులు.

కృష్ణ : నా భార్యలు కూడా ఉత్తములే. ఆదర్శ మహిళలే. కానీ నా పేరుకు ముందు వాళ్ళ పేర్లు ఉండవు. రాధ అని మరొకరి భార్య ఉంది. ఆమె పేరును నా పేరుకు తగిలించి రాధేశ్యాం అని అంటారు భక్తులు.

రామ : నేను కాంచన మృగాన్ని తీసుకు రావాలని వెళ్ళి నా భార్య సీతను పోగొట్టుకున్నాను.

కృష్ణ : నేను శ్యమంతకమణిని తీసుకురావాలని వెళ్ళి మణితో పాటు జాంబవతి అనే భార్యను కూడా తెచ్చుకున్నాను.

రామ : నేను యుద్దంలో భయంకరంగా పోరాడేవాన్ని. రామ బాణానికి ఎదురులేదని చెప్పుకునే వారు. దిక్పాలకులు కూడా జడిసి పారిపోయేవాళ్ళు.

కృష్ణ : నేను యుద్దం చూసే వాడినే గానీ, చేసే వాడిని కాదు. మురళియే నా ఆయుధం. నా మురళి రాగం విని దిక్కులే కాదు, దివి కూడా ద్రవించిపోయేది.

రామ : నన్ను దేవుడని చాలామంది నమ్మే వారు. నేను అంగీకరించ లేదు. నేను మానవ మాత్రున్ని. దశరథ కుమారుడిని అని చెప్పు కున్నాను.

కృష్ణ : నన్ను దేవుడని అంగీకరించుటకు చాలా మంది సందేహించినారు. నేను అవన్నీ లెక్క చేయలేదు. నేనే పరమాత్మను అని ఢంకా బజాయించి మరీ చెప్పాను.

అందుకే మరి.కృష్ణ కృష్ణ, సరే సరి

మీ ప్రసాదం